ప్రతీ సమస్యకు పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-09T06:04:27+05:30 IST

స్పందన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారులు సంతృప్తి పడేలా త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా రెవె న్యూ అధికారిణి కె.కృష్ణవేణి అన్నారు.

ప్రతీ సమస్యకు పరిష్కారం

డీఆర్వో కృష్ణవేణి.. 131 దరఖాస్తుల స్వీకరణ
భీమవరం, ఆగస్టు 8 : స్పందన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారులు సంతృప్తి పడేలా త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా రెవె న్యూ అధికారిణి కె.కృష్ణవేణి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం డీఆర్వో కె.కృష్ణవేణి డీఎస్పీ, ఐసీడీఎస్‌ పీడీ, ఎంపీడీవోలతో కలిసి స్పందనలో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ దరఖాస్తుదారులు ఎంతో నమ్మకంతో మన వద్దకు వచ్చి అర్జీలు ఇస్తున్నారని వారి నమ్మకానికి అనుగుణంగా మన పరిష్కారం కూడా ఉండాలన్నారు. మొత్తం 131 దరఖాస్తులను స్వీకరించినట్టు తెలిపారు. వీటికి సరైన రీతిలో అధికారులు తమ పరిధిలో పరిష్కారం చూపితే తిరిగి అర్జీదారుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండ దన్నారు. డీఎస్పీ ఎస్‌బీ సుభాకర్‌, కలెక్టరేట్‌ ఏవో వై.దుర్గా కిషోర్‌, ఐసీడీఎస్‌ పీడీ బి.సుజాత రాణి, భీమవరం ఎంపీడీవో జి.పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.
20లోగా ఆక్వా సమస్యలను పరిష్కరించాలి
ఆక్వా రైతులు ఆందోళనకు చేపట్టడానికి కార్యాచరణ ప్రకటించారు. నాన్‌ ఆక్వా జోన్‌ రైతులకు విద్యుత్‌ సబ్సిడీ, రొయ్యల ధరల స్థిరీకరణ, సీడ్‌, ఫీడ్‌ సమస్యలపై గతంలో చేసిన ఆందోళనల నేపథ్యంలో మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు ఆక్వా రైతు సంక్షేమ పోరాట సంఘం నాయకత్వంలో తొలుత జాతీయ రహదారిలో గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌ గట్టు నుంచి కలెక్టరేట్‌ వెళ్లే రహదారి పక్కనే సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడు నంబూరు గజపతిరాజు, కార్యదర్శి జీకేఎఫ్‌ సుబ్బరాజు, యువరాజు, వీరవల్లి చంద్రశేఖర్‌, చంటిరాజు, మైలా వెంకటపతి తదితరులు మాట్లాడుతూ ఆక్వా రైతులందరికీ గతంలో మాదిరిగా యూనిట్‌కు రూపాయి 50 పైసలు ఇస్తున్న సబ్సిడీని యఽథావిధిగా కొనసాగించాలని తదితర డిమాండ్లను ప్రస్తా వించారు. అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరగా  పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమైన ప్రతినిధులను అనుమతించడంతో డీఆర్వో కృష్ణవేణి, మత్స్యశాఖ జేడీ నాగలింగాచార్యులకు వినతి పత్రం అందజేశారు. ఆక్వా రంగ సమస్యలను ఈనెల 20 నాటికి అధికారులు పరిష్కరిం చాలని, లేకపోతే తదుపరి ఉద్యమం నిర్ణయిస్తామని సంఘ నాయకులు ప్రకటించారు. కాగా సాయంత్రం  రైతు ప్రతినిధులందరూ కలెక్టర్‌ ప్రశాంతిని కలసి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘ నేతలు మాట్లాడుతూ ధరలు హెచ్చు తగ్గుదల వల్ల గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఆక్వా రంగంలో సమస్యల పరిష్కారానికి రైతులు, ఎగుమతిదారులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని కలెక్టర్‌ సూచించారు. రొయ్యలు, చేపలు మేత, మందుల షాపులలో తరచూ తనిఖీలు నిర్వహించాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి సూచించారు.  నాణ్యమైన రొయ్యల సీడు కొనుగోలుకు శ్రద్ధ వహించాలన్నారు. యాంటీ బయోటిక్‌ అవశేషాలు ఎగుమతులకు ఆటం కంగా ఉంటాయన్నారు. పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా ముఖ్యమని, అప్పుడే రైతుకు, ఎగుమతిదారులకు నష్టాలు లేకుండా ఉంటాయన్నారు.

