కడలి కోత!

ABN , First Publish Date - 2022-08-18T06:35:19+05:30 IST

నరసాపురం మండ లంలో మూడు దశాబ్దాల క్రితం 29 గ్రామాలు ఉండేవి.

కడలి కోత!
చినలంక వద్ద సముద్రపు కోత

ముందుకు చొచ్చుకొస్తున్న సముద్రం
కోతకు గురవుతున్న తీరప్రాంతం
పీఎంలంకకు పొంచి ఉన్న ప్రమాదం
సర్వేలు, ప్రతిపాదనకే రక్షణ చర్యలు పరిమితం
తాజాగా చెన్నై ఐఐటీ నిపుణులు  సందర్శన


నరసాపురం రూరల్‌, ఆగస్టు 17: నరసాపురం మండ లంలో మూడు దశాబ్దాల క్రితం 29 గ్రామాలు ఉండేవి. అందులో చినలంక కూడా ఒక్కటి. అయితే నేడు ఈ గ్రామం సముద్రంలో కలిసిపోయింది. అనవాలుగా సముద్రం ఒడ్డున తుఫాన్‌ భవనం ఒకటి మిగిలింది.
జూ ఇదే పరిస్థితి పీఎంలంక వద్ద కూడా నెలకొంది. ఒక్కప్పుడు ఈ గ్రామం సముద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండేది. నేడు కిలోమీటరు సమీపంలో ఉంది. ఏటా తుపాన్లు, వాయుగుండాలు సంభవించినప్పుడు సముద్రం ఎంతో కొంత ముందుకు చొచ్చుకొస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే కొన్నేళ్లకు ఈ గ్రామం కూడా చినలంక లాగా సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
కనిపించని రక్షణ చర్యలు
కోతకు గురవుతున్న గ్రామాలను పరిరక్షించాలని తీర ప్రాంత ప్రజలు చేస్తున్న ఆందోళనలు, విన్నపాలు సర్వేలకే పరిమితమవుతున్నాయి. 2012లో అప్పటి ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములదీవికి విచ్చేశారు. తీర ప్రాంత మత్స్యకారుల ఆందోళనలు విన్న ఆయన తీరం వెంబడి ఓడరేవుల తరహాలో గట్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అ తర్వాత అధి కారు లు సర్వే చేశారు. అయితే ఇది నేటికీ కార్యరూపం దాల్చలేదు. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న నిర్మలా సీతారామన్‌ ఎనిమిదేళ్ల క్రితం పీఎంలంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ క్రమంలో సముద్ర కోత గట్టును పరిరక్షించాలని మంత్రి విశ్వ ప్రయత్నాలు చేశారు. రక్షణ శాఖలోని డీఆర్‌డీఏ శాస్త్రవేత్తల బృందాన్ని తీర ప్రాం తానికి రప్పించారు. వారు అధ్యయనం చేసి పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సమర్పించారు. అయితే ఇది రూ.వందల కోట్ల వ్యయం తో కూడుకోవడంతో ఈ ప్రతిపాదన పక్కన బెట్టారు. తాజాగా చెన్నై ఐఐటీకి చెందిన నిపుణులు తీర ప్రాంతాన్ని సందర్శిం చారు. బియ్యపుతిప్ప, చినలంక, వేములదీవి, పీఎం లంక గ్రామాల్లో పర్యటించి కోతకు గురవుతున్న ప్రాంతాలను సందర్శించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు త్వరలో నిపుణులతో కూడిన బృం దాన్ని తీసుకొస్తామని ఐఐటీ ప్రొఫెసర్‌ సురేష్‌ తెలిపారు. అయితే ఈసారి కూడా సర్వేలతో సరిపెడతారా.. లేక రక్షణ గోడ నిర్మిస్తారా.. అన్నది వేచి చూడాల్సిందే.



Updated Date - 2022-08-18T06:35:19+05:30 IST