సమస్యల తిష్ఠ

ABN , First Publish Date - 2021-03-01T05:06:37+05:30 IST

నగరంలో ఎక్కడ చూసినా అపరి శుభ్రత, మురుగు, దుర్గంధం నిండిన వీధులు, అధ్వానంగా ఉన్న రహదారులు, కాల్వలు కన్పిస్తుంటాయి.

సమస్యల తిష్ఠ
కృష్ణా కాల్వ దుస్థితి

నగరంలో పెనుసవాలుగా అపారిశుధ్యం 

వెంటాడుతున్న మురుగు

డంపింగ్‌ యార్డులుగా ప్రధాన రహదారులు

అస్తవ్యస్తంగా వ్యర్థాల నిర్వహణ

కలుషిత మంచినీరు.. దోమల స్వైర విహారం

ఈసారి నగర పాలక సంస్థ ఎన్నికలపై ప్రభావం

ఏలూరు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) :

నగరంలో ఎక్కడ చూసినా అపరి శుభ్రత, మురుగు, దుర్గంధం నిండిన వీధులు, అధ్వానంగా ఉన్న రహదారులు, కాల్వలు కన్పిస్తుంటాయి. ఏళ్ల తరబడి సమస్యలు శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రస్తుతం నగరపాలక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన అంశంగా ముందుకొస్తోంది. ఎవరు పారిశుధ్యానికి పెద్దపీట వేస్తారో.. పరిశుద్ధమైన తాగునీటికి ప్రాధాన్యం ఇస్తారో.. అని నిశితంగా గమనిస్తున్నారు. డిసెంబరులో నగరవాసులను భయపెట్టిన అంతుచిక్కని వింత వ్యాధికి కారణాలు ఇవి అన్ని స్పష్టంగా నిర్ధారించకపోయినా అందరి వేళ్లు మాత్రం అపరిశుభ్రత, కలుషిత మంచినీళ్ల వైపే చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఎన్నికల్లో పరిశుభ్రత, నగర ప్రజల తాగునీటి సదుపాయాలు కీలకంగా మారాయి.


అస్తవ్యస్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ

నగరంలో వ్యర్థాల నిర్వహణపై అనాది నుంచి విమర్శలు వినవస్తున్నాయి. నగరంలోని అన్ని ప్రధాన రహదారులు, కాల్వలు, శివారు ప్రాంతాలను అధికారులు అనధికార డంపింగ్‌ యార్డులుగా మార్చేశారు. ఫలితంగా నగంలోని కృష్ణ కాల్వ, మినీబైపాస్‌, జంగారెడ్డిగూడెం రోడ్డు, జాన పాడు రోడ్డు ఇరు పక్కలా వ్యర్థాలు కుళ్లిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నగరానికి కేటాయించిన డంపింగ్‌ యార్డు నిర్వహణ సరిగ్గా లేదు. మెయింటెనెన్స్‌ లేక వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారు చేసే యంత్రాలన్నీ పాడైపోయి, తుప్పుపట్టాయి. కొత్తగా బాధ్యతల్లోకి వచ్చే నగరపాలక కార్యవర్గం దీనిపై దృష్టి సారించాలన్న డిమాండు పెరుగుతోంది. 


కలుషిత మంచినీరు..

నగరవాసులకు తాగునీరు అందించే కృష్ణ కాల్వ, గోదావరి కాల్వ రెండూ కాలుష్యం బారిన పడుతు న్నాయి. విష రసాయనాలతో పాటు, తడి వ్యర్థాల ను వాటిలో పడవేస్తుండడంతో అవి నీటిలో కలిసి నీరు కలుషితమవుతోంది. ఫలితంగా నీటి సంబంధ సమస్యలు నగరవాసులను వదలకుండా వెంటాడు తున్నాయి. 


 దోమల దండు స్వైర విహారం

నగరంలో దోమల దండు స్వైర విహారం చేస్తోంది. డ్రెయినేజీ వ్యవస్థ నిర్వహణ సరిగా లేకపోవడం, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడం కారణంగా దోమల దండు నగరంపై దండెత్తుతోంది. ఫలితంగా నగర ప్రజలు తీవ్ర అనా రోగ్యాలకు గురవుతున్నారు. దోమల నివారణ విషయంలో నగరపాలక సంస్థ పని తీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి తో కృషి చేయడం లేదని ఆరోపిస్తున్నారు. వచ్చే కొత్త పాలకవర్గమైనా ఈ సమస్యలపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - 2021-03-01T05:06:37+05:30 IST