భవనాల నిర్మాణానికి అక్టోబరు డెడ్‌లైన

ABN , First Publish Date - 2022-05-27T06:15:16+05:30 IST

ప్రభుత్వ భవన నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.

భవనాల నిర్మాణానికి అక్టోబరు డెడ్‌లైన
రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో నిర్మిస్తున్న సచివాలయం, పక్కనే రైతు భరోసా కేంద్రం

ఎట్ల చేసేదబ్బా..!

ఆర్బీకే, హెల్త్‌ క్లినిక్‌, సచివాలయ పనులపై ఒత్తిడి

రెండేళ్ల తరువాత 70 శాతం బిల్లుల చెల్లింపు

మిగిలిన పనులు చేసినా.. బిల్లులు వెంటనే ఇస్తారా..?

పెరిగిన నిర్మాణ వ్యయం.. కాంట్రాక్టర్లలో ఆందోళన

దిక్కుతోచని స్థితిలో పంచాయతీ రాజ్‌    శాఖ



ప్రభుత్వ భవన నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల తరువాత 70 శాతం బిల్లులను విడుదల చేసిన ప్రభుత్వం, మిగిలిన పనులను ఐదు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కారణంగా తమకు నష్టం జరిగిందని, ఇప్పుడు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో కష్టాలు తప్పేలా లేవని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణ పనులను చేపట్టారు. రెండేళ్ల క్రితం చేసిన పనులకు గత నెలలో 70 శాతం బిల్లులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అధికారులు, కాంట్రాక్టర్లు ఊరట చెందారు. ఇంతలోనే అక్టోబరులోగా పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తలలు పట్టుకుంటున్నారు. 

- అనంతపురం సిటీ


ఎన్నెన్నో ఒడిదుడుకులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాలో ప్రభుత్వ భవన నిర్మాణ పనులను చేపట్టాయి. 470 గ్రామ, వార్డు సచివాలయ భవనాలకు, 413 రైతు భరోసా కేంద్ర భవనాలకు, 326 వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలకు రూ.335.08 కోట్లు కేటాయించారు. మొదట్లో నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. కానీ బిల్లులు సకాలంలో రాకపోవడం, కొవిడ్‌ ప్రబలడం, సిమెంట్‌, స్టీల్‌ తదితర నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరగడంతో పనులు నిలిచిపోయాయి. కొందరు కాంట్రాక్టర్లు బిల్లులు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. మరికొందరు పునాదులు వేసి వదిలేశారు. భవన నిర్మాణ పనుల్లో జిల్లాలో ఆశించిన ప్రగతి కనిపించలేదు. 


తాజా పరిస్థితి

- జిల్లా వ్యాప్తంగా రూ.188 కోట్లతో 470 గ్రామ, వార్డు సచివాలయ భవన నిర్మాణ పనులను చేపట్టారు. ఇప్పటి వరకూ 221 మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన 249 భవనాలు వివిధ దశలలో ఉన్నాయి. అనంతపురం, గార్లదిన్నె, పెద్దవడుగూరు, బొమ్మనహాళ్‌, గుత్తి ప్రాంతాలలో కొంత వేగంగా సాగాయి. మిగిలిన ప్రాంతాలలో చాలా వరకు నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం. 

- రూ.90.03 కోట్లతో 413 రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 138 భవనాలు పూర్తి అయ్యాయి. మిగిలిన 270 భవనాల నిర్మాణం వివిధ దశలలో ఉంది. ఐదు భవనాల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదని ఆశాఖ వర్గాల ద్వారా తెలిసింది. గార్లదిన్నె, పెద్దవడుగూరు, గుంతకల్లు, రాప్తాడు ప్రాంతాలలో పనులు వేగంగా సాగాయి. మిగిలిన ప్రాంతాలలో ఆశించిన స్థాయిలో జరగలేదు. 

- రూ.57.05 కోట్లతో 326 వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికి 78 భవనాలు పూర్తి అయ్యాయి. మిగిలిన 240 వివిధ దశలలో ఉన్నాయి. ఎనిమిది భవనాల నిర్మాణం మొదలు కాలేదని సమాచారం. 


అక్టోబరు డెడ్‌లైన

పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని జరుగుతున్న ఈ భవన నిర్మాణ పనులను అక్టోబరు నెలలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. జిల్లాకు మంజూరు చేసిన మొత్తం 1,209 భవనాలలో 437 భవనాలు మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన 772 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించనందుకే ఈ పరిస్థితి ఏర్పడింది. గత నెలలో కొంతమేరకు బిల్లులు రావడంతో తిరిగి పనులు మొదలయ్యాయి. కానీ వేగంగా జరగడం లేదు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కేవలం ఐదు నెలలు డెడ్‌లైన విధించడంతో పీఆర్‌ అధికారులు కలవరపడుతున్నారు. మరోవైపు కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.


అందరిలో ఆందోళన

రెండేళ్లలో రూ.192.86 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో రూ.166.07 కోట్ల బిల్లులు గత నెలలో మంజూరయ్యాయి. ఇంకా రూ.26.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము కోసం కాంట్రాక్టర్లు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అదిగో ఇదిగో.. అని అధికారులు కాలయాపన చేస్తున్నారు. రెండేళ్ల క్రితం చేసిన పనుల బిల్లుల పరిస్థితే ఇలా ఉంటే, మిగిలిన రూ.142.22 కోట్ల పనులు ఎలా చేయాలని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అదీ.. ఐదు నెలల్లో భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన విధించడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి పనులను పూర్తి చేసినా, బిల్లులు వెంటనే ఇస్తారన్న గ్యారెంటీ ఏమిటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


బిల్లులపై ఆందోళన వద్దు..

సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలను అక్టోబరులోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశాము. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించాము. బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  సకాలంలో వస్తాయి. ఇప్పటి వరకు చేసిన పనుల బిల్లులు కూడా త్వరలోనే పడతాయి. కోర్టు కేసులు, ఇతర కారణాలతో కొన్ని భవనాల నిర్మాణం ప్రారంభం కాలేదు. 

- వై భాగ్యరాజ్‌, పీఆర్‌ ఎస్‌ఈ 

Updated Date - 2022-05-27T06:15:16+05:30 IST