సకాలంలో చెల్లింపులేవి?

ABN , First Publish Date - 2020-02-08T06:44:01+05:30 IST

రైతులకు తమ పంటలకు మద్దతు ధర వచ్చేలా చూడాలని అందుకు అధికారులదే బాధ్యత అని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే, రాష్ట్రంలో రైతులు తమ పంటల అమ్మకాలలో అడుగడుగునా నష్టపోతూనే ఉన్నారు...

సకాలంలో చెల్లింపులేవి?

రైతులకు తమ పంటలకు మద్దతు ధర వచ్చేలా చూడాలని అందుకు అధికారులదే బాధ్యత అని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే, రాష్ట్రంలో రైతులు తమ పంటల అమ్మకాలలో అడుగడుగునా నష్టపోతూనే ఉన్నారు. అంతకు మించి కొనుగోలు చేసినా, చెల్లింపులలో అనవసర తాత్సారంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఉదాహరణకు గత డిసెంబర్ మాసంలో అమ్మిన ధాన్యానికి రైతులకు ఇంతవరకు ప్రభుత్వం డబ్బు చెల్లించక పోవటంతో రైతులు బ్యాంకులు, మిల్లర్ల చుట్టూ తిరగటంతోనే సరిపోతున్నది.

ఇలా అనవసర జాప్యంతో తెచ్చిన రుణాలకు వడ్డీ భారం పెరిగిపోతున్నది. ఆపైన తేమ అనీ, రవాణా ఖర్చులు అనీ, నాణ్యత పేరుతో ధరలను తెగ్గోస్తున్నారు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో వాస్తవాలు తెలుసుకోకుండా అధికారులదే బాధ్యత అని చేతులు దులుపుకోవటం సబబు కాదు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రాజకీయ పెత్తనంతో రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయింది. సహకార, మార్కెటింగ్ వ్యవస్థలలో రాజకీయ పెత్తనాన్ని తగ్గించి, నిజమైన రైతులను భాగస్వామ్యులను చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. 

ఆర్కే, ముస్తాబాద

Updated Date - 2020-02-08T06:44:01+05:30 IST