అమ్మఒడి ఆంక్షలెన్నో!

ABN , First Publish Date - 2022-06-25T06:09:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అమ్మఒడి ఈ ఏడాది అనేక మందిని అనర్హులుగా నిర్ధారించినట్టు తెలుస్తోంది.

అమ్మఒడి ఆంక్షలెన్నో!

ఆటంకంగా కొత్త నిబంధనలు
చాలామంది లబ్ధిదారులకు సరిగాని ఈకేవైసీ, ఫోన్‌ నెంబర్లు
రెండోదఫా కొందరికి మొండిచెయ్యి
ఈసారి అర్హుల్లోనూ తప్పని ఆందోళన
ఇచ్చే మొత్తంలో రూ.2వేలు కోత


అమ్మఒడి పథకం ప్రారంభమైన నాటి నుంచి గందరగోళంగానే అమలవుతోంది. ఇప్పటికే రెండు దఫాలు సాయం అందించినా ఇప్పటికీ లబ్ధిదారుల్లో తమకు అందుతుందో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఏడాదిన్నర తర్వాత మూడోసారి అమ్మఒడి అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించినా పథకం అందే వరకు నమ్మకం లేదన్న అభిప్రాయం లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు.  మొదటి దఫా అమ్మఒడి వచ్చిన వారిలోనే కొంత మందికి రెండో దఫా రాకపోవడం, తాజాగా మూడో దఫాలో ఎన్నో నిబంధనలు చేర్చడంతో ఎంతమందికి ఈసారి అందుతుందో  లేదో తెలియని పరిస్థితి.  మరో రెండు రోజుల్లో జమ కానున్న అమ్మఒడి ఎంత మందికి వస్తుందో లేదోనన్న ఆందోళన నెలకొంది.

భీమవరం ఎడ్యుకేషన్‌, జూన్‌ 24 : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అమ్మఒడి ఈ ఏడాది అనేక మందిని అనర్హులుగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. సాంకేతిక ఇబ్బందులు వెంటాడుతున్నా ప్రభుత్వం విధించిన ఈకేవైసీ అనుసంధానంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా వెనుకబడే ఉన్నారు. జిల్లాలో వందలాది మంది ఈకేవైసీ కాలేదని సమాచారం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు, ఇతర నమోదులో లోపాలు ఉంటే సరిచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయితే కొంత మంది లబ్ధిదారులకు అవగాహన లేకపోవడంతో అవి సరిచేసుకోలేదు. ఏ సాంకేతిక లోపం ఉన్నా అమ్మఒడి రాదని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఏ లోపం చూపి ఆపేస్తుందో తెలియని గందోరగోళ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ఖాతాల్లో సొమ్ము జమ అయితేనే గాని అర్హులా.. అనర్హులా అనేది తెలియని విషయంగా మారింది. 2021–22 విద్యార్థుల లెక్కల ప్రకారం జిల్లాలో 1896 పాఠశాలల్లో రెండు లక్షల 38 వేల 629 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో అర్హతను బట్టి అమ్మఒడి మంజూరు చేయాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపాలు, ఇతర విషయాలు సాకుగా సుమారు పదిశాతం పైనే అనర్హుల జాబితాలో చేరే అవకాశం లేకపోలేదు. మరో రెండు రోజుల్లో పథకం అమలైనప్పుడు స్పష్టత రానుంది.

 ఆంక్షలు ఎన్నో..
అమ్మఒడి పథకంలో గతంలో లేని విధంగా ఈసారి దఫాలో ఎన్నో ఆంక్షలు ప్రభుత్వం తీసుకొచ్చింది. 300 యూనిట్లు విద్యుత్‌ వాడకం, పట్టణంలో పరిమితికి మించి స్థలాలు బట్టి అనర్హుల జాబితాలో చేస్తారని ఆంక్షలు విధించడంతోపాటు గతంలో రూ.14 వేలు లబ్ధిదారులకు అందించే అమ్మఒడి ఈసారి రూ.13 వేలుకు ఇచ్చేలా మార్పు చేశారు. వాస్తవానికి రూ.15 వేలు కాగా మిగిలిన రూ.రెండు వేలు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్‌, స్కూల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు అందించే విధంగా మార్పు చేసింది.

 ఒక ఏడాది తప్పించేశారా..?

అమ్మఒడి పథకం ప్రతీ విద్యాసంవత్సరం అందిస్తానన్న ప్రభుత్వం ఒక ఏడాది తప్పించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరం అమ్మఒడి 2020 జనవరి 13న వేశారు. రెండవ దఫా 2020–21 విద్యా సంవత్సరానికి 2021 జనవరి 13న వేశారు. మూడో దఫా 2021–22 విద్యా సంవత్సరానికి 2022 జనవరి 13న వేయాలి అలా వేయకుండా ఈనెల 27న వేస్తున్నారు. మరి ఈ 3వ దఫా అమ్మఒడి గడిచిన విద్యా సంవత్సరానిదా, 2022–23 సంవత్సరానిదా అంటే గతేడాది వేయలేనట్లే అనిపిస్తోంది. ఆ లెక్కన ఒక ఏడాది అమ్మఒడికి ఎగనామం పెట్టినట్టేనని లబ్ధిదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-06-25T06:09:37+05:30 IST