ఈ ఖాళీల మాటేంటి మంత్రులూ?

ABN , First Publish Date - 2022-03-13T08:25:13+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ దవాఖానాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయంటూ గణాంకాలతో సహా శాసనసభలో ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క చెబుతుంటే.

ఈ ఖాళీల మాటేంటి మంత్రులూ?

  • సర్కారీ దవాఖానాల్లో ఖాళీలపై అమాత్యుల తప్పుడు ప్రకటనలు..
  • టెక్నికల్‌ ఖాళీలే.. ఫిజికల్‌గా లేవు
  • జిల్లాల్లో కలెక్టర్లు భర్తీ చేశారు
  • రాష్ట్రస్థాయిలో ఖాళీల్లేవన్న హరీశ్‌
  • నిర్మల్‌ జిల్లాలో ఒక్క ఖాళీ లేదన్న  మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • వాస్తవ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం
  • జిల్లాల్లో భర్తీ కాని వైద్యుల పోస్టులు అనేకం వందల సంఖ్యలో పారామెడికల్‌ సిబ్బందీ
  • నిర్మల్‌ జిల్లాలో 45 డాక్టర్లు, 135 పారామెడికల్‌ ఖాళీలు! 
  • ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ దవాఖానాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయంటూ గణాంకాలతో సహా శాసనసభలో ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క చెబుతుంటే.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవన్నీ టెక్నికల్‌ ఖాళీలే.. ఫిజికల్‌గా అసలు ఖాళీలే లేవన్నారు. ఎవరో రాసిచ్చిన కాగితం తీసుకొని చదవద్దనీ సూచించారు. అంతేనా, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేసినట్లు చెప్పారు. ఎవరో తప్పుడు సమాచారం రాసి ఇచ్చినట్లున్నారని.. సరిచూసుకోవాలని హితవు పలికారు. శాసనసభ సాక్షిగా మరో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా హరీశ్‌కు వంత పాడారు. నిర్మల్‌ జిల్లాలో ఒక్క ఖాళీ కూడా లేదని ఘనంగా ప్రకటించేశారు. ఇలా అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేయడంతో అసలు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ‘ఆంధ్రజ్యోతి’ సంబంధిత అధికార వర్గాలను సంప్రదించింది. క్షేత్రస్థాయి వివరాలను సేకరించింది. అన్నీ పరిశీలిస్తే.. శాసనసభలో ఇద్దరు మంత్రులు గొప్పగా చేసిన ప్రకటనలు తప్పని తేలింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నట్లుగానే ఖాళీలు ఉన్నాయి. 


ఖాళీల లెక్కలివీ.. 

రాష్ట్ర సరిహద్దులో ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా ప్రజలు కూడా వస్తుంటారు. 200 పడకల ఈ ఆస్పత్రిలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కలిపి 205 పోస్టులుండగా.. 75 మాత్రమే భర్తీ చేశారు. ఇంకా 130 ఖాళీగానే ఉన్నాయి. వైద్యులు సరిపడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కలిపి 224 మంది ఉండాలి. కానీ, 148 మందే పనిచేస్తున్నారు. 76 ఖాళీలు ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో 265 మంది స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు ఉండాల్సి ఉండగా 73 మంది రెగ్యులర్‌, 100 మంది అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కింద పనిచేస్తున్నారు. 92 ఖాళీలున్నాయి. పారామెడికల్‌, ఇతర సిబ్బంది ఖాళీలు 100 ఉన్నాయి. ఈ ఒక్క ఆస్పత్రిలోనే మొత్తం 268 ఖాళీలు ఉన్నాయి. గద్వాల జిల్లా ఆస్పత్రిలో 24 ఖాళీలు ఉన్నాయి. 


130 పోస్టులకు 53..

ములుగు ఏరియా ఆస్పత్రికి 130 పోస్టుల మంజూరు ఉండగా 53 ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్‌ నర్సు పోస్టులు 20, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ 10, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులు 7.. భర్తీ కాలేదు. బ్లడ్‌ బ్యాంక్‌, రేడియాలజీ ల్యాబ్‌, ఇతర విభాగాల్లో కొందరిని ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. జిల్లా ఆస్పత్రిగా ఉన్నతీకరించినా కేడర్‌ స్ట్రెంత్‌ ఇంకా మంజూరు చేయలేదు. ఇటీవలే 40 పడకలతో చిన్నపిల్లల ఐసీయూ, 10 పడకలతో జనరల్‌ ఐసీయూ ఏర్పాటు చేయగా మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కానీ, సిబ్బంది నియామకం జరగలేదు. మొత్తం 130 పోస్టులకు 77 భర్తీ చేయగా, 53 ఖాళీలు ఉన్నాయి. 

ఫ కామారెడ్డి ఏరియా ఆస్పత్రిని జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ఉన్నతీకరించారు. మొత్తం 84 పోస్టులు మంజూరు కాగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులు 8, నర్సులు 24, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఒక ఫార్మాసిస్టు పోస్టు ఖాళీగా ఉన్నాయి.


సిరిసిల్ల ఆస్పత్రిలో 41కి 10 మంది వైద్యులే..!

మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రిలో 41 మంది డాక్టర్లకు గాను 10 మందే పనిచేస్తున్నారు. 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్‌ విభాగంలో 25 పోస్టులకు 16 ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిని 100 పడకల నుంచి 250 పడకలకు పెంచి జిల్లా ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఖాళీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 10 పడకల ఐసీయూను ఈ-ఐసీయూగా మార్చారు. నిమ్స్‌ డాక్టర్లు వీడియో కన్సల్టెంట్‌ ద్వారా వైద్య సదుపాయం అందిస్తున్నారు.


కరీంనగర్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 58 డాక్టర్‌ పోస్టులకు గాను 30 మంది పనిచేస్తున్నారు. 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 117 స్టాఫ్‌, హెడ్‌ నర్సులు ఉండాల్సి ఉండగా 106 మంది పనిచేస్తున్నారు. 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు ఏఎన్‌ఎంలుగా పనిచేస్తుండగా 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర కేటగిరీల్లో 130 పోస్టులు ఉండగా.. 30 ఖాళీగా ఉన్నాయి. 


హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రిలో పరిశీలించగా.. 17 మంది వైద్యులు, 4 నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వైద్యుల పోస్టులు 4 ఖాళీగా ఉన్నాయి. 


ఇంద్రకరణ్‌ జిల్లాలోనూ ఖాళీలు!

తన జిల్లాలో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సభాముఖంగా చెప్పిందీ అసత్యమేనని తేలింది. నిర్మల్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 30 వైద్యుల పోస్టులు భర్తీకి నోచుకోలేదు. కీలకమైన సర్జన్‌ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 10 పీహెచ్‌సీలు ఉండగా 15 డాక్టర్‌ పోస్టులు భర్తీ చేయలేదు. జిల్లాలో మొత్తం 45 డాక్టర్‌, 135 పారామెడికల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2022-03-13T08:25:13+05:30 IST