గుదిబండ!

ABN , First Publish Date - 2022-07-02T06:18:41+05:30 IST

తాడేపల్లిగూడెం పట్టణానికి భూగర్భ డ్రెయినేజీ శాపంగా పరిణమించింది.

గుదిబండ!

తాడేపల్లిగూడెంలో ముందుకు కదలని భూగర్భ డ్రెయినేజీ
ముందుచూపు లేకుండా ప్రాజెక్ట్‌ ప్రారంభం
కేంద్రం అనుమతి లేకుండా పనులు
13 ఏళ్లుగా ప్రాజెక్ట్‌ పెండింగ్‌
ఎస్‌టీపీలు నిర్మాణం లేకపోవడంతో అక్కరకు రాని పైప్‌లైన్‌లు


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం పట్టణానికి భూగర్భ డ్రెయినేజీ శాపంగా  పరిణమించింది. గడచిన 13 ఏళ్ల నుంచి ప్రాజెక్ట్‌  పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా 2009లో అప్పటి ప్రజాప్రతినిధి హడావిడిగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌ ఇప్పుడు మునిసిపాలిటీకి గుది బండగా మారింది. రహదారులు తవ్విపోశారు. వాటిని పూడ్చేందుకు తదుపరి ప్రజాప్రతినిధులు ఆపసోపాలు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరించేలా నియో జక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఈలి నాని జీవో విడుదల చేసేలా కృషి చేశారు. అమలుకు నోచుకోకుం డానే నాటి ప్రభుత్వం కాలపరిమితి ముగి సింది. ఆపై అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తవ్విపోసిన మిగిలిన రోడ్లను పూడ్చేందుకు చర్యలు తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అమృత్‌ ప్రాజెక్ట్‌లో భూగర్భ డ్రెయినేజీ పూర్తి చేసేందుకు గత కౌన్సిల్‌ అనుమతి తెచ్చుకుంది. తొలుత రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పనులు పూర్తి చేసి తదుపరి భూగర్భ డ్రెయి నేజీ నిర్మించాలని తలపోశారు. రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ టెండర్లు ఖరారు చేశారు. అప్పటిలోగా తెలుగు దేశం ప్రభుత్వం కాలపరిమితి పూర్తయ్యింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గడచిన మూడేళ్లుగా రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ పనులు చేపట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. భూగర్భ డ్రెయినేజీని అమలులోకి తెచ్చేందుకు సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లకు ప్రణాళికలు చేశారు. రెండు రోజుల కిందట దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మునిసిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు శంకుస్థాపన చేసేందు కు వెళితే కడకట్ల ప్రాంత వాసులు అడ్డుకు న్నారు. జనావాసాల మధ్య సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించకూడదంటూ స్థానికులు స్పష్టం చేశారు. దాంతో భూగర్భ డ్రెయినేజీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.

భూగర్భ డ్రెయినేజీ చరిత్ర ఇదీ
 2009లో ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ భూగర్భ డ్రెయినేజీ ప్రాజెక్ట్‌ను  ప్రారంభించారు. అప్పట్లో రూ.32 కోట్లతో ప్రాజెక్ట్‌ పనులు చేపట్టారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌ ఇది. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ అను మతి పొందలేదు. అయినా స్థానికంగా పనులు ప్రారంభించేశారు. అదే ఇప్పుడు పట్టణాన్ని వెంటా డుతోంది. రహదారులను అప్పట్లో తవ్విపోసి డ్రెయినేజీ పైప్‌లైన్‌లు వేశారు. వాటిని పూడ్చేందుకు మళ్లీ కష్టపడాల్సి వచ్చింది. సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మిస్తే భూగర్భ డ్రెయినేజీ అందుబాటులోకి వస్తుంది. అప్పట్లోనే యాగర్లపల్లి సమీపంలో 14 ఎకరాల భూమిని చూశారు. కానీ సేకరించలేకపోయారు. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు అంత పెద్ద మొత్తంలో భూమిని సేకరించేందుకు సాహసం చేయలేకపోయాయి.
 
ప్రత్యామ్నాయంగా  చెరువు
 అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కార్యరూపంలోకి తెచ్చేం దుకు గత కౌన్సిల్‌ చేయని కృషి లేదు. యానాదుల కాల నీ సమీపంలో చెరువు ప్రాంతంలో సీవేజ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించాలని భావించినా కార్యరూపం దాల్చ లేదు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా గత కౌన్సిల్‌లో మంజూరైన నిధులతోనే సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లను నిర్మించాలని కసరత్తు చేశారు.   హౌసింగ్‌ బోర్డు, కడకట్ల ప్రాంతాల్లో  రెండు ప్లాంట్‌లు నిర్మించేందుకు ప్రణాళిక రచించారు. వాస్తవానికి యాగర్లపల్లి ప్రాంతంలో ఒకేచోట పెద్ద ప్లాంట్‌ ఏర్పా టుకు కొట్టు సత్యనారాయణ హయాంలో చేసిన ప్రణా ళిక మరుగున పడిపోయింది. చిన్న ప్లాంట్‌లు తెరపైకి  రాగా స్థానికుల నుంచి  వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 పైప్‌లైన్‌ సంగతేమిటి?
భూగర్భ డ్రెయినేజీ పైప్‌లైన్‌లు దశాబ్ద కాలం క్రితం వేసేశారు. ఇప్పుడు అదే పైప్‌లైన్‌లలోకి పలుచోట్ల స్థానికులు మురుగు కనెక్షన్‌లు ఇచ్చేశారు. ఒక్కో చోట మునిసిపాలిటీ పైప్‌లైన్‌లలోకి అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పైప్‌లైన్‌ల నీరు చేరిపోతోంది. దానిని కూడా మరమ్మ తులు చేయాలి. ముందు చూపులేకుండా హడావిడిగా అప్పట్లో ప్రారంభించిన ప్రాజెక్ట్‌  ఇప్పుడు పట్టణ ప్రజలకు శాపంగా మారిపోయింది.

Updated Date - 2022-07-02T06:18:41+05:30 IST