భారత్ సాయంపై శ్రీలంక ప్రజలు ఏమనుకుంటున్నారంటే...

ABN , First Publish Date - 2022-04-09T23:48:27+05:30 IST

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. గడచిన 75 ఏళ్ళలో

భారత్ సాయంపై శ్రీలంక ప్రజలు ఏమనుకుంటున్నారంటే...

న్యూఢిల్లీ : శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. గడచిన 75 ఏళ్ళలో దక్షిణాసియా దేశాల్లో ఏ దేశమూ ఎదుర్కొనని సంక్షోభాన్ని ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటోంది. 1982 నుంచి 2009 వరకు జరిగిన అంతర్యుద్ధం సమయంలో సైతం ఆహారం, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ల కోసం ప్రజలు బారులు తీరి నిల్చోవలసిన అవసరం రాలేదు. గతంలో జనతా విముక్తి పెరమున రెండుసార్లు తిరుగుబాటు చేసినపుడు కూడా వ్యక్తం కానంతటి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఆ దేశానికి ఏకైక పొరుగు దేశమైన భారత్ ఈ సంక్షోభ సమయంలో చేతనైనంతగా ఆదుకుంటోంది. దీనిపై శ్రీలంక ప్రజలు పరస్పర విరుద్ధంగా స్పందిస్తున్నారు. 


శ్రీలంకకు భారత్ ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2.4 బిలియన్ డాలర్ల మేరకు సహాయం చేసింది. ఇంధనం, ఆహారం, బియ్యం, నిత్యావసరాల రూపంలో రుణ సహాయాన్ని అందించింది. దీనివల్ల ప్రజలకు కాస్త ఊరట లభించింది. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వంపై ప్రజాగ్రహం తీవ్రత తగ్గడానికి ఈ సహాయం దోహదపడింది. 


దీనిపై ప్రజల అభిప్రాయాలను స్థానిక మీడియా సేకరించినపుడు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారత దేశం ఈ సహాయాన్ని అందజేయడం వల్ల రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వానికి ఊరట లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. రాజపక్స కుటుంబం ఇక ఎంత మాత్రం అధికారంలో కొనసాగకూడదని వారు గట్టిగా చెప్తున్నారు. భారత దేశం రాజపక్సకు సహాయపడకూడదని చెప్తున్నారు. ఈ సహాయం వల్ల రాజపక్స కుటుంబం మరికొంత కాలం అధికారంలో కొనసాగుతుందని ఆవేదన చెందుతున్నారు. భారత దేశం తప్పనిసరిగా శ్రీలంక ప్రజలకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే అదే సమయంలో భారత దేశానికి శ్రీలంక కృతజ్ఞతగా ఉండాలని కూడా అంటున్నారు. 


మరోవైపు భారత ప్రభుత్వం వ్యూహాత్మక అభివృద్ధి ప్రాజెక్టులను ఆలస్యం చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ట్రింకోమలీ ఆయిల్ ట్యాంక్ ఫార్మ్, పునరుద్ధరణీయ ఇంధన ప్రాజెక్టులు వంటివాటి కోసం కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. 1980వ దశాబ్దంలో శ్రీలంకపై భారత్ పట్టు సాధించిందని, ఆ పట్టును తిరిగి సాధించేందుకు ప్రస్తుత సంక్షోభాన్ని ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఆ కాలంలో కొలంబోలో ఇండియన్ హై కమిషనర్‌గా పని చేసిన జేఎన్ దీక్షిత్‌ను ‘వైస్‌రాయ్’ అని పిలిచేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ పదం వెలుగులోకి వస్తోంది. 


Updated Date - 2022-04-09T23:48:27+05:30 IST