పెళ్లయిన రెండు నెలలకే భర్తకు ఎస్ఐ ఉద్యోగం.. సంతోషంతో పొంగిపోయిన భార్య.. కానీ భర్త మాత్రం..

ABN , First Publish Date - 2021-12-02T23:43:48+05:30 IST

కొత్తగా పెళ్లయిన రెండు నెలలకే భర్తకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య కూడా చాలా సంతోషించింది. ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనుకున్న తరుణంలో.. అనూహ్యంగా..

పెళ్లయిన రెండు నెలలకే భర్తకు ఎస్ఐ ఉద్యోగం.. సంతోషంతో పొంగిపోయిన భార్య.. కానీ భర్త మాత్రం..
లావణ్య, నాగార్జున దంపతులు

పెళ్లయిన తర్వాత అత్తగారింట్లోకి అడుగుపెట్టే కోడలికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఇంట్లో మంచి జరిగితే కోడలు వచ్చిన వేళా విశేషం అంటారు.. అలాగే చిన్న కీడు జరిగినా ఆమెపైనే తోసేస్తారు. శనిలాగా దాపురించింది.. అంటూ అత్తగారి నుంచి వేధింపులు, మరోవైపు భర్త నుంచి కూడా చిత్రహింసలు మొదలవుతాయి. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. కొత్తగా పెళ్లయిన రెండు నెలలకే భర్తకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య కూడా చాలా సంతోషించింది. ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనుకున్న తరుణంలో.. అనూహ్యంగా సమస్యలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే..


ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సంగం గ్రామానికి చెందిన నాగార్జునకు సమీప బంధువైన లావణ్య అనే యువతితో 2017లో వివాహమైంది. అంతకు ముందు నుంచే నాగార్జున ఎస్ఐ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ ఏదో ఒక కారణంతో విఫలమవుతూ వస్తున్నాడు. అయితే అనూహ్యంగా పెళ్లయిన రెండు నెలలకే ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు ఎస్ఐ ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులంతా సంతోషించారు. లావణ్య కూడా ఎంతో మురిసిపోయింది. కోడలు వచ్చిన వేళా విశేషమంటూ అంతా పొగడ్తలతో ముంచెత్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత గుంటూరు జిల్లా అచ్చంపేట ఎస్ఐగా పోస్టింగ్ వచ్చింది. దీంతో అతను భార్యతో కలిసి అక్కడే కొత్త కాపురాన్ని ప్రారంభించాడు. కొన్నాళ్ల వరకు సవ్యంగా సాగిన వారి సంసారంలో సమస్యలు మొదలయ్యాయి.


అదనపు కట్నం పేరుతో భర్త నుంచి వేధించడం మొదలెట్టాడు. అంతవరకు బాగా చూసుకుంటున్న తన భర్త ఒక్కసారిగా క్రూరంగా మారిపోవడం.. ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. అయినా అలాగే భరిస్తూ వచ్చింది. కానీ రోజురోజుకూ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. 2019 కల్లా వేధింపులు తారా స్థాయికి చేరి, చిత్రహింసలు పెట్టే వరకూ వచ్చింది. దీంతో భరించలేని లావణ్య.. పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగింది. అనంతరం గ్రామ పెద్దలు కలగజేసుకుని సర్దిచెప్పి పంపించారు. అయితే కొన్ని రోజుల అనంతరం నాగార్జున.. విడాకులు కావాలంటూ ఆత్మకూరు కోర్టును ఆశ్రయించాడు. తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరుగా ఉంటూ వచ్చారు.


ఈ క్రమంలో గురజాల ఎస్ఐగా బదిలీ అయిన నాగార్జున.. అక్కడ వేరే యువతితో ప్రేమాయణం మొదలెట్టాడు. ఈ విషయం లావణ్య తల్లిదండ్రులకు తెలిసి నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు.. నాగార్జునను గత నెల 2వ తేదీన వీఆర్‌కు పంపారు. వాయిదా ఉండడంతో బుధవారం తల్లిదండ్రులతో కలిసి లావణ్య.. ఆత్మకూరు కోర్టుకు వచ్చింది. వారిని చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన నాగార్జున.. విచక్షణా రహితంగా దాడి చేశాడు. లావణ్య తల్లిదండ్రులపై కూడా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన లావణ్యను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-02T23:43:48+05:30 IST