జుట్టు తెల్లబడటానికి గల ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించిన శాస్త్రవేత్తలు..

ABN , First Publish Date - 2022-02-03T17:12:25+05:30 IST

జుట్టు నెరిసిపోవడమనేది ఇప్పుడు యువతతో పాటు..

జుట్టు తెల్లబడటానికి గల ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించిన శాస్త్రవేత్తలు..

జుట్టు నెరిసిపోవడమనేది ఇప్పుడు యువతతో పాటు పిల్లలలోనూ కనిపిస్తోంది. దీనికిగల కారణాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు నెరిసిపోవడం అనేది ఒకప్పుడు కనిపించేది. ఇది అనుభవానికి సంకేతం అని అనేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇప్పుడు యువతలోనే కాదు పిల్లల్లో కూడా జుట్టు నెరిసిపోతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. దీనికిగల కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ముందుగా జుట్టు రంగు తెల్లగా ఎందుకు మారుతుందో తెలుసుకుందాం. సైన్స్ ఫోకస్ తెలిపిన వివరాల ప్రకారం జుట్టు నల్లబడటానికి కారణం మెలనిన్. ఇది జుట్టుకు రంగును ఇచ్చే వర్ణద్రవ్యం. శరీరంలో ఇది లోపించినప్పుడు, జుట్టు తెల్లబడుతుంది.


ఇదే నియమం జంతువులకు కూడా వర్తిస్తుంది. జుట్టు కుదుళ్లలో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి మెలనిన్‌ను సిద్ధం చేసి, విడుదల చేస్తాయి. ఫలితంగా జుట్టు నల్లగా కనిపిస్తుంది. మనిషికి ఒక వయసు వచ్చాక ఈ కణాల నుంచి మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడటం అనేది మొదలవుతుంది. అయితే ప్రస్తుతం దీని ప్రభావం వృద్ధుల్లోనే కాదు, యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. శరీరంలో పోషకాల కొరత, ధూమపానం, అనారోగ్యం, ఒత్తిడి మొదలైనవి ఈ కోవలోకే వస్తాయి. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు.. చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేశారు. దీనిలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. జుట్టు నెరిసిపోవడానికి ఒత్తిడి ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. వీరి అధ్యయనంలో కూడా ఇది రుజువయ్యింది. ఒత్తిడి నుంచి విముక్తి పొందినవారి జుట్టు మళ్లీ నల్లగా మారడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒత్తిడి అనేది జుట్టు రంగును ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

Updated Date - 2022-02-03T17:12:25+05:30 IST