సీనియర్ల సంగతేంటి?

ABN , First Publish Date - 2022-04-06T08:52:31+05:30 IST

మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలగించడం ఖాయమని పాలకపక్షంలో జోరుగా ప్రచారం సాగుతోంది.

సీనియర్ల సంగతేంటి?

  • ఆనం, ధర్మానకు కేబినెట్‌లో చోటు దక్కుతుందా?
  • బొత్స, పెద్దిరెడ్డి, బాలినేనికీ ఉద్వాసన ఖాయం
  • తీసేయడం తప్పదని తెలిసినా కొందరిలో దింపుడు కళ్లం ఆశలు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలగించడం ఖాయమని పాలకపక్షంలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరికి ఉద్వాసన మాటెలా ఉన్నా.. ప్రస్తుతం పార్టీలో సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావుతోపాటు, అనంత వెంకట్రామిరెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి కేబినెట్‌లో స్థానం దక్కుతుందా లేదా అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇంకోవైపు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకునే కేబినెట్‌ కూర్పు ఉంటుందని జగన్‌ విస్పష్టంగా చెప్పినా.. కొందరు మంత్రులు దింపుడు కళ్లం ఆశలతో ఉన్నట్లు తెలుస్తోంది. తమను కొనసాగించాలంటూ సిఫారసులు చేయిస్తున్నారని సమాచారం. మంత్రి గుమ్మనూరు జయరాం కర్ణాటకకు చెందిన మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దనరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి తొలి మంత్రివర్గ విస్తరణ సమయంలోనే అనుభవజ్ఞులైన ధర్మాన, ఆనం పేర్లు వినిపించాయి. కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ నెల 11న జరిగే పునర్వ్యవస్థీకరణలోనైనా అవకాశం ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వైసీపీ అధికారంలోకి వస్తే.. నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అప్పట్లోనే అందరూ భావించారు.


ఇదీ జరగలేదు. అమెను ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా నియమించారు. పదవీకాలం ముగిసినా మళ్లీ పొడిగింపు ఉంటుందనుకున్నారు. అదేమీ లేకపోవడంతో రోజా ఎమ్మెల్యే పదవికే పరిమితమైపోయారు. ఇప్పుడు కొత్తవారితో పాటు ఆమె కూడా మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పడుతున్నారు. తాజా గా ఆమెకు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి మధ్య పోటీ ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ఉత్తరాంధ్రలో కొమ్ములు తిరిగిన నేతలు ఎందరున్నా.. అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్‌కు మంత్రివర్గంలో స్థానం గ్యారెంటీ అనే మాట బలంగా వినిపిస్తోంది. 

 

ఉంటే ఇద్దరం ఉండాలి.. లేదంటే!

ఇంకోవైపు.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తిగా ముఖ్యమంత్రి అభీష్టమని సీనియరు మంత్రులు బహిరంగ వేదికలపై చెబుతున్నా.. కొందరు మాత్రం లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా.. ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించి.. బాలినేనిని తొలగించాలన్న యోచనలో సీఎం ఉన్నారని వైసీపీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. దీనిపై బాలినేని అసంతృప్తితోనే ఉన్నారని, ఇద్దరినీ మంత్రులుగా కొనసాగించాలని... లేదంటే   ఇద్దరూ కొత్తవారే ఉండాలని జగన్‌తో బాలినేని అన్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం తన మనసులో మాట తెగేసి చెప్పారని.. పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకోవాలని బాలినేనికి స్పష్టం చేశారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.


జిల్లాలవారీగా రేసులో ఉన్నది వీరే..

శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు (పోలినాటి వెలమ), తమ్మినేని సీతారాం (కాళింగ), ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (కాళింగ)

పార్వతీపురం మన్యం: విశ్వసరాయ కళావతి (ఎస్టీ), పీడిక రాజన్నదొర (ఎస్టీ) 

అనకాపల్లి: గుడివాడ అమరనాథ్‌ (కాపు), బూది ముత్యాలనాయుడు (వెలమ), గొల్ల బాబూరావు (ఎస్సీ) కరణం ధర్మశ్రీ (కాపు)

అల్లూరి సీతారామరాజు: ధనలక్ష్మి (ఎస్టీ), భాగ్యలక్ష్మి (ఎస్టీ), చెట్టి ఫాల్గుణ (ఎస్టీ)

విజయనగరం: కంబాల జోగులు (ఎస్సీ), బొత్స అప్పల నరసయ్య (తూర్పు కాపు)

కాకినాడ: దాడిశెట్టి రాజా (కాపు), పెండెం దొరబాబు (కాపు)

రాజమహేంద్రవరం: టి.వెంకటరావు (ఎస్సీ)

కోనసీమ: విశ్వరూప్‌ (ఎస్సీ) .. చెల్లుబోయిన వేణు (శెట్టి బలిజ), పొన్నాడ సతీశ్‌ (మత్ప్యకార)

ఏలూరు: బాలరాజు (ఎస్టీ), ఎలీజా (ఎస్సీ) అబ్బయ్యచౌదరి (కమ్మ), మేకా ప్రతాప వెంకట అప్పారావు (వెలమ) 

పశ్చిమగోదావరి: ముదునూరు ప్రసాదరాజు (క్షత్రియ), గ్రంధి శ్రీనివాస్‌ (కాపు), కారుమూరి నాగేశ్వరరావు (యాదవ)

కృష్ణా: కొలుసు పార్థసారథి (యాదవ), జోగి రమేశ్‌ (గౌడ)

ఎన్‌టీఆర్‌: సామినేని ఉదయభాను (కాపు), రక్షణనిధి (ఎస్సీ), వసంత కృష్ణప్రసాద్‌ (కమ్మ)

గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డి ( రెడ్డి) 

బాపట్ల: మేరుగ నాగార్జున (ఎస్సీ), కోన రఘుపతి (బ్రాహ్మణ)

పల్నాడు: విడదల రజని (రజక), బ్రహ్మనాయుడు (కమ్మ)

ప్రకాశం: ఆదిమూలపు సురేశ్‌ (ఎస్సీ), అన్నే రాంబాబు (వైశ్య), మద్దిశెట్టి వేణుగోపాల్‌ (కాపు), టీజేఆర్‌ సుధాకరబాబు (ఎస్సీ) 

తిరుపతి: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా (రెడ్డి)

శ్రీ సత్యసాయి: అనంత వెంకట్రామిరెడ్డి (రెడ్డి), తిప్పేస్వామి (ఎస్సీ)

కర్నూలు: హఫీజ్‌ఖాన్‌ (ముస్లిం)

అన్నమయ్య: గడికోట శ్రీకాంతరెడ్డి (రెడ్డి), నవాజ్‌పాషా (ముస్లిం)

నెల్లూరు: కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి (రెడ్డి)

నంద్యాల: కాటసాని రాంభూపాల్‌రెడ్డి (రెడ్డి)

Updated Date - 2022-04-06T08:52:31+05:30 IST