చినుకు తడి.. నేలంతా చిత్తడి!

ABN , First Publish Date - 2021-07-23T05:14:00+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

చినుకు తడి.. నేలంతా చిత్తడి!
కీసరలోని నాగారం యూటర్న్‌ వద్ద బురదమయంగా మారిన రోడ్డు

  • ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు 
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు  
  • కాలనీలు, రోడ్లను ముంచెత్తుతున్న వరదలు
  • జనజీవనం అస్తవ్యస్తం 
  • పరవళ్లు తొక్కుతున్న మూసీ జంట జలాశయాల గేట్లు ఎత్తివేత


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో  గురువారం రోజంతా మోస్తరు నుంచి కుండపోతగా వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలకు  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.  దాదాపు అన్నిచోట్ల కుంటలు నిండిపో యాయి. వర్షాలతో కొన్నిచోట్ల పంటనష్టం కూడా జరిగింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లోకి నీరు చేరి ధాన్యం తడిసి మొల కెత్తింది. ఉమ్మడిజిల్లాలో గడిచిన 24 గంటల్లో సగటు 40 నుంచి 60 మి.మీ వర్షపాతం నమోదైంది. తలకొండపల్లిలో అత్యధికంగా 65 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే భారీ వర్షాలతో  మూసీ పరవళ్లు తొక్కుతోంది. గురువారం అర్ధరాత్రి వరకు జోరుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో నల్లరేగడి నేలల్లో పంటలు వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆది వారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో కొన్ని పంటలు వేసిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి.  ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు పారడంతో చెరువులకు కొత్త నీరు చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లు చిత్తడిగా మారాయి. పంటలు నీట మునిగి దెబ్బ తిన్నాయి. వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోంది. పొలంలో కలుపుతీత, మొక్కలకు ఎరువులు వేయడం వంటి పనులకు ఆటంకం కలగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 50 శాతానికి పైగా రైతులు పంటలు వేశారు. వాస్తవానికి వ్యవసాయ సాగు ఇంకా పెరగాల్సి ఉంది. వర్షాలకు పనులు ముందుకు సాగడం లేదు. వర్షాలు తగ్గు ముఖం పడితే వ్యవసాయ పనులు చురుకుగా కొనసాగే అవకాశం ఉంది. భారీ వర్షాలకు కోట్‌పల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సామర్ధ్యం 24 అడుగులు కాగా గురువారం  22 అడుగులకు వరద నీరు చేరింది. ఎగువన ప్రాంతాల వాగుల నుంచి వరదనీటితో ప్రాజెక్టు అలుగు ఏ క్షణమైనా పొంగిపొర్లనుంది. యాచారం, చింతపట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసి మొలకెత్తింది. కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్‌ కవర్లు ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యం మొలకెత్తిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లాలో సగటుకు మించి వర్షాలు కురిశాయి. సగటు కంటే దాదాపు70శాతానికిపైగా వర్షపాతం నమోదైంది. జూలై నెలలో సగటు 153 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటికే 282మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు 84శాతం అధికంగా వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో 100శాతానికిపైగా అధిక వర్షపాతం కురిసింది. ఈ సీజన్‌లో హయత్‌నగర్‌లో సాధారణం కంటే 177శాతం అధిక వర్షపాతం నమోదైంది. 


మూసి పరవళ్లు... జలాశయాల గేట్లు ఎత్తివేత

మూసీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో మూసీనది పరవళ్లు తొక్కుతోంది. మూసీ వరద ప్రవాహం పెరగడంతో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లు నిండిపోయాయి. దీంతో జంటజలాశయాల నుంచి వరద నీరు కిందకు వదులుతున్నారు. 

గండిపేటకు పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటిం చారు. దిగువ ప్రాంతాలకు వరద హెచ్చరిక విడుదల చేశారు. గురవారం సాయంత్రం హిమాయత్‌సాగర్‌కు వరద పెరగడంతో 5 గేట్లు ఎత్తివేసి కిందకు 15వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే ఉస్మాన్‌ సాగర్‌లో రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద హెచ్చరిక జారీ చేశారు. 



Updated Date - 2021-07-23T05:14:00+05:30 IST