వామ్మో.. దుమ్ము

ABN , First Publish Date - 2022-08-12T05:22:10+05:30 IST

ఇటీవలి వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసం అయి వాహనదారుల ఇబ్బంది పడుతున్నారు. మొన్నటిదాకా బురదమయంగా ఉన్న రోడ్లు వానలు తగ్గాక దుమ్ము రేగుతున్నాయి. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఘట్‌కేసర్‌ మండలం వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

వామ్మో.. దుమ్ము
హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి జోడిమెట్ల వద్ద లేస్తున్న దుమ్ము

  • వర్షాలు తగ్గడంతో రోడ్లపై  ప్రయాణికుల అవస్థలు
  •   రోడ్లపై పేరుకున్న ఇసుక.. మట్టి
  •  వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
  •  గుంతలమయంగా రోడ్లు
  •  ప్రాణసంకటంగా మారిన రహదారులు

ఇటీవలి వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసం అయి వాహనదారుల ఇబ్బంది పడుతున్నారు. మొన్నటిదాకా బురదమయంగా ఉన్న రోడ్లు వానలు తగ్గాక  దుమ్ము రేగుతున్నాయి. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఘట్‌కేసర్‌ మండలం వ్యాప్తంగా  ఇదే పరిస్థితి నెలకొంది.  అలాగే అక్కడక్కడ ఇసుక పేరుకొని ప్రమాదకరంగా మారింది. చాలాచోట్ల అడుగు లోతుతో   గుంతలు పడ్డాయి. గ్రామాల రోడ్లు, అంతర్గత, కాలనీ రోడ్లు సైతం  అధ్వానంగా మారాయి. రోడ్లపై మట్టి ఎత్తి వేయించాలని, అలాగే  హైవేపై జోడిమెట్ల,  నారపల్లి వద్ద జాతీయ రహదారి మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు, స్థానికులు  డిమాండ్‌ చేస్తున్నారు.

ఘట్‌కేసర్‌, ఆగస్టు 11:  కొద్ది రోజులుగా మేడ్చల్‌ జిల్లాలో కురిసిన వర్షాలతో గుంతలు, బురదమయమైన రోడ్లపై మట్టి పేరుకుపోయింది.  ఇప్పుడు వర్షాలు తగ్గడంతో రోడ్లపై వాహనాల రాకపోకలతో భారీగా దుమ్ము లేవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై వెళ్లే వారి కళ్లలో, ఒంటిపై అంతా దుమ్ము పడుతోంది. ఎదురుగా వెళ్తున్న వాహనం కనబడనంతగా దుమ్ము లేస్తోంది. ఎండకాలంలో మట్టి రోడ్లపై వెళ్తే ఎంత దుమ్ము లేస్తుందో అదే విధంగా ఇప్పుడు తారు రోడ్లపై లేస్తున్న డస్ట్‌తో వాహనదారులు.. ముఖ్యంగా టూ వీలర్స్‌ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలు, చౌదరిగూడ పరిధిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది, ఎక్కడ చూసినా రోడ్లన్నీ అడుగులోతుతో గుంతలేర్పడ్డాయి. అన్ని వాహనాల రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

జోడిమెట్ల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరం

ఘట్‌కేసర్‌ మండల పరిధి జోడిమెట్ల వద్ద హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిని ఎత్తుపెంచే పని చేస్తున్నారు. ఇందులో భాగంగా కల్వర్టులు, రోడ్డుకిరువైపులా వరదనీరు వెళ్లేలా కాంక్రీట్‌తో కాలువలు కడుతున్నారు. ఈపనులు నాలుగు నెలలుగా నత్తనడకన సాగుతుండడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మున్ముందు భారీ వర్షాలు కురిస్తే జోడిమెట్ల, నారపల్లి వద్ద హైవేపై ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది.

పొంచి ఉన్న ముప్పు

భారీ వర్షాలు కురిస్తే చెంగిచెర్ల, పోచారం నుంచి పెద్దఎత్తున వరద వస్తుంది. నారపల్లి, జోడిమెట్ల వద్ద జాతీయ రహదారిపై రెండు, మూడు ఫీట్ల ఎత్తుతో వరద ప్రవహిస్తుంది. గతంలోనూ వరద ప్రభావంతో వాహనాల రాకపోకకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సందర్భాలున్నాయి. వర్షాల ముప్పు ఉన్నందున అధికారులు త్వరితగతిన హైదరాబాద్‌-వరంగల్‌ హైవేపై ఎత్తు పెంచే పనులు చేయించి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

