ఏం చేస్తారో?

ABN , First Publish Date - 2022-01-20T05:49:33+05:30 IST

మా ఊరి రోడ్డు ఒకసారి చూడండి సార్‌. వాహనం మీద పోతుంటే ఎక్కడ పడిపోతామోనని భయం వేస్తుంది. రోడ్డు బాగు చేయించండి ప్లీజ్‌!

ఏం చేస్తారో?
హత్తిబెళగల్‌ రహదారి ఇలా..

గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే
జడ్పీని వేధిస్తున్న నిధుల కొరత
ఆర్థిక సంఘం నిధులతోనే సరి
ప్రభుత్వం నుంచి తోడ్పాటు కరువు
జిల్లా పరిషత్‌ సమావేశంలోనైనా చర్చించి పరిష్కరిస్తారా?


కర్నూలు, ఆంధ్రజ్యోతి:

మా ఊరి రోడ్డు ఒకసారి చూడండి సార్‌. వాహనం మీద పోతుంటే ఎక్కడ పడిపోతామోనని భయం వేస్తుంది. రోడ్డు బాగు చేయించండి ప్లీజ్‌!

సార్‌.. మా ఊర్లో మురుగు కాల్వలు పూడిక తీయలేదు. అటుగా పోవాలంటే దుర్వాసన వస్తోంది. దోమలతో అల్లాడి పోతున్నాం. ఒకసారి ఇటు చూడండి.

పంటలన్నీ దెబ్బతిని చాలా నష్టపోయాము. పెట్టుబడి సంగతి పక్కన పెడితే రెక్కల కష్టం కూడా రాలేదు. ఈసారీ అప్పులే మిగిలాయి. కాస్త ఆదుకోండి సారూ!

తాగునీటి కోసం అల్లాడి పోతున్నాం. సక్రమంగా నీరందడం లేదు. నీరుంటే కొళాయిలు సరిగా ఉండవు, కొళాయిలు ఉంటే నీరు ఉండదు. ఎన్నాళ్లు భరించాలి ఇలా?

జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. సంక్షేమం ఎలా ఉన్నా అభివృద్ధి ఏదని ప్రశ్నిస్తున్నారు? ఈ నేపథ్యంలో గురువారం జడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. తమ సమస్యలు చర్చించి పరిష్కరించడని జిల్లా వాసులు కోరుతున్నారు.

రెండున్నరేళ్ల తర్వాత..

గత ప్రభుత్వ హయాంలో ఎన్నికైన జడ్పీ పాలక వర్గం పదవీ కాలం 2019 జూలైతో ముగిసింది. అప్పటి నుంచి జిల్లా పరిషత్‌కు కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా కొనసాగారు. కొత్త పాలక వర్గం గత ఏడాది సెప్టెంబరు 25న కొలువుదీరింది. నిబంధనల ప్రకారం మూడు నెలలలోపు సర్వసభ్య సమావేశం, రెండునెలలలోపు స్థాయి సంఘాల ఎన్నిక పూర్తికావాల్సి ఉంది. అయితే జడ్పీలో జరిగిన రాజకీయ పరిణామాలతో ఇప్పటి వరకు సర్వసభ్య సమావేశం జరగలేదు. మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని చైర్మన్‌ పీఠం నుంచి దింపాలన్న ఉద్దేశంతో సర్వసభ్య సమావేశం వాయిదా వేస్తూ వచ్చారన్న అభిప్రాయం ఉంది. ఎట్టకేలకు కొత్త చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి వచ్చాక గురువారం సమావేశం జరుగుతోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత జడ్పీలో తొలి సమావేశం ఉంటోంది.

గ్రామీణులకు అందని మంచినీరు

పశ్చిమాన అత్యధిక గ్రామాల్లో వేసవిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. దీనికితోడు సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో జల పరీక్షలు సైతం పడకేసి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 9,935 చేతిపంపులు ఉంటే అధికశాతం నిరుపయోగంగా మారాయి. ఇవికాక గ్రామీణుల నీటి అవసరాలు తీర్చడానికి 3,542 రక్షిత పథకాలు ఉన్నాయి. అయినా తాగునీరు సక్రమంగా అందడం లేదు. దాదాపు 24 గ్రామ పంచాయతీల్లో ఫ్లోరైడ్‌ నీరే అందుతోంది. డోన్‌, పత్తికొండ, వెల్దుర్తి, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర మండలాల్లో శుద్ధ జలం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ఇచ్చేందుకు చేపట్టిన కేంద్ర పథకం జలజీవన్‌ మిషన్‌ పనులు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. ఇక గత ఏడాది నివర్‌ తుపాన్‌ నుంచి తాజాగా కురిసిన అకాల వర్షాల వరకు ఆ పథకాల పనితీరుపై డ్రైవ్‌ నిర్వహించిన దాఖలాలు లేవు. వీటిపై సమగ్రంగా చర్చించి నీటి సరఫరా అందించే పైపులైన్‌లకు తక్షణమే మరమ్మతులను చేపట్టాల్సిన అవసరముంది.

