ఏం ఇచ్చారని.. వస్తున్నారు?

ABN , First Publish Date - 2022-05-20T05:18:57+05:30 IST

‘మాకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. పింఛన్లు మంజూరు కావడం లేదు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. ఏం ఇచ్చారని మీరు ప్రజల్లోకి వస్తున్నారు’ అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామస్థులు నిలదీశారు.

ఏం ఇచ్చారని.. వస్తున్నారు?
ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ను నిలదీస్తున్న పొగిరి పాపారావు

- ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ను నిలదీసిన ఆనందపురం గ్రామస్థులు
- పథకాలు అందడం లేదు, పింఛన్లు ఇవ్వడం లేదని ఆవేదన
- ‘గడప గడపకూ ప్రభుత్వం’లో సమస్యల ఏకరువు
జి.సిగడాం, మే 19:
‘మాకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. పింఛన్లు మంజూరు కావడం లేదు. అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. ఏం ఇచ్చారని మీరు ప్రజల్లోకి వస్తున్నారు’ అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ను జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామస్థులు నిలదీశారు. గురువారం ఆయన ఆనందపురం, ఆబోతులపేట గ్రామాల్లో ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆనందపురం గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే కిరణ్‌కు సమస్యలపై నిలదీశారు.
- అర్హులమైనా తమకు ఎలాంటి పథకాలు అందలేదని, ఇళ్లు, రైతు భరోసా, అమ్మఒడి, వంటివి మంజూరు కావడం లేదని నిలదీశారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదని, ఏమి ఇస్తున్నారని ప్రజల్లోకి వస్తున్నారని  పొగిరి పాపారావు ఎమ్మెల్యేను ప్రశ్నించాడు.
- అర్హత ఉన్నా పింఛన్‌ రావడం లేదని, అధికారులను అడిగితే రేపోమాపో అంటూ ఆశ పెడుతున్నారని చిత్తిరి అప్పారావు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.
- చేదోడు, దివ్యాంగ పింఛన్‌ అందలేదని వజ్జపర్తి రఘురాం, పి.శ్రీనివాసరావు, ఎటువంటి పథకాలకు నోచుకోలేదని పొగిరి ముత్యాలమ్మ ఎమ్మెల్యేను నిలదీశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి తెలిపారు.  ఈ మేరకు సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

నాయకులు మోసం చేశారు..
‘పార్టీని నమ్ముకుని ఉన్నాం. గ్రామ వలంటీరు పోస్టు ఇస్తామని స్థానిక నాయకులు మోసం చేశారు. ఇంటి బిల్లు అడిగితే పొమ్మంటున్నారు.  అన్ని అర్హతలున్నా పథకాలు ఇవ్వడం లేదు. ఇదేనా పేదలకు పథకాలు అందించడమంటే’ అని రెడ్డి నరసమ్మ, రెడ్డి రాజులు ఎమ్మెల్యే కిరణ్‌ను ప్రశ్నించారు.  

వేర్వేరుగా ‘గడప గడపకూ’
ఎమ్మెల్యే  కిరణ్‌కుమార్‌ ఉదయం 6 గంటలకు ఆనందపురంలో గడపడగపకూ  మన ప్రభ్వుత్వం కార్యక్రమం నిర్వహించారు.  ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈలోగా విజయనగం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ గ్రామానికి వస్తారని సమాచారం అందింది. దీంతో ఎమ్మెల్యే కిరణ్‌ అర్ధాంతరంగా కార్యక్రమాన్ని ముగించుకొని బయలుదేరారు. 9 గంటలకు ఎంపీ గ్రామానికి చేరుకొని గడపడగపకూ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ మీసాల సత్యవతి, జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ, సర్పంచ్‌ చిత్తిరి మంజు, బూరాడ వెంకటరమణ, మక్క వెంకటసాయి, గేదెల నారాయణరావు, టి.గౌరీశంకరరావు, మీసాల వెంకటరమణ, నక్క ప్రసాదరావు, సాకేటి నాగరాజు, ఎంపీడీవో పి.రాధ, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ నాయుడు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:18:57+05:30 IST