కాటేసిన విధి

ABN , First Publish Date - 2020-11-25T08:02:49+05:30 IST

ఆ తండ్రీకొడుకులు తమ బంధాన్ని మరణంలోనూ వీడలేదు. ఉదయాన్నే ఇంటినుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన వారిద్దరినీ విధి నిర్దాక్షిణ్యంగా కాటేసింది.

కాటేసిన విధి

 రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

బాలసముద్రం న్యూ అంబేద్కర్‌ నగర్‌లో విషాదం


సుబేదారి, నవంబరు 24 : ఆ తండ్రీకొడుకులు తమ బంధాన్ని మరణంలోనూ వీడలేదు. ఉదయాన్నే ఇంటినుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన వారిద్దరినీ విధి నిర్దాక్షిణ్యంగా కాటేసింది. ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విగతజీవులయ్యారని తెలిసి ప్రతీ ఒక్కరు కంటనీరు పెట్టుకున్నారు. హన్మకొండ నక్కలగుట్టలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.  బాలసముద్రంలోని న్యూ అంబేద్కర్‌నగర్‌కు చెందిన గజ్జెల సంజీవ్‌(40) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఓ శుభకార్యానికి సంబంధించి డబ్బులు తీసుకోవడానికి ఉదయం 8గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు రూపేశ్‌(14)తో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.


ఈ క్రమంలో  నక్కలగుట్టలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు సమీపంలోకి రాగానే బైక్‌ అదుపు తప్పి పక్కనుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కిందకు దూసుకువెళ్లింది. దీంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. 


కళ్లముందే జరిగిన ఈ సంఘటనతో  పలువురు నిశ్చేష్టులయ్యారు. విషయం తెలిసిన సంజీవ్‌ భార్య మాధవి గుండెలు పగిలేలే రోదించింది. మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిన కొద్దిసేపటికే భర్త, కుమారుడు మృతిచెందడంతో ఆమె షాక్‌కు గురైంది. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు పెద్ద సంఖ్యలో సంజీవ్‌ ఇంటికి చేరుకుని దుఃఖంలో మునిగిపోయారు.  సంజీవ్‌ నగరంలో గత 22 ఏళ్లుగా ప్రైవేటు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.


సంజీవ్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు రూపేశ్‌, నోవా ఉన్నారు.  మృతిచెందిన రూపేశ్‌ 10వ తరగతి చదువుతుండగా, నోవా 4వ తరగతి చదువుతున్నాడు.  కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని సంజీవ్‌ భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-11-25T08:02:49+05:30 IST