ఉప్పు ముప్పు

ABN , First Publish Date - 2021-06-17T05:07:05+05:30 IST

ఈ ఏడాది పంట కాల్వలు ముందస్తుగా మూసివేయడంతో ఎగువ నుంచి సముద్రంలో కలిసే మురుగుకాల్వల నీరు తగ్గి తీర ప్రాంతంలో ఉప్పు నీటి శాతం రూపుదాల్చింది.

ఉప్పు ముప్పు
భీమవరం ఫుట్‌పాత్‌ వంతెన వద్దకు ఉప్పు నీటితో వచ్చిన గుర్రపుడెక్క

తీరంలో భూములకు ఉప్పు నీటి శాతం తీవ్ర రూపం  

ఫిబ్రవరి చివరి వారం నుంచి 25కు పెరిగిన పీపీటీ 

వేల ఎకరాల్లో ఆక్వా చెరువులకు తప్పని ఇబ్బంది

భీమవరం, జూన్‌ 16 : ఈ ఏడాది పంట కాల్వలు ముందస్తుగా మూసివేయడంతో ఎగువ నుంచి సముద్రంలో కలిసే మురుగుకాల్వల నీరు తగ్గి తీర ప్రాంతంలో ఉప్పు నీటి శాతం రూపుదాల్చింది. దీనివల్ల సుమారు 1.80 లక్షల ఎకరాల తీరప్రాంత భూములపై ఉప్పు నీటి ప్రభావం కనిపించింది. ఉండి, భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో సముద్ర తీరంలోకి కలిసే మురుగు కాల్వలతోపాటు ఉప్పుటేరు పరీవాహక ప్రాం తంలో ప్రధాన డ్రెయిన్లలో సముద్రపు ఉప్పునీరు ఎగదన్నింది. ఉప్పుటేరుతోపాటు యనమదుర్రు, గొంతేరు, మొగల్తూరు డ్రెయిన్‌, మొగదిండి వంటి వాటిలోకి ఉప్పునీరు చేరింది. దిగువన వున్న గుర్రపుడెక్క, తూడు వంటివి ఎగువకు వచ్చేస్తున్నాయి. పంట కాల్వలకు నీరు ముందస్తుగా కట్టి వేయడంతో వంతుల వారీ సమయంలో కూడా మురుగు కాల్వల నీరు చాలా ప్రాంతాల్లో వినియోగించుకున్నారు. ఆక్వా చెరువుల్లోను ఈ నీరు వాడడంతో అనేక మురుగు కాల్వల నీళ్లు తగ్గిపోయి సముద్రపు నీరు ఎక్కడం జరిగింది. తాజాగా సాగు నీరు లేటుగా విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. 

25 పీపీటీలకు ఉప్పునీరు

ఇటీవల కొన్ని ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో నీరు, పర్యావరణ సాంకేతిక పరిశోధన కేంద్రం (వెట్‌ సెంటర్‌) ప్రాథమికంగా కొన్ని శాంపిల్‌ సర్వే చేయగా 25 పీపీటీ(పార్ట్స్‌ పర్‌ తౌజండ్‌)లకు ఉప్పునీటి శాతం కనిపించింది. గతంలో 18 నుంచి 23 శాతం వరకు ఉండేవి. ఈసారి మరింత పెరిగింది. దీనివల్ల తీరప్రాంత భూములూ ఉప్పునీటి కయ్యలుగా మారడంతో అనేక మంది  ఆక్వా సాగును తాత్కాలికంగా నిలుపుదల చేశారు.రొయ్యల సాగుకు అనువైన ఉప్పునీటి శాతంకంటే అధికంగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఈసారి ఉప్పునీరు ఎగదన్నటం మరింత పెరిగిందని భీమవరం వెట్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ పీఏ రామకృష్ణంరాజు తెలిపారు. సాధారణంగా అక్టోబరు నుంచి నీటి ప్రవాహం తగ్గుతుందని, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రస్తుతం ఉప్పు నీరు శాతం కొనసాగుతుందన్నారు. పంట కాలువలకు పూర్తిస్థాయి నీరు వదిలిన తరువాత వర్షాలు మొదలైతే సమస్య తగ్గుతుందన్నారు. 

రెగ్యులేటర్లు నిర్మిస్తేనే పరిష్కారం..!

రుద్రరాజు పండురాజు, గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైౖర్మన్‌

తీర ప్రాంతంలో ఉప్పునీటి సమస్య పరిష్కారానికి రెగ్యులేటర్‌ నిర్మాణమే శరణ్యం. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రెగ్యులేటర్లు ప్రతిపాదించారు. ప్రస్తుత సీఎం జగన్‌ వాటిని మూడుకు పెంచారు. వాటి నిర్మాణం చేపడితే తీర ప్రాంతానికి ముఖ్యంగా పశ్చిమ డెల్టా, కృష్ణా డ్రెయిన్లకు ఉప్పు నీటి సమస్య తగ్గుతుంది. 


Updated Date - 2021-06-17T05:07:05+05:30 IST