ఫ్యాన్‌ కింద జగడం

ABN , First Publish Date - 2022-08-14T05:04:52+05:30 IST

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.. అధికార వైసీపీలో వర్గపోరు బయటపడుతోంది.

ఫ్యాన్‌ కింద జగడం

అధికార పార్టీలో కలహాలు.. కవ్వింపులు
రోడ్డున పడుతున్న అంతర్గత విభేదాలు
పాలకొల్లులో జడ్పీ చైర్మన్‌పైనా కస్సు బుస్సు
ఉండిలో ఆధిపత్య పోరు..
జంగారెడ్డిగూడెంలో ఆధిపత్య పోరు
గోదారి ఒడ్డున తగ్గుతున్న వైసీపీ గ్రాఫ్‌
అధిష్టానం ఇటు చూస్తే ఒట్టు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.. అధికార వైసీపీలో వర్గపోరు బయటపడుతోంది. మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. అంతా బాగుందన్నట్టు ఎక్కడా బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడినా కలహాలన్నీ ఇప్పుడు కొత్త సీను సృష్టిస్తున్నాయి. కొందరు నేతలు బరితెగించి ఎమ్మెల్యేల మాటలు పెడచెవిన పెడుతున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఏకపాత్రాభినయం కేడర్‌ను నివ్వెరపరుస్తోంది. శృతి మించిన అవినీతి ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జిల్లా పార్టీ నాయకత్వాలను పట్టించు కోవడం లేదు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదుపు చేసే యంత్రాంగం కరవు. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో వైసీపీ బలహీన పడుతున్న క్షణాన కలహాలు.. కవ్వింపులు పార్టీని మరింత దిగజారుస్తున్నాయి. ఇంకోవైపు ప్రతిపక్ష టీడీపీ చాలా నియోజకవర్గాల్లో పుంజుకుంటుండగా వైసీపీ గ్రాఫ్‌ తగ్గుతోందని ఓ విశ్లేషణ.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
పాలకొల్లు నియోజకవర్గ వైసీపీలో నాలుగు స్తంభాలట నడుస్తోంది. ఆది నుంచి ఇక్కడ వర్గ పోరుకు నెలవైనా అధిష్టానం హెచ్చరించినా కిందిస్థాయి కేడర్‌, వీటికి నాయకత్వం వహిస్తున్న నాయకులు బేఖాతర్‌ చేస్తున్నారు. జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఇక్కడ ఓటమి పార్టీని గుక్కపట్టించింది.  నిలదొక్కుకోవడానికి మూడేళ్లుగా ముప్పు తిప్పలు పడుతూనే ఉంది. జడ్పీ చైర్మన్‌ నేతృత్వంలో పార్టీ కేడర్‌, నేతలు ఉమ్మడి కార్యాచరణకు రావాలని, తగ్గట్టుగానే పార్టీ పుంజుకునేలా వ్యవహరించాలని అధిష్టానం ఆదేశించింది. ఈ సూచనలకు ఓకే అన్న వారంతా ఇప్పుడు దానిని గాలికొదిలేశారు. శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వైసీపీలోనే కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా తగిన సమాచారాన్ని ఇవ్వడం లేదని, కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మరికొందరిని పట్టించుకోవడం లేదని, ఆయన నడవడికపై పార్టీలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆది నుంచి ఈ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న తనను విశ్వసించకుండా వేరొకరికి బాధ్యతలు అప్ప గించడాన్ని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఆరంభమైన కలహం కాస్తా ఈ మధ్య మరింత ముదిరింది. కవురు నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండడం, వేరే విధంగా కార్యక్రమాలు నిర్వహిం చడం చేస్తూనే ఉన్నారు. ఎందుకిలా జరుగుతోం దని పార్టీ వేదికగా సమీక్షించాల్సిన కవురు ఈ పరిణామాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరో నేత డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ తాతాజీ సైతం తనంతట తాను రూపొందించుకున్న కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప, కరువు చేపట్టే కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. మరో సీనియర్‌ గుణ్ణం నాగబాబు మాత్రం కవురు వైపే ఉన్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి నాయకత్వం లేకపోగా ఎవరికి వారు వ్యవహరించడం వైసీపీ బలహీనతకు మరో నిదర్శనం. అంతర్గత పోరు, భిన్న వాదనలతో ఆ పార్టీ కకావికలమవుతోంది. దీనిని సర్దుబాటు చేసేందుకు జిల్లా నాయకత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజలతో కలిసి మెలిసి ముందుకు సాగుతుండగా వైసీపీ నేతలు వర్గాల వారీగా విడిపోయి ఎవరికి వారన్నట్టు వ్యవహరిస్తోంది.

