అన్నదాత ఆక్రోశం!

Published: Sun, 26 Jun 2022 00:26:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అన్నదాత ఆక్రోశం! అలంపురంలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న రైతులు

దాళ్వా సొమ్ము  బకాయిల కోసం రోడ్డెక్కి నిరసన
ధాన్యం విక్రయించి 50 రోజులైనా సొమ్ముల్లేవ్‌
రూ.1200 కోట్లకు రూ.265 కోట్లే చెల్లింపు
49,500 మంది రైతులు ఎదురు చూపు
సార్వా నారుమడులకు వెనకడుగు
రుణాల చెల్లింపు ఆలస్యం..


అన్నదాతల దాళ్వా ధాన్యం సొమ్ము అవస్థలు ఆర్తనాదాలుగా మారాయి.  ధాన్యం విక్రయించి రెండు నెలలు కావొ స్తోంది. ఇప్పటికే సార్వా నారుమడుల పనుల్లో తీరిక లేకుండా ఉండాల్సిన రైతన్నలు ధాన్యం సొమ్ములు ఇవ్వండి సార్‌.. అంటూ రోడ్డెక్కాల్సి వస్తోంది. అప్పుల ఒత్తిడి పెరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

భీమవరం రూరల్‌, జూన్‌ 25 :  జిల్లాలోని రైతులకు దాళ్వా ధాన్యం సొమ్ము చెల్లింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. దాళ్వాలో ధాన్యం సేకరణ అంచనా 7లక్షల 83వేల మెట్రిక్‌ టన్నులు వేశారు. దిగుబడి తగ్గడంతో ఇప్పటి వరకు 6లక్షల 65వేల మెట్రిక్‌ టన్నులే కొనుగోలు జరిగింది. దీని నిమిత్తం 60 వేల మంది రైతులకు రూ.1200 కోట్లు చెల్లించాల్సి ఉండగా 10,500 రైతులకు మాత్రమే రూ.265 కోట్లు చెల్లించారు.  మే 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు మిగిలిన రైతులకు సొమ్ము జమకాలేదు. ఇంకా 49,500 మంది రైతులకు రూ.935 కోట్లు సొమ్ము రావాలి. 85 శాతం సొమ్ము నెలలు గడుస్తున్నా రాకపోవడం రైతులలో ఆందోళన నెలకొంటుంది.

 అంతా నష్టమే..
ధాన్యం సొమ్ము సమయానికి అందకపోవడం రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. ప్రధానంగా బ్యాంకు రుణాల వడ్డీరాయితీ పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాది లోపు చెల్లిస్తే రైతు తెచ్చుకున్న రుణానికి 7శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. కాని అలా చెల్లించలేక పోతున్నారు. రూ.లక్ష రుణానికి రూ.7 వేల రాయితీ పోయినట్లవుతుంది. ఎరువులు, పురుగు మందుల దుకాణాల వద్ద వడ్డీ పెరుగుతోంది. జిల్లాలో సహకార బ్యాంకులకు రైతులు రూ.1200 కోట్లు రుణాలుగా చెల్లించాలి. గతం బట్టి లెక్కవేస్తే 70 శాతం రుణాలు చెల్లింపు అవ్వాలి. 50 శాతం వరకే చెల్లింపు అయ్యింది. ఇలా అవ్వడం వల్ల వడ్డీ రాయితీలు పోగొట్టుకుంటున్నట్లే. వాణిజ్య బ్యాంకులలోనే ఇదే తరహా రుణాలు చెల్లింపులు జరుగుతున్నాయి.

సార్వా నారుమడులు ఆలస్యం

ముందస్తు నారుమడులు వేయాలని ప్రభుత్వం సూచిస్తూ ఈ నెల ఒకటో తేదీన కాల్వలు వదిలినా ఇప్పటి వరకు రైతులు నారుమడులు వేసింది చాలా తక్కువ. విత్తన కొనుగోలుకు సొమ్ము లేక సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది సార్వా సాగు 2 లక్షల 65 వేల 500 ఎకరాలలో చేయనున్నారు. దీనికి 5 వేల 31 హెక్టార్లల్లో నారుమడులు వేయాల్సి ఉండగా కేవలం 1,296 హెక్టార్‌లలో మాత్రమే నారుమడులు పడ్డాయి. ధాన్యం సొమ్ము రానందుకే నారుమడులు వేయలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు.

రోడ్డెక్కుతున్న రైతన్నలు..
ధాన్యం సొమ్ము కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ధాన్యం విక్రయించిన 21 రోజులకు సొమ్ములను రైతుల ఖాతాలో జమ చేస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయింది. ధాన్యం విక్రయించి 50 రోజులు దాటడంతో రైతులు అధికారులకు విన్నవిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఇలా సాగితే ఉద్యమించక తప్పదని రైతులు హెచ్చరిస్తు న్నారు. మొన్న వీరవాసరంలో రైతుల ఆందోళన, నిన్న మోగల్లులో జేసీకి విన్నపం ఇలా రైతుల ఆర్తనాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

అప్పులకు వడ్డీ పెరుగుతోంది..
ధాన్యం సొమ్ము రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఐదెకరాల సాగు చేశాను. ధాన్యం విక్రయించి 45 రోజులు అవుతోంది సొమ్ము రాలేదు. ఎప్పుడు వస్తాదో తెలీదు. ఎరువులు పురుగు మందుల షాపు వద్ద వాటికి వడ్డీ పెరిగిపోతోంది. పంట మాసూళ్లు చేసిన వరికోత యంత్రం, కూలీలు డబ్బులు ఇవ్వాలని తిరుగుతున్నారు.  
– జి.సత్యనారాయణ, రాయకుదురు వీరవాసరం మండలం.

 బకాయి సొమ్ములు చెల్లించండి..
 పెంటపాడు/ ఆచంట జూన్‌ 25 : దాళ్వా ధాన్యం సొమ్ము లు తక్షణం జమ చేయాలని కోరుతూ పలుచోట్ల రైతులు, కౌలు రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పెంటపాడు మండ లం అలంపురానికి చెందిన రైతులు శనివారం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద మోకాళ్లపై కూర్చుని అధికారులకు దణ్ణం పెడుతూ నిరసన తెలిపారు. ధాన్యం అమ్మి సుమారు రెండు నెలలు కావొస్తోందని నేటికీ డబ్బులు జమ కాలేదన్నారు. అప్పులు చేసి దాళ్వా సాగు చేపట్టామని వడ్డీల భారం పెరిగిపోతోందన్నారు. అనంతరం వీఏఏ శ్యాంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు పొత్తూరి శ్రీనివాసరాజు, రెడ్డి శ్రీను, పెనుమర్తి రంగారావు, వల్లూరి సాంబశిబరావు, పెనుమర్తి రంగారావు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  
ఆచంట మండలం వల్లూరు సెంటర్‌లో ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. రైతుల చేతిలో చిల్లి గవ్వ లేకుండా సార్వా సాగు ఎలా చేస్తారని కౌలు రైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేతా గోపాలన్‌ ప్రశ్నిం చారు. రైతు సంఘం నాయకులు ఇందుకూరి సూర్యనారాయణరాజు, వద్దిపర్తి అంజిబాబు, పల్లి జార్జి, పెచ్చేట్టి రామలింగేశ్వరరావు,  కోసూరి సూర్యనారాయణరాజు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.