అధికార పార్టీలో ఉన్నా..
నా సమస్య పట్టించుకోవడం లేదు

మూడేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా ..
వైసీపీ నాయకుడు సత్యనారాయణ ఆవేదన
స్పందన ఫిర్యాదుల పరిష్కారం అంతంతమాత్రమే..
  ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందనకు అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. అధికారులను తమ సమస్యలు పరి ష్కరించమని వేడుకుంటున్నారు.. అయితే పరిష్కారం అంతంత మాత్రంగానే అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా విభజన తర్వాత ఐదు నెలలుగా స్పందనలో దాదాపు 1100 ఫిర్యాదులు అందాయి. అత్యధికంగా వ్యక్తిగత సమస్యలే. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన వారి సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. ‘నేను అధికార పార్టీ వైసీపీ బూత్‌ కమిటీ మెంబర్‌.. ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సోమరాజు చెరువు మా ఊరు.. నా భూమి సమస్య పరిష్కారం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను.. మా గ్రామం లో నేను 2018లో 1.10 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేశాను. దీనికి అన్ని రకాల పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉన్నాయి.. అయితే భూమి కొలతలు వేస్తే స్థలం మురుగు కాల్వలో ఉన్నట్టు చూపించింది. దీనిపై గ్రామ సచివాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు మూడేళ్లుగా 30 మంది వరకూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నాను. నా స్థలాన్ని మార్పించు లేకపోతున్నాను. ఈ విషయం పలుమార్లు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన  అధికారులకు ఫోన్‌ చేసి చెప్పేవారు.. అయినా ఫలితం లేదు. అధికార పార్టీలో ఉన్న నాకు కేవలం చిన్న పని అవ్వని పరిస్థితి. దీనిపై నిలదీస్తున్న నా కుమారుడిని కొందరు గ్రామస్థులు బెదిరిస్తున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా నాకు న్యాయం జరగడం లేదు’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

 ఎస్పీ కార్యాలయంలో 11 ఫిర్యాదులు
భీమవరం క్రైం, ఆగస్టు 8 : ప్రభుత్వ పథకాల పేరుతో అపరిచితుల ఫోన్‌ నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ నమ్మి బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, పిన్‌ నెంబర్‌, ఓటీపీ వివరాలు తెలిపి మోసపోవద్దని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ సూచించారు. చినఅమిరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పంద నలో కట్నం వేధింపులు, సరిహద్దుల గొడవలు, సివిల్‌ వివాదాలపై మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిపై ఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సత్వరమే చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేయాలని ఆదేశించారు.
పెనుగొండ నుంచి ఒక వ్యక్తి తమ పక్క ఇంటి వారితో సరిహద్దు గొడవలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని న్యాయం చేయమని ఎస్పీని కోరాడు.
మొగల్తూరుకు చెందిన ఒక మహిళ తనకు అదే గ్రామానికి చెందిన వ్యక్తులతో గొడవలు ఉన్నాయని ఇరువురి మీద కేసులు నమోదు చేశారని అప్పటి నుంచి మొగల్తూరు పోలీస్‌ స్టేషన్‌కి పిలిపిస్తున్నారని దివ్యాంగురాలైన కుమార్తెతో ఇబ్బంది పడుతున్నామని న్యాయం చేయాలని కోరింది.
భీమవరం టూటౌన్‌కి చెందిన మహిళ తన భర్తతో విడాకులు తీసుకున్న కూడా తనని, కుమారుడిని కొడుతున్నాడని, అతని పై చర్యలు తీసుకోవాలని కోరింది.
కాళ్ళ మండలం చిన అమిరానికి చెందిన మహిళ తన భర్త మార్చిలో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, కాళ్ళ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినా ఇంకా తన భర్త ఆచూకీ లభించలేదని న్యాయం చేయాలని కోరింది.

Updated Date - 2022-08-09T06:04:27+05:30 IST