కొత్త బంగారులోకం

ABN , First Publish Date - 2022-06-27T06:12:02+05:30 IST

వారంతా గోదారమ్మ తల్లి ముద్దుబిడ్డలు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులుగా మారారు.

కొత్త బంగారులోకం
కాలనీలో ఫంక్షన్‌ జరుగుతున్న ఇంటి వద్ద టెంట్‌

కాలనీల్లో అడుగు పెట్టిన నిర్వాసితులు
తీర ప్రాంతాల నుంచి మెట్ట ప్రాంతానికి..
అధికారుల హామీతో గ్రామాల నుంచి పయనం
కొత్త గ్రామంలో మొదటి శుభకార్యం
చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో సందడి


వారంతా గోదారమ్మ తల్లి ముద్దుబిడ్డలు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులుగా మారారు. ముంపు ప్రాంతంలో ఉండడంతో సొంత గ్రామాలను వీడి  పునరావాసాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పటి వరకు గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న వారంతా మెట్ట ప్రాంతానికి పయనమయ్యారు.

జంగారెడ్డిగూడెం, జూన్‌ 26 :
పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి నిర్వాసిత కాలనీలకు వస్తున్నారు. పరిహారం సంగతి పక్కన పెడితే ముంచుకొస్తున్న గోదావరి వరదల గ్రామాలను వదలక తప్పడం లేదు. గతేడాది గోదావరి వరద అనుభవాలు, రోజుల పాటు కొండ గుట్టల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలతో తలదాచుకున్న భయంకర సందర్భాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు పరిహారం ఇస్తేనే కదలం అని చెప్పిన నిర్వాసితులు ఇప్పుడు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలకు చేరారు. త్వరలోనే పరిహారం ఇస్తామన్న అధికారుల హామీతో ముందుకు కదిలారు. దీంతో నూతన నిర్వాసిత కాలనీ సందడిగా మారింది. కొత్త ఇళ్లు, కొత్త రోడ్లు, కొత్త వాతావరణంలో జీవనం సాగించేందుకు మొదటి అడుగు వేశారు.  
పునరావాసాలకు..
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని చల్లావారిగూడెంలో కుక్కు నూరు, వేలేరుపాడు ముంపు మండలాల నిర్వాసి తులకు ఆర్‌ఆంర్‌ఆర్‌ కాలనీల నిర్మాణాలకు సుమారు 1000 ఎకరాల భూమిని సేకరించారు.41.15 కాంటూర్‌ లెవెల్లో కుక్కునూరు మండలంలో 8 గ్రామాలకు చెందిన 3,024 కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 17 గ్రామాలకు చెందిన 4,094 కుటుంబాలను పునరావాస కాలనీలకు తరలించాల్సి ఉంది. మొత్తం రెండు మండ లాలకు సంబంధించి 7,118 కుటుంబాలు తర లించాల్సి ఉండగా వీరిలో 1,545 గిరిజన కుటుం బాలు, 5,573 గిరిజనేతర కుటుం బాలు ఉన్నాయి. వీరిలో కుక్కునూరు మండలంలోనే 5 నిర్వాసిత కాలనీలను ఏర్పాటు చేయగా కొంతమంది అక్కడే ఉంటారు. సుమారు 4,900 కుటుంబాల వరకు కూడా చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ ఆర్‌ కాలనీకి వస్తారు. కాగా 1,545 మంది గిరిజన నిర్వాసితులకు రూ.6.86 లక్షల పునరావాస పరిహారం చెల్లించారు.  

మూడు ముక్కలైన కొయిదా
గోదావరి ఒడ్డున కొయిదా గ్రామం ఉండేది. ఇప్పుడు ఈ గ్రామం మూడు ముక్కలైంది. అంటే ఈ గ్రామంలో నివాసం ఉండేవారంతా కూడా మూడు చోట్ల నిర్మించే పునరావాస కాలనీలకు వెళారు. చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి 53 గిరిజన కుటుంబాలు రాగా, బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో నిర్మించే ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి గిరిజన, కొన్ని గిరజనేతర కుటుంబాలు కలిపి సుమారు 110 కుటుంబాలు, జీలుగుమిల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి 115 గిరిజన కుటుంబాలు తరలివెళ్లాయి. దీంతో ఒకే ప్రాంతంలో ఇప్పటి వరకు నివాసం ఉన్న వారంతా మూడు ప్రాంతాలకు వెళ్లారు.

కొత్త గ్రామంలో మొదటి శుభకార్యం
చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మొదటి శుభకార్యం ఆదివారం జరిగింది. కొయిదా గ్రామానికి చెందిన  చింతలపూడి వీరప్రకాష్‌, రేవతి దంపతుల కుమార్తె సత్యశ్రీకి పుష్పాలంకరణ వేడుకను నూతన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నిర్వహించారు. అలాగే మనవళ్లు గీతానందన్‌, అఖల్‌లకు పంచెకట్టు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. కొత్త గ్రామంలో టెంట్‌లు వేసి, భోజనాలు పెట్టారు. వేలేరుపాడు మండలంలో అక్కడే ఉంటున్న కొన్ని గ్రామాల ప్రజలు, అక్కడ నుంచి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలకు వచ్చి జీవనం సాగిస్తున్న వారిని పిలిచి మరీ శుభకార్యం నిర్వహించారు. అలాగే ఆహ్వానపత్రికలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని అడ్రస్‌ చేసి ఇచ్చిన మొట్టమొదటి శుభకార్యం ఇది.

చల్లావారిగూడెంలో సందడే సందడి
చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి కొయిదా, బొర్రెడ్డిగూడెం గ్రామాల చెందిన సుమారు 123 నిర్వాసిత కాలనీలు తరలివచ్చాయి. ఇప్పటి వరకు ఈ ప్రాంతం అంతా ఖాళీ ఇళ్లతోనే దర్శనమిచ్చేది. కానీ ఇప్పుడు అక్కడ నిర్వాసితులు మకాం రావడంతో సందడి ఏర్పడింది. కొయిదా పాత గ్రామంలో కిరాణా షాపు నడుపుకునే ఆకుల సత్యవతి చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో కూడా కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై చల్లావారి గూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నుంచి తాడువాయి, జంగారెడ్డిగూడెం వైపు ప్రజలు తిరుగుతుండటంతో ఆ రహదారులు సందడిగా కన్పిస్తున్నాయి.

Updated Date - 2022-06-27T06:12:02+05:30 IST