బాయిల్డ్‌ రైస్‌మిల్లర్లపై పిడుగు

Sep 26 2021 @ 00:36AM

దొడ్డు బియ్యం కొనుగోలు చేయబోమన్న కేంద్రం 

నిరాకరించిన ఎఫ్‌సీఐ అధికారులు

మిల్లర్ల వద్ద పేరుకుపోయిన నిల్వలు

మిల్లుల మూతతో రోడ్డున పడనున్న కార్మికులు

వానాకాలం పంటల దిగుబడిపై అన్నదాతల అయోమయం


బాయిల్డ్‌ రైస్‌ కొనకూడదని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రైతులు, రైస్‌ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వందకుపైగా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూత పడే పరిస్థితి ఏర్పడుతుందని మిల్లర్లు తలలు పట్టుకుంటున్నారు. మిల్లులు బంద్‌ అయితే వాటిపై ఆధారపడి జీవిస్తున్నా 8వేల మందికిపైగా కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఉపాధి పోయివారి కుటుంబాలు పస్తులు ఉండాల్సి దుస్థితి రాబోతుంది. దొడ్డు రకం బియ్యం ఎగుమతులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.


హనుమకొండ, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వరిసాగవుతుండగా అందులో దొడ్డు రకాలనే అధికంగా పండిస్తున్నారు. స్థానికంగా సన్నరకాలనే తినడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో దొడ్డు రకాలను (బాయిల్డ్‌) బి య్యంగా మార్చి ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఉప్పుడు బియ్యం ఎక్కువగా ఎగుమతి కావడం, దేశీయంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రజలు బాయిల్డ్‌ బియ్యం ఎక్కువగా ఉపయోగించడంతో ఉమ్మడి జిల్లాలో దొడ్డు రకాల సాగు పెరిగింది. కానీ ఆ రాష్ట్రాల్లో దొడ్డురకం ధాన్యాన్ని పండిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. చైనా దేశానికి కూడా దొడ్డు బియ్యం ఎగుమతి అయ్యేవి. అంతర్జాతీయ సంబంధాల్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఆ దేశం దిగుమతులు తగ్గించింది. దీంతోపాటు ఎఫ్‌సీఐ గోదాముల్లో ఖాళీ లేవు. ఈ కారణంగా కేంద్రప్రభుత్వం దొడ్డురకం బియ్యాన్ని కొనుగోలు చేయమని నిర్ణయం తీసుకుంది. 


మిల్లర్లకు నష్టం

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో 350 లకుపైగా రైస్‌మిల్లులు ఉండగా వీటిలో వంద వరకు బాయిల్డ్‌ బియ్యం మిల్లులు ఉన్నాయి. యాసంగిలో అధికారులు ఒత్తిడి తీసుకువచ్చి మిల్లుల్లో ధాన్యాన్ని డంప్‌ చేయించారు. తాజా పరిణామాల ప్రకారం ప్రస్తుతం మిల్లింగ్‌ అయిన బియ్యాన్ని ఒక నెల వరకు మాత్రమే  తీసుకుంటామంటున్నారు. ఆ తర్వాత మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలనేది ప్రస్తుతం మిల్లర్లను వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం  రైతులు పండిస్తున్న పంట నవంబర్‌, డిసెంబర్‌ నెలలో మార్కెట్‌లోకి వస్తుంది. దీనినే ఏం చేయాలనేది తెలియడం లేదు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తీసుకునేదెవరు అనేది అయోమయంగా ఉంది. గత ఏడాదికి సంబంధించి కొత్త మంది మిల్లర్లు అందజేయాల్సిన బియ్యం ఇంకా అలాగే ఉంది. దీనిని ఇస్తామంటే కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదు. 


నష్టమే..

మిల్లర్ల వద్ద ఉన్నదంతా దొడ్డు, బాయిల్డ్‌ రకమే. తమ దగ్గర ఉన్న వడ్లనైనా లేదా బియ్యాన్నయినా తీసుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు. లేకపోతే దిగుమతి, రవాణా, స్టోరేజీపరంగా ఇప్పటివరకు అయిన ఖర్చులన్నీ తమపై పడే ప్రమాదం ఉందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. బాయిల్డ్‌ రైస్‌ను కేంద్రం తీసుకోకపోతే బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరమే. ఒక్కోక మిల్లులో 60 నుంచి 70మంది కార్మికులు పని చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ వంద బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల ద్వారా ప్రతీనెల 50వేల టన్నుల బియ్యం తయారవుతుంది. ప్రస్తుతం రైస్‌మిల్లర్ల వద్ద ధాన్యం ఉంది. నవంబర్‌, డిసెంబర్‌ నెలలో రైతుల దగ్గర నుంచి  పంట వస్తుంది. అప్పడు పరిస్థితి ఏమిటనేది మిల్లర్లు తేల్చుకోలేకపోతున్నారు.


దొడ్డు ధాన్యం సాగు..

వర్షాకాలంలో రైతులు ఎక్కువగా దొడ్డు రకం వరినే సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వాటికే ఎక్కువ ధర ప్రకటించడంతో ప్రతీ సీజన్‌లో వాటి సాగుకే ఆసక్తి కనబరుస్తున్నారు. వానాకాలంలో సాగుచేసిన దొడ్డు ధాన్యం బాయిల్డ్‌ బియ్యంగా మార్చేందుకు అవకాశం ఉంది. కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో దొడ్డు  ధాన్యం బాయిల్డ్‌కే పంపించాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేంద్రం నిర్ణయంతో జిల్లా రైతులు ఒక సీజన్‌ను పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. ఈసారి సకాలంలో వర్షాలు కురవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ వానా కాలంలో ఉమ్మడి జిల్లాలో 10.15 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేస్తున్నారు. తద్వారా వచ్చే మొత్తం దిగుబడులను బాయిల్డ్‌ బియ్యం కింద ఎఫ్‌సీఐ సేకరిస్తే మినహా దొడ్డు బియ్యం పడించే రైతులకు ఇబ్బందులు తప్పవు.


బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లకు తీవ్ర నష్టం  : తోట సంపత్‌ కుమార్‌, రైస్‌ మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు

కేంద్రం నిర్ణయం వల్ల బాయిల్డ్‌ బియ్యం మిల్లర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే రూ. 21వేల కోట్లు వెచ్చించి ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో రూ.6వేల కోట్లు మాత్రమే తిరిగి వచ్చింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా రూ.15వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నది.  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే రూ.1500 కోట్ల విలువైన దొడ్డు ధాన్యం ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఉంది. మిల్లులు నడినప్పుడు నిర్వహణపరంగా నెలకు సగటున సుమారు రూ.8లక్షల ఖర్చు ఉంటుంది. నడవకపోయినా రూ.5లక్షల వరకు వ్యయం మిల్లర్లు భరించాల్సిందే. బాయిల్డ్‌ రైస్‌ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు లేవు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మిల్లర్ల భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది.

రైస్‌ మిల్లులో పేరుకు పోయిన ధాన్యం


Follow Us on: