రహదారిపై కనిపించే ఈ గీతల గురించి తెలుసుకోకుండా వాహనం బయటకు తీయొద్దు.. లేదంటే ప్రమాదాల బారిన పడతారు!

ABN , First Publish Date - 2021-12-27T13:16:25+05:30 IST

రోడ్లపై ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్..

రహదారిపై కనిపించే ఈ గీతల గురించి తెలుసుకోకుండా వాహనం బయటకు తీయొద్దు.. లేదంటే ప్రమాదాల బారిన పడతారు!

రోడ్లపై ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనేవున్నాయి. దీనికి కారణం రోడ్లపై వాహనాలు నడిపే వ్యక్తులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడమేనని పలువురు చెబుతుంటారు. దేశంలోని ప్రధాన రహదారులపైనా, జాతీయ రహదారిపైనా డ్రైవర్ల భద్రత దృష్ట్యా సిగ్నల్‌తో పాటు రోడ్డుపై పసుపు, తెలుపు గీత గీతలు కనిపిస్తుంటాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఈ గీతల గురించి చాలామందికి తెలియదు. ఈ అవగాహన లేమి కూడా ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది. అందుకే రోడ్డుపై వివిధ రంగుల్లో కనిపించే ఈ గీతలలోని అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 


తెల్లని సరళ రేఖ

రహదారిపై కనిపించే తెల్లని సరళ రేఖ.. ఆ రహదారిని రెండు భాగాలుగా విభజిస్తుంది. అంటే వాహనం ఈ రేఖను దాటుకుని అటువైపు వెళ్లకూడదని సూచన. మీరు వాహనాన్ని నడుపుతున్న దిశలోనే ముందుకు వెళ్లాలని ఈ తెల్లని సరళ రేఖ చెబుతుంది. 

గ్యాప్‌లతో కూడిన తెల్లని గీత

రోడ్డుపై గ్యాప్‌లతో తెల్లని గీత కనిపించిందంటే  మీరు ప్రయాణిస్తున్న దశను మార్చుకోవచ్చని ఆ గీత సూచిస్తుంది. మీ అవసరం మేరకు ఈ తెల్లటి గీతను దాటి అవతలి వైపుకు వెళ్లవచ్చని ఈ గీత తెలియజేస్తుంది. 

పసుపు రంగు గీత

రహదారిపై తెలుపు రంగు గీతతో పాటు పసుపు రంగు గీత కూడా కనిపిస్తుంది. ఈ లైన్ మీరు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయవచ్చని సూచిస్తుంది. అయితే ఈ లైన్ దాటి ఆవలివైపునకు వెళ్లకూడదు. ఈ లైన్‌లోపలనే ఒక వైపుగా ఉంటూ.. మీరు మరొక వాహనాన్ని నియంత్రణతో క్రాస్ చేయాల్సివుంటుంది. 

జీబ్రా క్రాసింగ్ లైన్ 

రోడ్డుపై కనిపించే తెలుపు, నలుపు రేఖను జీబ్రా క్రాసింగ్ అంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈ లైన్లు కనిపిస్తుంటాయి. రహదారిపై కనిపించే ఈ జీబ్రా క్రాసింగ్‌లు.. పాదచారులు ఒక వైపు నుండి మరొక వైపుకు దాటడానికి ఉద్దేశించినవి. ఈ లైన్లు కనిపించగానే వాహనదారులు తమ వాహనాలను నియంత్రించాలనే సిగ్నల్ ఇస్తుంది. తద్వారా రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఉన్నవారు సులభంగా రోడ్డు దాటేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Updated Date - 2021-12-27T13:16:25+05:30 IST