రెండో డోసుకు భారీ స్పందన

ABN , First Publish Date - 2021-04-23T05:23:48+05:30 IST

కొవిడ్‌ టీకా మందు రెండో డోసుకు జిల్లాలో గురువారం భారీ సంఖ్యలో హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, సీనియర్‌ సిటిజన్లు తరలివచ్చారు.

రెండో డోసుకు భారీ స్పందన
కాళ్ళ పీహెచ్‌సీ వద్ద వ్యాక్సిన్‌ రిజిస్ర్టేషన్‌కు భారీ క్యూ

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 22 : కొవిడ్‌ టీకా మందు రెండో డోసుకు జిల్లాలో గురువారం భారీ సంఖ్యలో హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, సీనియర్‌ సిటిజన్లు తరలివచ్చారు. రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం 54 వేల మంది ఎదురుచూస్తుండగా 30 వేల డోసుల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నిల్వలతో టీకా మందు పంపిణీ గురువారం ప్రారంభమైంది. రెండో డోసు వేయించుకోవాల్సిన వారిలో దాదాపు రెండు నుంచి మూడు శాతం మంది లబ్ధిదారులు వివిధ కారణాల వలన ముందుకు రావడంలేదని గుర్తించారు. ఇటువంటి వారిలో బాలింతలు కొందరు ఉన్నారు. కాగా పలుచోట్ల రెండవ డోసుకు మాత్రమే వ్యాక్సినేషన్‌ను పరిమితం చేసినప్పటికీ స్థానికంగా ఒత్తిళ్లు వచ్చిన చోట తొలి డోసు వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. రెండో డోసుకు గుర్తించిన వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయిన తరువాతే గ్రామ/వార్డు సచివాలయాల్లో సాధారణ ప్రజలకు తొలి డోసు టీకా మందు వేసే అవకాశం ఉంది. కొత్తగా కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ నిల్వలు శుక్రవారం రాత్రి జిల్లాకు దిగుమతి కానున్నట్టు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది.


భీమవరం, గూడెంలలో ట్రూనాట్‌ మిషన్లు

కొవిడ్‌ టెస్ట్‌లను పెంచడానికి కొత్తగా భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు ప్రభుత్వాసుపత్రుల్లో ట్రూ నాట్‌ మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ప్రయోగాత్మకంగా గురువారం పరీక్షించి చూశారు. ప్రభుత్వం నుంచి కిట్‌లు అందిన వెంటనే ఈ వారంలో ట్రూ నాట్‌ మిషన్లపై కరోనా నిర్ధారణ పరీక్షలు చేపడతారు. గత ఏడాది కొవిడ్‌ ఉధృతి సమయంలో జిల్లాకు పంపిన 16 ట్రూనాట్‌ మిషన్లను మళ్లీ ఇప్పుడు వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు.  

Updated Date - 2021-04-23T05:23:48+05:30 IST