‘దేశం’ఆగ్రహం

Sep 18 2021 @ 00:08AM
ఏలూరులో రమేశ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు

చంద్రబాబు ఇంటిపై వైసీపీ దాడి హేయం

జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలు

(ఆంధ్రజ్యోతి–న్యూస్‌ నెట్‌వర్క్‌)

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరుల దాడిని ఖండిస్తూ జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు  నిరసన తెలిపాయి. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళుతున్నామంటూ ప్రకటించి మరీ దాడులు చేసిన వైసీపీ మూకలను నిలువరించకుండా పోలీసులు చోద్యం చూడటం సిగ్గుచేటని టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ధ్వజమెత్తారు. 70 లక్షల పసుపు సైన్యం తిరగబడితే వైసీపీ తాడేపల్లి తాలిబాన్ల పరిస్థితి ఏమిటో గ్రహించాలని హెచ్చరించారు. చంద్రబాబు నివాసంపై దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, దోషులను కఠినంగా శిక్షించాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. అయ్యన్నపాత్రుడి మాటలకు సమాధానం చెప్పలేక వైసీపీ ఇలాంటి నీచమైన పనులు చేస్తోందని ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. వైసీపీ అల్లరి మూకల దాడి హేయమని ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ ఉన్న చంద్రబాబు నివాసంపై దాడులను అరికట్టలేని ప్రభుత్వం సామాన్యులకేం రక్షణ కల్పిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో నరసాపురంలోని పార్టీ కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు నల్ల కండువాలు ధరించి నినాదాలు చేశారు. రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. దేవరపల్లిలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వైసీపీ పాలనపై న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా సిగ్గు లేదా ? అంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడిలో టీడీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. చంద్రబాబు ఇంటిపై  దాడి అమానుషమని పోలవరం  నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ ఖండించారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.