ఠాణాకు.. టికాణా లేదు!

ABN , First Publish Date - 2021-02-27T05:20:26+05:30 IST

‘మండలానికో ఠాణాతో పాటు మునిసిపాల్టీల్లో పట్టణ, రూరల్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తాం’... ఇది నిత్యం పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చే మాట. కానీ ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. జిల్లాలో రెండు దశాబ్దాల కిందట ఏర్పాటైన లక్ష్మీనర్సుపేట మండలంలో పోలీస్‌ స్టేషన్‌ లేదు. ఆ మండలాన్ని సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చేర్చారు. దీంతో అత్యవసర సమయాల్లో ఎల్‌ఎన్‌పేట మండలవాసులు పోలీస్‌ సేవలు పొందడానికి వ్యయప్రయాసలకోర్చుతున్నారు. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాల్టీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీలు ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, రాజాంలో మాత్రమే రూరల్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. మిగతాచోట్ల ఏర్పాటు చేస్తామని పోలీస్‌ ఉన్నతాధికారులు దశాబ్దాలుగా చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి.

ఠాణాకు.. టికాణా లేదు!
కాశీబుగ్గ పోలీస్టేషన్

మునిసిపాలిటీల్లో రూరల్‌ పోలీసు స్టేషన్లు ఏవీ?

దశాబ్దాలుగా తప్పని ఎదురుచూపులు

ప్రతిపాదనలకే పరిమితమవుతున్న అధికారులు 

(పలాస) 

‘మండలానికో ఠాణాతో పాటు మునిసిపాల్టీల్లో పట్టణ, రూరల్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తాం’... ఇది నిత్యం పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చే మాట. కానీ ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. జిల్లాలో రెండు దశాబ్దాల కిందట ఏర్పాటైన లక్ష్మీనర్సుపేట మండలంలో పోలీస్‌ స్టేషన్‌ లేదు. ఆ మండలాన్ని సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చేర్చారు. దీంతో అత్యవసర సమయాల్లో ఎల్‌ఎన్‌పేట మండలవాసులు పోలీస్‌ సేవలు పొందడానికి వ్యయప్రయాసలకోర్చుతున్నారు. జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌తో పాటు ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాల్టీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీలు ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, రాజాంలో మాత్రమే రూరల్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. మిగతాచోట్ల ఏర్పాటు చేస్తామని పోలీస్‌ ఉన్నతాధికారులు దశాబ్దాలుగా చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. 

-------------------------

జిల్లాలో ఏటా క్రైంరేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నేరాల నియంత్రణలోకి రాకపోవడానికి అధికారులు రకరకాల కారణాలు చూపుతున్నారు. అందులో ప్రధానమైనది సిబ్బంది కొరత కాగా... జనాభాకు తగ్గట్టు పోలీస్‌స్టేషన్లు లేవని చెబుతున్నారు. వాస్తవానికి మునిసిపాల్టీల్లో పట్టణంతో పాటు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఉండాలన్న నిబంధన ఉంది. కానీ జిల్లాలో చాలా మునిసిపాల్టీల్లో రూరల్‌ పోలీస్‌స్టేషన్లు లేవు. కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండలో పట్టణ పోలీస్‌స్టేషన్లే ఉన్నాయి. రూరల్‌ పోలీస్‌స్టేషన్లు లేవు. వాస్తవానికి ఈ మూడు సెంటర్లలో తప్పనిసరిగా రూరల్‌ పోలీస్టేషన్ల ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలసల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. పాలకొండ డివిజన్‌ కేంద్రంతో పాటు ఏజెన్సీ ముఖ ద్వారంగా ఉంది. జిల్లాలో భౌగోళికంగా కూడా ఈ మూడు ప్రాంతాలు పెద్దవి. జిల్లాకేంద్రం తర్వాత పలాస-కాశీబుగ్గ అన్నిరంగాల్లో ముందంజలో ఉంది. పోలీసు రికార్డుల ప్రకారం విశాఖ జిల్లా అనకాపల్లి తరువాత అంతటి స్థానాన్ని కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ పొందగలిగింది. నేరాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ అదనపు స్టేషన్‌ ఏర్పాటు కోసం నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు సైతం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉన్న సిబ్బందితోనే కాలాన్ని నెట్టుకు రావలసి వస్తోంది. జాతీయ రహదారి, రైల్వేస్టేషన్‌, ఒడిశాకు దగ్గరగా ఉండడంతో పోలీసులకు అదనపు భారంగా మారుతోంది. వాస్తవానికి ఈ మూడు సెంటర్లకు అదనపు పోలీసు స్టేషన్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నా... ఆదిలోనే ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది.  

అసెంబ్లీ వేదికగా ప్రకటించినా.. 

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాశీబుగ్గలో రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని నాటి హోం మంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి అసెంబ్లీ వేదికంగా ప్రకటించారు. కానీ నిర్మాణం మాత్రం జరగలేదు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇక్కడ పోలీసు స్టేషన్‌కు హౌస్‌ అధికారిగా సీఐ వ్యవహరిస్తారు. ఆయనతో పాటు ముగ్గురు ఎస్‌ఐలను నియమించడం కొసమెరుపు. ఉన్న స్టేషన్లలో కూడా సిబ్బంది అంతంత మాత్రంగానే ఉన్నట్లు స్టష్టమవుతోంది. ప్రతి స్టేషన్‌కు ఎస్‌ఐ, ఇద్దరు ఎఎస్‌ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుల్స్‌, 25 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ఆ మేరకు విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ ఒక్కో  స్టేషన్‌కు కేవలం 15 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు 77 మంది సిబ్బంది అవసరం ఉండగా... కేవలం 57 మందితోనే సరిపెట్టారు. నిత్యం రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, ఆందోళనలు, మావోయిస్టు సమస్యలు, జీడి కార్మికుల సమస్యలతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలు కొట్టుమిట్టాడుతుంటాయి. సిబ్బంది కొరతతో వాటిని ఏ విధంగా అరికడతారో పోలీసు బాస్‌లే సమాధానం చెప్పాల్సి ఉంది. దీంతో పాటు ఆమదాలవలస, పాలకొండ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. జిల్లాలో చివరిగా ఏర్పడిన మండలం ఎల్‌ఎన్‌పేట. అక్కడ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటికైనా దీనిపై జిల్లా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరముంది. 

ప్రతిపాదనలో ఉంది

జిల్లాలో అన్నీ మునిసిపాలిటీల్లో రూరల్‌ పోలీసు స్టేషన్ల ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం నందిగాం స్టేషన్‌ను కాశీబుగ్గ రూరల్‌ పోలీసు స్టేషన్‌గా మార్చాం. దీన్ని విభజించాల్సి ఉంది. కాశీబుగ్గకు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్‌ అవసరాన్ని మా అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలు, డివిజన్ల పునర్విభజనలో భాగంగా కాశీబుగ్గ రూరల్‌ పోలీస్టేషన్‌ నిర్మాణానికి అవకాశం ఉంది. 

-శివరామిరెడ్డి, డీఎస్పీ, కాశీబుగ్గ

Updated Date - 2021-02-27T05:20:26+05:30 IST