మరమ్మతుల ఊసే లేదు

గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఏ గ్రామానికి వెళ్లాలన్నా ప్రయాణికులు, వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గతంలోనే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు వాటిపై కదలిక లేదు. ప్రతిపాదనలు పంపినవాటిలో బీటీతో పాటు మట్టి రోడ్లు ఉన్నాయి. గ్రామాల నుంచి మండల, పట్టణ కేంద్రాలను కలుపుతూ నిర్మించిన రహదారులు సైతం దారుణంగా ఉన్నాయి.

ఆర్థిక సంఘం నిధులే గతి

జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే జడ్పీకి నిధులు పూర్తి స్థాయిలో అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక సంఘం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటే కరువయింది. అన్నీ కలిపి జిల్లా పరిషత్‌లో ప్రస్తుతం రూ.10 కోట్లు మాత్రమే లభ్యత ఉన్నట్లు తెలుస్తోంది. సీనరేజి బకాయిలు ఏళ్ల తరబడి జడ్పీకి ప్రభుత్వం బకాయి పడింది. జడ్పీకి ఆదాయం ఎంత వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి.

రూ. కోట్లలో బకాయిలు

రహదారులు, మంచినీరు, పారిశుధ్య పనులకు కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. వీటిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు కూడా ఉన్నాయి. వైసీపీ వచ్చాక కాంట్రాక్టర్లను రకరకాల కారణాలతో వేధిస్తూ బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. దీంతో కొత్త పనులకు టెండర్లు వేసే నాథుడే కరువయ్యాడు. బిడ్లు పిలవడం.. స్పందన లేకపోవడం.. మళ్లీ పిలవడం.. దీంతోనే నెలలు గడిచిపోతున్నాయి. దీంతో చాలా వరకు అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. బిల్లులు పెండింగ్‌లో ఉండి వడ్డీల బాధలు పడలేక ఇటీవలే ఒకరు ఆత్మహత్య చేసుకోగా, ఇంకొకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఈ శాఖలపైన దృష్టి సారించేనా..?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించిన రుణాలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. సంక్షేమ వసతి గృహాల్లోనూ సమస్యలు నెలకొన్నాయి. వివిధ వర్గాలకు చెందిన గురుకుల విద్యాలయాలు, కస్తూర్బాల నిర్వహణపై చర్చించాల్సి ఉంది. అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణలోనూ లోటుపాట్లు కనిపిస్తున్నాయి. విలీన పాఠశాలల్లో వసతి సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లుగా వ్యవసాయ యాంత్రీకరణ పట్టాలెక్కలేదు. రైతులు వ్యవసాయ పరికరాల కోసం ప్రైవేటు సంస్థలను ఆశ్రయించి మోసపోతున్నారు. పీహెచ్‌సీల్లో 24 గంటలు వైద్య సేవలు అందేలా ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు సక్రమంగా రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరమైన సిబ్బందిని నియమించామని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నా పూర్తిస్థాయిలో నియామకాలు జరగలేదన్న విమర్శలున్నాయి.

రోడ్లు ఇలా..

ఆలూరు-హత్తిబెళగల్‌ గ్రామ రహదారి ఇది. ఏడాది క్రితం రూ.2.70 కోట్లతో నిర్మాణం ప్రారంభించినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను నిలిపి వేశారు. ఇప్పుడు కంకర తేలిపోయి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

ఆలూరు మండలం అరికెర తండాకు వెళ్లే రహదారి రూ.2.49 కోట్లతో పనులు ప్రారంభించారు. అయితే నిధులు లేవని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పనులు నిలిపివేశారు. దీంతో ఆ రోడ్డు మీదుగా ప్రయాణం నరకంగా మారింది.

- ఆలూరు

తీరని దాహం

ఆలూరు: తుంబలబీడు గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. బాపురం రిజర్వాయర్‌ నుంచి నీరు సరఫరా కావాల్సి ఉంది. గ్రామంలో ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ఉన్నా నీరు ఎక్కకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య వేధిస్తోంది. వారానికి ఒకసారి వచ్చే నీటి కోసం ప్రజలు ట్యాంక్‌ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆలూరు పట్టణంలో కూడా ఏడు రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటర్‌ క్యాన్లు కొని దాహం తీర్చుకుంటున్నారు.

నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం

జిల్లా పరిషత్‌ కొత్త పాలక వర్గం ఏర్పడ్డ తర్వాత మొదటి సమావేశం గురువారం జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరు కానున్నారు. దాదాపు 31 నెలల తర్వాత సమావేశం జరుగుతోంది.

Updated Date - 2022-01-20T05:49:33+05:30 IST