రాయితీ.. ఎక్కడ?

ABN , First Publish Date - 2022-09-29T05:44:35+05:30 IST

వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ కొందరికే పరిమితమవుతోంది.

రాయితీ.. ఎక్కడ?

వ్యక్తిగత రాయితీ కోసం రైతుల ఎదురుచూపులు
డ్రోన్‌లు సైతం గ్రూపులకే..
కొందరికే పరిమితమవుతున్నరాయితీ
పథకం అమలులో కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వ్యవసాయ యాంత్రీకరణ కోసం ప్రభుత్వం ఇస్తున్న రాయితీ కొందరికే పరిమితమవుతోంది. వ్యక్తిగత రాయితీ లో ఇచ్చే ఉపకరణాలను నిలిపివేశారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఏర్పాటుచేసిన గ్రూపులకే రాయితీ పరికరాలు పంపిణీ చేస్తున్నారు. పైరుపై పురుగు మందులు చల్లే డ్రోన్‌లను గ్రూపులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంతో కొందరు రైతులకే ప్రయోజనం చేకూరుతోంది. పెద్దమొత్తంలో లబ్ధి పొందు తున్నారు. గతంలో వ్యక్తిగత రాయితీలో పరికరాలు ఇచ్చే వారు. ఫలితంగా అధిక సంఖ్యలో రైతులకు లబ్ధి చేకూరేది. గతేడాది నుంచి రైతు భరోసా కేంద్రాల్లో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కోసెంటర్‌లో ఐదుగురు రైతులతో గ్రూపులను ఏర్పాటుచేశారు. వారికే రూ.15 లక్షల విలువైన వ్యవసాయ ఉపకరణాలను అందజేస్తున్నారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సం యుక్తంగా 40 శాతం రాయితీ ఇస్తు న్నాయి. ట్రాక్టర్‌లు, పవర్‌ టిల్లర్స్‌, రోటో వేటర్‌లు, వరినాటు యంత్రాలు వంటి ఉపకరణాలు సరఫరా చేస్తున్నారు. తాజాగా డ్రోన్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో మండలానికి మూడు రైతు భరోసా కేంద్రా లను ఎంపిక చేయనున్నారు. వాటి పరిధిలో ఉన్న కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లకు డ్రోన్‌లను కేటాయిస్తారు. ఒక్కో డ్రోన్‌ విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది.

నష్టపోతున్న బడుగులు
 గతంలో రాయితీ వ్యక్తిగత ఉండేది. బీసీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రాయితీ అధికంగా ఇచ్చేవారు. ట్రాక్టర్‌లు, డ్రోన్‌లు వంటి యంత్ర పరికరాలు మినహా మిగిలినవన్నీ సరఫరా చేసేవారు. ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం మేర రాయితీ కల్పించేవారు. బీసీలకు, మహిళా రైతులకు 50 శాతం రాయితీ అమల్లో ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత రాయితీకి స్వస్తి పలికారు. కొంతమంది రైతులకే పెద్దమొత్తంలో రాయితీ ఇచ్చే విధానాన్ని తెర పైకి తెచ్చారు. బరకాలు, స్ర్పేయర్‌లు వంటివి పంపిణీ చేయడం లేదు. దీని వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోంది. కొంతమంది రైతులకే లబ్ధిచేకూరుతోంది.

 ఊగిసలాట..
గ్రూపులకు ఇచ్చే ఉపకరణాల విషయంలోనూ ప్రభుత్వం ఊగిసలాడుతోం ది. తొలుత ట్రాక్టర్‌లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కంపెనీలు మందుకు రాకపోవడంతో ట్రాక్టర్‌లకు బదులుగా ఇతర పరికరాలు అందిస్తూ వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ట్రాక్టర్‌లకు రాయితీ మంజూరు చేయక పోవడం వల్ల కంపెనీలు వెనుకంజ వేశాయి. ట్రాక్టర్‌లు ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. ప్రస్తుతం ముందస్తుగానే మొత్తం సొమ్ము ఇచ్చేందుకు  ప్రభుత్వం సిద్ధపడింది. దాంతో కంపెనీలు ట్రాక్టర్‌లు ఇవ్వడం ప్రారంభించాయి. కానీ గతంలో ఇవ్వాల్సిన రాయితీపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించడం లేదు.
 బ్లాక్‌ లిస్ట్‌లో కంపెనీ
ప్రభుత్వం ట్రాక్టర్‌లు మంజూరు చేసినా పర్యవేక్షణ కొరవడింది. ఫలితంగా ఓ కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర మోడళ్లను సరఫరా చేసింది. ప్రభుత్వం అనుమతి లేని మోడళ్లను ఇచ్చేసింది. ధరలు అధికంగా ఉన్నాయి. దీనిపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వ్యవసాయ శాఖ అధికారులు విచారణ నిర్వహించారు. సదరు కంపెనీ రైతులకు మంజూరుచేసిన ట్రాక్టర్‌ల ప్రక్రియలో తప్పిదాలు జరిగి నట్టు వ్యవసాయశాఖ గుర్తించి ఆ కంపెనీని ప్రస్తుతం బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు రైతులు తమనుంచి అధిక మొత్తంలో వసూలు చేసిన సొమ్ములను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-09-29T05:44:35+05:30 IST