ఈ చెరువు ఎవరిది?

ABN , First Publish Date - 2021-06-17T05:04:20+05:30 IST

తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలోవున్న చెరువు ఇది.

ఈ చెరువు ఎవరిది?
తాడేపల్లి చెరువు

స్వాధీనానికి రంగంలోకి ప్రైవేటు వ్యక్తులు

మున్సిపాలిటీదేనంటున్న అధికారులు

స్పష్టత కోరుతున్న తాడేపల్లిగూడెం వాసులు


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలోవున్న చెరువు ఇది. దీనిచుట్టూ నివాసాలు.. సమీపం లోనే పెద్ద లే అవుట్‌.. ఆపై పక్కా భవనాల నిర్మాణం జరుగు తోంది. అంతటి విలువైన భూముల మధ్య ఉన్న ఆ చెరువు దశాబ్దాలపాటు పట్టణ ప్రజలకు మంచినీటి అవసరా లను తీర్చింది. అయితే మున్సిపాలిటీ పట్టించుకోక పోవడంతో మురుగుకయ్యగా మారింది. సుమారు 75 సెంట్ల భూమిని ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన 3.25 ఎకరాల్లో దట్టంగా తూడు పేరుకుపోయింది. ఆ భూమి విలువ రూ.పది కోట్ల పైమాటే. దీనికి ఆనుకుని గజం స్థలం రూ.15 వేలు పలుకుతోంది. ఇంతటి ప్రతిష్టాత్మక చెరువు తమదంటే తమదని ఇటు మున్సిపాలిటీ, అటు ప్రైవేటు వ్యక్తుల మధ్య వార్‌ నడుస్తోంది. 

రంగంలోకి ప్రైవేటు వ్యక్తులు

ఈ చెరువు తమ పూర్వీకులదని కొందరు వ్యక్తులు దస్తావేజులను తెరపైకి తెస్తున్నారు. ఈ సర్వే నెంబర్‌పై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఇటీవల ప్రకటనలు ఇచ్చారు. చెరువు విస్తీర్ణంపైన సర్వే నిర్వహించారు. న్యాయ పరమైన చిక్కులు లేకుండా పక్కాగా చెరువు స్వాధీనానికి ప్రయత్నాలు చేస్తుండటంతో పట్టణంలో తీవ్ర చర్చ నడుస్తోంది. 

ఇదీ మున్సిపాలిటీ వాదన 

ఈ చెరువు అభివృద్ధికి మున్సిపాలిటీ పదేళ్లుగా చర్యలు తీసుకుంటోంది. గతంలో మట్టి పూడిక తీయించారు. గడచిన పాలకవర్గ హయాంలో తూడు తొలగించి చేపల సాగు కోసం లీజుకు ఇచ్చారు. రికార్డుల్లో మున్సిపల్‌ చెరువుగా నమోదు చేసుకున్నారు. గతంలో మంచినీళ్ల అవసరానికి చెరువును వినియోగించేవారు. అయితే చెరువులో కొంత భాగం ఆక్రమణకు గురైనా ఎవరూ పట్టించుకోలేదు. ప్రైవేటు వ్యక్తుల వ్యవహారాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే ఈ చెరువు ముమ్మాటికీ మున్సిపాలిటీదేనని స్పష్టం చేస్తున్నారు. ‘తాడేపల్లిచెరువు మున్సిపాలిటీదే. న్యాయపరంగా ఎటువంటి ఆదేశాలు మాకు రాలేదు. రికార్డుల్లో అది మున్సిపల్‌ చెరువుగానే నమోదైంది. అందులో ఎటువంటి అనుమానాలకు తావులేద’ని మున్సిపల్‌ కమిషనర్‌ పి.బాలస్వామి చెబుతున్నారు. దశాబ్దాల కాలంగా ఈ చెరువు మున్సిపాలిటీ హయాంలోనే ఉంది. దీనిపై ఇప్పుడు కొందరు వ్యక్తులు తమదేనని ప్రచారం చేస్తుండటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు ఈ చెరువు విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలి. అంతేకాకుండా ఈ చెరువు అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని స్థానికులు కోరుతున్నారు.


Updated Date - 2021-06-17T05:04:20+05:30 IST