జంగారెడ్డిగూడెంలో జగడం
మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజ కవర్గంలోనూ వైసీపీలో అసంతృప్తి సెగలు ఎగుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎలీజాకు అనుకూలం గా కొందరు, వ్యతిరేకంగా ఇంకొందరు గళం విప్పుతున్నారు. ఎమ్మెల్యే అనుకూ లురు కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, దీనిని ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఈ మధ్యనే జంగా రెడ్డిగూడెం మునిసిపల్‌ ప్రాంతంలో భారీగా వసూళ్లకు పాల్పడడం, ఈ వ్యవహారం కాస్తా రోడ్డున పడడం వివా దాలకు, రాజకీయ వాదనలకు, అధికారుల బదిలీకి దారి తీయడం చకచకా జరిగింది. ఎమ్మెల్యే ఇలాంటి తంతును కట్టుడి చేయకపోగా మౌనం దాలుస్తున్నారని, ఇది పార్టీకి క్షేమదాయకం కాదనే వాదనలో కొందరు ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎమ్మెల్యే ఎలీజా వర్గాలుగా విడిపోయారు. దీనికి అనుగుణంగానే ఎవరి వర్గం వారు తమదే పెత్తనం సాగాలన్నట్టు వ్యవహరించడం, దానిలోను చివరి వరకు తమదే పైచేయి కావాలనే వ్యూహంతో పార్టీలో తీవ్ర అలజడి రేగింది. నియోజకవర్గంలో అవినీతి కార్యక్రమాలు క్రమేపీ పెరగడం, దానికి తగ్గట్టు నివారణ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎమ్మెల్యే అంటీముట్టనట్టు వ్యవహరించడం వైసీపీలో కొత్త పోరుకు దారితీస్తోంది. స్థానిక నేతలు సైతం తమకు ప్రాధాన్యత లభించడం లేదని, కష్టపడి పనిచేసే వారికి కాకుండా కేవలం కొన్ని సామాజిక వర్గాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శతో గరంగరం అవుతు న్నారు. వరుసగా చోటు చేసుకున్న ఘటలన్నీ ఏకరవు పెట్టినా అధిష్టా నం డోంట్‌కేర్‌ అన్నట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్టు ఎమ్మెల్యే తరపున తమంతట తాముగానే సొంత మనుషులుగా ప్రకటించుకున్న కొందరు విర్రవీగడం, అందిన కాడికి అందినట్టు జేబులు నింపుకోవడానికి ప్రయత్నించడాన్ని నిలదీస్తున్నారు.

ఉండిలో ‘రాజుల’ యుద్ధం

ఉండి నియోజకవర్గంలో ఆది నుంచి వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. అప్పట్లో పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్‌ నరసింహరాజుకు పార్టీ బాధ్యతను అప్పగించినట్టే అప్పగించి కొద్ది కాలం తరువాత ఆ బాధ్యతల నుంచి వైసీపీ తప్పించింది. ఆ స్థానంలో సీనియర్‌ నేత గోకరాజు రామానికి కళ్లాలు అప్పగించారు. ఉండి నియోజక వర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సర్రాజును కాదని, ఆయనకు క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి అప్పగించేశారు. తీరా ఉండి నియోజక వర్గంలో మండలాల వారీగా వైసీపీలో గ్రూపులు తలెత్తాయి. పీవీఎల్‌ కు అనుకూలంగా కొందరు, రామంకు ఇంకొందరు ఎవరంతట వారుగా వ్యవహరించారు. ఇది కాస్తా ముదిరి ముదిరి ఈ మధ్యకాలంలోనే గడపగడపకు కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను పీవీఎల్‌కే అప్పగిస్తూ పార్టీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న రామాన్ని క్రమేపీ బలహీనపరిచే విధంగానే ఈ చర్యలు ఉన్నాయని ఆయన అనుకూల వర్గం యావత్తు అసంతృప్తిలో పడింది. దీనికి తగ్గట్టుగానే రామంకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారందరిలో ఒక్కొక్కరిని బాధ్యతల నుంచి తప్పించి తమ అనుచరులను నియమించుకునే విధంగా పీవీఎల్‌ వ్యవహరిస్తున్నారనేది మరో వాదన. దీనికి తగ్గట్టుగానే కొందరు జడ్పీటీసీలు సైతం పార్టీకి దూరంగా జరుగుతున్నారు. పాలకోడేరు జడ్పీటీసీ స్థానిక పార్టీ కార్యక్రమాల్లో ఇమడలేనంటూ తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. దీంతోనైనా కళ్లు తెరిచి పార్టీలో పేట్రేగుతున్న అసంతృప్తులను కాస్తంత బుజ్జగిస్తారని అందరూ ఎదురుచూశారు. కాని వీటిని పట్టించుకోకుండా ఎవరికి వారు ఇక్కడ కత్తులు దుయ్యడం ప్రారంభించారు. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు ప్రశ్నించే విధంగా వ్యవహారం సాగుతోంది. ఇవన్నీ కలబోసి వైసీపీ వ్యవహారాలన్నీ రోడ్డు మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోందని భావిస్తున్నారు.

Updated Date - 2022-08-14T05:04:52+05:30 IST