ఊపిరి బిగబట్టాల్సిందే

ABN , First Publish Date - 2021-05-11T05:37:14+05:30 IST

కొవిడ్‌ రోగులకు కీలకంగా మారిన ఆక్సిజన్‌ ఖరీదైంది.

ఊపిరి బిగబట్టాల్సిందే

ఆక్సిజన్‌ సిలిండర్‌, పరికరాల ధరలు ఆకాశంలో..

చెలరేగిపోతున్న బ్లాక్‌ మార్కెట్‌

భీమవరం, మే 10 : కొవిడ్‌ రోగులకు కీలకంగా మారిన ఆక్సిజన్‌ ఖరీదైంది. సిలిండర్‌ ధరతోపాటు ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షించుకోవడానికి వినియోగించే పరికరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డిమాండ్‌ ఆధారంగా వ్యాపారులు, కంపెనీలు అమాంతంగా పెంచిన ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కొనుగోలు చేయక  తప్పని పరిస్థితుల్లో జనం అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్‌ పల్స్‌ చూడటానికి ఉపయోగించే ఆక్సోమీటర్‌ ఖరీదు రూ.800 ఉండేది. ఇప్పుడు రూ.1600 నుంచి రూ.2500 పలుకుతోంది. ఆక్సిజన్‌ ఫ్లో మిషన్‌ ధరైతే మరీ దారుణంగా పెరిగిపోయింది. ప్రాణవాయువు సిలెండరు నుంచి ముక్కు ద్వారా గాలిని పంపించే ఈ పరికరం ధర మొన్నటి వరకు రూ.1600 – రూ.1800. ఇప్పుడు డిమాండ్‌ ఉండటంతో రూ.11 వేలకు పెంచేశారు. బ్లాకులో ఇటీవల రూ.16 వేలకు కొనాల్సి వస్తోంది. బ్రీతో మీటర్‌ అనేది నోటి ద్వారా ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకునే చిన్న పరికరం. గతంలో రూ.300, ఇప్పుడది వెయ్యికి పెరిగింది. ఆక్సిజన్‌ సిలిండరు ధరలు చెప్పనక్కరలేదు. రూ.1500 నుంచి రూ.2000 మధ్య లభించే చిన్న సిలిండర్‌ గత ఏడాది కరోనాకు రూ.4 వేలు ధర పెరిగింది. ఇవి అద్దెకు ఇచ్చేవారు. గాలి నింపితే రూ.600 – 800 అయ్యేది. ఈ ఏడాది అద్దెకు దొరకడం లేదు. మీడియం సైజ్‌ సిలెండరేమో రూ.17 వేలకు చేరింది. కరోనా విజృంభిస్తున్న తాజా పరిస్థితుల్లో వీటికి పెరిగిన డిమాండ్‌ను లెక్కించలేం. అంచనాకు అందడం లేదు. గాలి నింపుకోవాలంటే ఇప్పుడు నరసాపురం సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథ్‌ అనుమతి ఇవ్వాలి. అసలు ప్రాణవాయువు సిలిండర్లు సమస్యతో ప్రాణాలు పోతున్నాయి కూడా. ఈ ఆక్సిజన్‌ పరికరాల సమస్య మరింత జటిలమవుతోంది. సరిపడినంత స్టాక్‌ లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయే తప్ప.. దిగి రావడం లేదు. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టడంలో అధికారులు పెద్దగా శ్రద్ధ చూపుతున్నట్టు కనిపించడం లేదు. 

Updated Date - 2021-05-11T05:37:14+05:30 IST