ప్రొఫెషనల్‌ బాదడు

ABN , First Publish Date - 2022-06-25T06:05:24+05:30 IST

ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాలుగా బాదేందుకు వెనుకడడం లేదు.

ప్రొఫెషనల్‌ బాదడు

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో 3వేల మందికి నోటీసులు
ప్రాక్టీస్‌లో లేకున్నా పట్టా ఉంటే కట్టాల్సిందేనట..
పట్టా పొందిన నాటి నుంచి ఏడాదికి రూ.3 వేలు బాదుడు
 కట్టేది లేదని తేల్చి చెబుతున్న లాయర్‌లు

తాడేపల్లిగూడెం క్రైం, జూన్‌ 24: ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఎన్ని రకాల మార్గాలు ఉంటే అన్ని రకాలుగా బాదేందుకు వెనుకడడం లేదు. తాజాగా న్యాయవాదులు ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. విచిత్రం ఏమిటంటే అది ఈ ఏడాది మాత్రమే కాదు వారు న్యాయ వాద పట్టా పొందిన నాటి నుంచి ఏడాదికి రూ.3వేలు చొప్పున కట్టి తీరాల్సిందేనని, దానికి 15 రోజులే గడువంటూ పేర్కొవడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో న్యాయవాదుల్లో అలజడి మెదలయింది. ఏం చేయాలంటూ తర్జన భర్జనలు పడుతున్నారు. న్యాయవాద డిగ్రీ పొందినా ప్రాక్టీస్‌ చేపడితే కానీ వారు పూర్తిస్థాయిలో న్యాయవాదులు కారు. కానీ ప్రభుత్వం న్యాయవాద డిగ్రీ పూర్తయితే ట్యాక్స్‌ చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు. నెలకు రూ.15 వేల లోపు ఆదాయం ఉన్న న్యాయవాదులు ఈ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదని యాక్టులో ఉందం టూ కొందరు కోర్టుకు వెళ్లాలని భావిస్తుంటే మరి కొందరు సామూహికంగా ఎదుర్కొవాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెల్లించేదే లేదంటున్నారు.
మూడు వేల మందికి నోటీసులు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు బార్‌ అసోసియేషన్‌లో 1300 మంది, తాడే పల్లిగూడెం 300, భీమవరం 800, తణుకు 200, నిడదవోలు 100, జంగారెడ్డిగూడెంలో 300 మంది న్యాయవాదులు నమోదై ఉన్నారు. వీళ్లందరికీ   నోటీసులు జారీ అయ్యాయి. వీరితో పాటు అసోసియేషన్‌లో లేకుండా పట్టా పొందిన వారికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ట్యాక్స్‌ కట్టేదే లేదంటూ బార్‌ అసోసియేషన్‌లలో తీర్మానాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నోటీసులు జారీ దారుణం
న్యాయవాదులకు ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ పేరుతో నోటీసులు జారీ చేయడం దారుణం. వృత్తి నిర్వహించే వారు, పట్టా పొందిన వారు తేడా లేకుండా అందరికీ నోటీసులు జారీ చేశారు. ఇది దారుణం. దీనిపై న్యాయవాదులంతా ఒకే మాటపై ఉన్నాం.
– పెదగాడి భూపాల్‌, బార్‌ అసొషియేషన్‌ ప్రధాన కార్యదర్శి తాడేపల్లిగూడెం
ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకే..
ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఏ మార్గాన్ని వదలడం లేదు. చాలీ చాలని ఆదాయంతో ఇబ్బంది పడుతున్నా మాపై కూడా ప్రొఫెష నల్‌ ట్యాక్స్‌ అంటూ బాదడానికి బయల్దేరింది. దీనిపై న్యాయవాదులంతా కలిసి పోరాటం చేయడానికి వెనుకాడం.
– సీహెచ్‌ వాసు, న్యాయవాది

Updated Date - 2022-06-25T06:05:24+05:30 IST