అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-11-22T11:17:33+05:30 IST

వరంగల్‌ మీదుగా ఇతర రాష్ట్రాలకు ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్న నలుగురు అంతర్‌రాష్ట్ర సభ్యుల ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు

 రూ.20లక్షల విలువైన సరుకు స్వాధీన
నలుగురి అరెస్టు,పరారీలో మరొకరు


వరంగల్‌ అర్బన్‌ క్రైం, నవంబరు 21: వరంగల్‌ మీదుగా ఇతర రాష్ట్రాలకు ప్రభుత్వ నిషేధిత గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్న నలుగురు అంతర్‌రాష్ట్ర సభ్యుల ముఠాను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల విలువైన గంజాయితో పాటు లారీ, కారును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ సీపీ కార్యాలయంలో వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ శనివారం వివరాలను వెల్లడించారు. 


రంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్‌ గ్రామానికి చెందిన పవర్‌ గణపతి, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన దుగ్యాల విజయ్‌కుమార్‌, సంగారెడ్డి జిల్లా పోమ్యతండాకు చెందిన అందర్గ్‌ రంజిత్‌, గౌస్‌ అలియాస్‌ బడ్లూ, హైదరాబాద్‌ బోరబండకు చెందిన ఎమ్డీ హకీమ్‌.. ఒక ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల నుంచి వరంగల్‌ మీదుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రలకు లారీల ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారు. ఇందులో ప్రధాన సూత్రదారి పవర్‌ గణపతి 2005 నుంచి గంజాయి వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు. బైయిల్‌పై విడుదలై తిరిగి గంజాయి స్మగ్లింగ్‌ చేసేవాడు.

ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తున్న విజయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. 2009లో వీరిద్దరూ సొంత భూమిలో గంజాయి పండించి పోలీసులకు పట్టుబడ్డారు.


జైలులో పరిచయం
రాజమండ్రి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో గణపతి స్వగ్రామానికి చెందిన లారీఓనర్‌ హకీమ్‌ పరిచయమయ్యాడు. లారీ అద్దెకు ఇస్తే ఎక్కువ డబ్బులిస్తానని నమ్మబలకడంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గత నెల జైలు నుంచి విడుదలైన గణపతి, విజయ్‌కుమార్‌ గంజాయి వ్యాపారానికి సిద్ధమయ్యాడు. ఈనెల 15న హకీమ్‌ వద్ద ఉన్న లారీని అద్దెకు తీసుకుని గంజాయి లోడు కోసం ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన మారెడుమిల్లికి చేరుకున్నారు. లారీడ్రైవర్‌ రంజిత్‌, క్లీనర్‌ గౌస్‌ఖాన్‌లకు వీరు ఎస్కార్డ్‌గా వ్యవహరించారు. ఈ నలుగురు కలిసి నాలుగు రోజుల కిందట ఒడిశా రాష్ట్రం సరిహద్దులోని దారకొండ మీదుగా నుంచి గంజాయి లారీలో లోడు చేసుకుని వస్తున్నట్టు వరంగల్‌ పోలీసులకు పక్కా సమాచారం అందింది.


శుక్రవారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపూర్‌కు వచ్చిన తర్వాత లారీలో ఉన్న కొన్ని గంజాయి ప్యాకెట్లను కారులో వేసుకున్నారు. శనివారం ఉదయం ఆత్మకూరు మీదుగా దామెర నుంచి భీమారం వైపు వస్తున్నట్టు తెలుసుకున్నారు. చింతగట్టు బ్రిడ్జి సమీపంలోని నేషనల్‌ హైవే రోడ్డు మీదుగా వస్తున్న గంజాయి లారీని ఆపారు. తనిఖీ చేయగా 200 కిలోల గంజాయిని గుర్తించారు. లారీడ్రైవర్‌, క్లీనర్‌ను అరెస్టు చేసి వారికి పైలెట్‌గా వ్యవహరిస్తున్న గణపతి, విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నారు. లారీ ఓనర్‌ హకీమ్‌ పరారీలో ఉన్నట్టు సీపీ వెల్లడించారు. గంజాయి విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. గంజాయిని పట్టుకున్న వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐలు నందిరాంనాయక్‌, రామకృష్ణ, కేయూ సీఐ డేవిడ్‌రాజు, ఎస్సై చంద్రమోహన్‌ను సీపీ అభినందించారు.  


డీ అడిక్షన్‌ క్యాంపు ఏర్పాటు చేస్తాం..
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎంతో మంది యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారని, వారిని సక్రమమైన మార్గంలో పెట్టేందుకు డీఅడిక్షన్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. ఇక్కడ నిర్వహించే కౌన్సెలింగ్‌ ద్వారా యువతలో మార్పు వస్తుందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై దృష్టి సారించి వారి ప్రవర్తన, స్నేహితులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 

Updated Date - 2020-11-22T11:17:33+05:30 IST