కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-11-16T20:38:22+05:30 IST

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణ కాలుష్య తీవ్రతను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న..

కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాతావరణ కాలుష్య తీవ్రతను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ వేగంగా చర్యలకు ఉపక్రమించింది. సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పలు అత్యవసర చర్యలు ప్రకటించింది. సిటీలో స్కూళ్లు మూసివేత, నిర్మాణ పనులపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం (డబ్ల్యూఎఫ్‌హెచ్) సహా పలు చర్యలు ప్రకటించింది. పర్యావరణ ముఖ్యమంత్రి గోపాల్ రాయ్ మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, వాహన కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన 'రెడ్ లైట్ ఆన్, గడాఫీ ఆఫ్' ప్రచారం ఈనెల 18తో పూర్తి కానున్నందున దీనిని మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు చెప్పారు. సెకెండ్ ఫేజ్ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 3 వరకూ కొనసాగుతుందన్నారు.


పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో ఈరోజు సమావేశం జరిగిందని, ఎన్‌సీఆర్‌లో వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని, నిర్మాణ పనులు నిషేధించాలని, పరిశ్రమలను కూడా (ఎన్‌సీఆర్‌లో) మూసేయాలని సమావేశంలో ప్రతిపాదించామని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్య సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇటీవల సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ''ప్రజలు ఎలా బతకాలి? రెండ్రోజుల లాక్‌డౌన్ అమలు చేసే ఆలోచన కానీ, ప్రత్నామ్నాయ ఆలోచనలు కానీ ఏమైనా చేస్తున్నారా?'' అని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. వ్యర్థ పదార్ధాలను తగులబెట్టే మిషన్లు రైతులకు ఎందుకు సమకూర్చకూడదని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ప్రశ్నించింది.

Updated Date - 2021-11-16T20:38:22+05:30 IST