బాదుడుకు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-29T06:35:21+05:30 IST

ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రిజిస్ర్టేషన్‌ శాఖపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.

బాదుడుకు సిద్ధం

జూన్‌ ఒకటి నుంచే రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపు
జిల్లా కమిటీ  ఆమోదం.. నిర్మాణాలకే వర్తింపు
ఆదాయం పెంపే ప్రభుత్వ లక్ష్యం
రిజిస్ర్టేషన్‌ శాఖపై ఒత్తిడి
క్షేత్రస్థాయి సిబ్బందిలో ఆందోళన


 (భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా రిజిస్ర్టేషన్‌ శాఖపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. నిర్మాణాలపై జూన్‌ ఒకటో తేదీ నుంచి రిజిస్ర్టేషన్‌ చార్జీలను పెంచుతోంది. జిల్లాలో  జాయింట్‌ కలెక్టర్‌, రిజిస్ర్టార్‌లతో కూడిన కమిటీ పెంపు చార్జీలను ఆమోదించింది. మరోవైపు ఆదాయం తగ్గిన సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాల యాల పైనా దృష్టి పెట్టింది. ఏప్రిల్‌లో 50 శాతానికి కంటే తక్కువగా లక్ష్యాన్ని చేరే సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలను గుర్తించింది. సదరు సబ్‌ రిజిస్ర్టార్‌ల నుంచి ఉన్నతాధికారులు వివరణ కోరారు. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల రిజిస్ర్టేషన్లు మందగించాయంటూ కింది స్థాయి అధికారులు గగ్గోలు పెడుతున్నారు. నాన్‌ లేఅవుట్‌లలో రిజిస్ర్టేషన్లు నిలిపివేయడం వల్ల ఆదాయం తగ్గిందని సబ్‌రిజిస్ర్టార్లు అంచనా వేస్తున్నారు. తాజాగా నిర్మాణాలపై రిజిస్ర్టేషన్‌ ధరలు పెంచడం మరింత ప్రభావం చూపే అవకాశం ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రమైన భీమవరంలో ఆస్తుల విలువను పెంచింది. తాజాగా జిల్లాలోని  అన్ని పట్టణాలు, పల్లెల్లో నిర్మాణాల ధరలను పెంచుతూ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్‌ ఒకటో తేదీనుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. వాస్తవానికి గడిచిన ఫిబ్రవరిలోనే పెంపు నిర్ణయం తీసుకున్నా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనన్న భయంతో వాయిదా వేశారు. అవే ధరలతో ఇప్పుడు పెంపు చేస్తున్నారు. ఆదాయం పెంపే ప్రధానంగా ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ బాదు డుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆర్టీసీ చార్జీలను పెంచింది. విద్యుత్‌ చార్జీలను అధికం చేసింది. తాజాగా రిజిస్ర్టేషన్‌ శాఖపై పడింది. ఏప్రిల్‌లో జిల్లాలోని ఆకివీడు, ఉండి, సజ్జాపురం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు 50 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయాయి. దాంతో సదరు సబ్‌రిజిస్ర్టార్లు వివరణ ఇవ్వాలని  అధికారులు దిశానిర్దేశం చేశారు. ఇదే ఇప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఆందోళ నకు గురిచేస్తోంది. మేలోను ఆదాయం ఆశాజనకంగా లేదు. నాన్‌ లేఅవుట్‌ల నిషేధం ప్రభావం చూపుతోందంటూ అంతా కోడైకూస్తున్నారు. దీనిపై ఎటు వంటి సడలింపులు లేవని రిజిస్ర్టేషన్‌ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరోవైపు జూన్‌ నెలలో నిర్మాణాలపై బాదుడుకు సిద్ధమవుతున్నారు. ఇదికూడా ప్రభావం చూపితే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. అంతిమంగా జనంపై భారం పడనుంది.

 నిర్మాణ కొత్త ధరలు చదరపు అడుగుకు   
                పట్టణాలు     మేజర్‌ పంచాయతీలు     మైనర్‌ పంచాయతీలు
రెండు అంతస్తుల వరకు         రూ.1200            రూ. 1000     రూ. 770
మూడో అంతస్తు నుంచి         రూ. 1300            రూ. 1200    రూ. 840
సెల్లార్‌, పార్కింగ్‌ స్థలం        రూ.860                రూ. 780    రూ. 560
అపార్ట్‌మెంట్స్‌                 రూ. 1300            రూ. 1200    రూ.770
ఎత్తయిన భవనాలు            రూ. 1320        రూ. 1180    రూ. 840
సినిమా థియటర్‌, మిల్లులు, పరిశ్రమలు    రూ.900        రూ. 830    రూ 650
పౌల్ర్టీ ఫార్మ్‌లు                                రూ. 650        రూ. 640    రూ. 460
చావిటి మిద్దెలు                            రూ. 390        రూ. 290    రూ. 220
గోడలతో ఉన్న పూరిపాకలు                రూ. 190        రూ. 120    రూ. 90
గోడలు లేని పూరిపాకలు                    రూ. 110        రూ. 50    రూ. 40
 
 లక్ష్యం చేరుకుంటారా....
 ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ర్టేషన్‌ శాఖకు భారీ లక్ష్యాలనే ఇచ్చి ధరలను పెంచుతోంది.  లక్ష్యాలను చేరుకోవాలంటూ ఒత్తిడి చేస్తోంది. ధరల పెరుగుదలతో అధికారుల్లోనూ ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది.  ఏప్రిల్‌, మే నెలల్లో రిజిస్ర్టేషన్లు పడిపోయాయి. లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇదే పరిస్థితి జూన్‌లో ఉంటే ఏడాది లక్ష్యం చేరుకోవడం కష్టమేనన్న గుబులు సబ్‌ రిజిస్ర్టార్‌లలో నెలకొంది.

 2022–23 లక్ష్యం ఇలా..

 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం        లక్ష్యం రూ.కోట్లలో
తాడేపల్లిగూడెం            59.83
అత్తిలి                    17.78
ఆచంట                    9.67
ఆకివీడు                21.14
భీమవరం                91.20
మొగల్తూరు            16.82
నరసాపురం            32.36
పాలకొల్లు                47.79
పెనుగొండ            15.48
పెంటపాడు            12.03
తణుకు                57.95
ఉండి                13.82
వీరవాసరం            21.43
గునుపూడి            43.53
సజ్జాపురం            25.89 

Updated Date - 2022-05-29T06:35:21+05:30 IST