దుమ్ముతో సతమతం

హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలతో తీవ్రంగా దుమ్ము లేస్తోంది. ద్విచక్ర వాహనదారులు, పాదాచారులుఇబ్బందులు పడుతున్నారు. నారపల్లి నుంచి అన్నోజిగూడ వరకు జాతీయ రహదారిపై పెద్దఎత్తున ఇసుక, దుమ్ము పేరుకుంది. అన్నోజిగూడ వంతెనపై సైతం ఇసుక కొట్టుకొచ్చింది. దీంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోయే ఆస్కారం ఉంది. లారీలు, బస్సులు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు వెళ్లే సమయంలో వెనకుండే వాహనదారులకు రోడ్డు కన్పించలేనంతగా దుమ్ము లేస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు.

గుంతలు పూడ్చాలి

మున్సిపాలిటీలు, చౌదరిగూడ, మక్త, సాదాత్‌ అలీగూడ గ్రామాల రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. అన్ని రోడ్లపైనా భారీ గుంతలేర్పడ్డాయి. చౌదరిగూడ-కొర్రెముల్‌ రోడ్డుపై అడుగుకో గుంత ఉంది. అలాగే కాలనీలు, అంతర్గత రోడ్లు సైతం ధ్వంస మయ్యాయి. ప్రభుత్వం వెంటనే జోడిమెట్ల, నారపల్లి వద్ద జాతీయ రహదారి మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.


నత్తనడకన మరమ్మతులు:- బొక్క సుధాకర్‌రెడ్డి, బొక్కోనిగూడ

జాతీయ రహదారిపై జోడిమెట్ల, వద్ద రోడ్డు మరమ్మతులు నత్తనడకన సాగుతు న్నాయి. దీంతో  లేస్తున్న దుమ్ముతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తగు చర్యలు తీసుకోవడంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం చేస్తున్నాడు. వాహనదారుల ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడం లేదు. పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు దుమ్ము సమస్యను వెంటనే నివారించాలి.  

ఇసుకతో ప్రమాదం:- వై.దుర్గరాజ్‌గౌడ్‌, కొర్రెముల్‌

రోడ్లపై ఇసుక పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనాలు స్కిడ్‌ అయి కిందపడుతున్నా రు. వాహనదారులు గాయాలపాలవుతున్నారు. జాతీయ రహదారిపైనే ఇంతగా ఇసుకు పేరుకుపోతే చిన్న రోడ్ల పరిస్థితి మరి అధ్వానంగా మారింది. వర్షాలు  తగ్గగానే రోడ్లను శుభ్రం చేయించకపోవడంతోనే సమస్యలు తీవ్రం అవుతున్నాయి. అధికారులు స్పందించి ఇబ్బందులు తీర్చేలా తగిన చర్యలు తీసుకోవాలి.

ప్రయాణమంటేనే భయమేస్తోంది: - వి.లింగస్వామి, ఎన్‌ఎ్‌ఫసీనగర్‌

వర్షాలు కురిస్తే బురద, ఎండవస్తే దుమ్ము.. ఇలా రోడ్ల పరిస్థితి ఘోరంగా మారింది. వారం  పాటు ముసురు, వానలతో బురద ఏర్పడి ఇబ్బందులు పడ్డాం. వర్షాలు తగ్గాయని అనుకుంటే ఇప్పుడు లేస్తున్న దుమ్ముతో మరో కొత్త సమస్య తలెత్తింది. కారు, బైక్‌ తీయాలన్నా భయమేస్తోంది. ఏ రోడ్డు చూసినా అడుగడుగునా గుంతలే. వాటిని బాగు చేయించేందుకు అధికారులు, ప్రజాతినిధులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. 

రహదారులన్నీ ధ్వంసం:  జి.రమేష్‌, ఎన్‌ఎ్‌ఫసీనగర్‌

వర్షాలకు రోడ్లన్నీ ఎక్కడికక్కడ ధ్వంసం అయ్యాయి.  జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తోంది. ఇసుక, బురదతో వాహనాలు జారుతున్నాయి. బ్రేక్‌ వేసినా అదుపుకాలేని పరిస్థితి ఉంది. ద్విచక్ర వాహనదారులైతే మరింత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఫీట్‌ లోతుతో గుంతలేర్పడ్డాయి. ఘట్‌కేసర్‌లోని ఎదులాబాద్‌ రోడ్డును రెండేళ్లగా మరమ్మతులు చేయలేదు. రోజూ ఉద్యోగాలకు వెళ్లే వాళ్లం పాడైన రోడ్లతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నాం.

Updated Date - 2022-08-12T05:22:10+05:30 IST