బక్రీద్‌ ఖుర్బానీపై ఖురాన్‌ ఏమంటోంది?

ABN , First Publish Date - 2021-07-20T08:33:49+05:30 IST

బీఫ్‌ అనేది అలవాటుకు సంబంధించిన అంశమేగానీ, పేదరికానికి సంబంధించిన అంశం కాదు. నిజాం సంస్థానంలో ముస్లిం ధనవంతులు కూడ బీఫ్ తింటారు....

బక్రీద్‌ ఖుర్బానీపై ఖురాన్‌ ఏమంటోంది?

బీఫ్‌ అనేది అలవాటుకు సంబంధించిన అంశమేగానీ, పేదరికానికి సంబంధించిన అంశం కాదు. నిజాం సంస్థానంలో ముస్లిం ధనవంతులు కూడ బీఫ్ తింటారు. ఆంధ్రా ప్రాంతంలో ముస్లింలలో 30-40 శాతం మాత్రమే బీఫ్ తింటారు. నాలుగు రకాల మాంసాల్ని మనం అందరం సాధారణంగా బీఫ్ అంటాం. దున్నపోతు, గేదె, ఎద్దు, ఆవు మాంసాలు ఈ జాబితాలో వస్తాయి. మన దేశంలో బీఫ్ మీద ఒక వివాదం వుంది. నిజానికి ఈ వివాదం ఆవు (గో) మాంసం మీద మాత్రమే. మిగిలిన మాంసాల మీద లేదు. మాంసం వ్యాపారులు కూడ సాధారణంగా ఆవును కోయరు. 


కేరళతో సహా అనేక రాష్ట్రాల్లో దున్నపోతు, గేదె మాంసాల్ని బీఫ్‌గా హోటళ్ళలో హాట్ కేకుల్లా అమ్ముతుంటారు. మలయాళం టీవీల వంటల కార్యక్రమాల్లో రకరకాల బీఫ్ వంటల గురించి ఉంటాయి. మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్ సినిమాల్లోనూ బీఫ్ ప్రస్తావన ఉంటుంది. హీరో చాలా ఇష్టంగా బీఫ్ తింటాడు. వివాదాల కారణంగా బీఫ్ బోర్డుల మీద ఇటీవల బ్రాకెట్లో ‘బఫెలో మీట్’ అని రాస్తున్నారు. 


బీఫ్ తింటారని ముస్లింల మీద బీజేపీ కార్యకర్తలు అక్కడక్కడా డాడులు చేస్తుంటారు. నిజానికి బీఫ్ మీద బీజేపీకి ఒక జాతీయ విధానం లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్‌ను నిషేధించాలని బీజేపీ ఎన్నడూ అనదు. కేరళలో అయితే ఏకంగా తాము గెలిస్తే క్వాలిటీ బీఫ్‌ను పంపిణీ చేస్తామని బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో వాగ్దానం చేస్తుంటారు. బీఫ్ ఎగుమతి చేసే దేశాల్లో బ్రెజిల్, ఆస్ట్రేలియా, అమెరికా తరువాత మన దేశానిది నాలుగవ స్థానం. అమెరికాతో దాదాపు సమానంగా భారత్ బీఫ్‌ను ఎగుమతి చేస్తుంది. బీఫ్‌ను ఎగుమతి చేసే కంపెనీలన్నీ ముస్లింలకు చెందినవని చెప్పడం కూడా కుదరదు. ముస్లిమేతరులే ఈ వ్యాపారంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. 


ఆవును ఖుర్బానీ ఇస్తే పుణ్యం ఎక్కువ అని వాదించే ముస్లింలు కొందరు ఉన్నారు. నాతో వాదించిన ఒక వ్యక్తిని నేను ‘‘అలా ఎవరు చెప్పారు’’ అని ప్రశ్నిస్తే, అతను ‘‘హదీస్, సున్నత్’’ని ప్రస్తావించాడు. ఖురాను, హదీస్, సున్నత్‌లు ఆమూలాగ్రం నాకు తెలుసని అనలేనుగానీ, నా ధార్మిక గురువు మా అమ్మీ మూలంగా ఇస్లాంలో కీలక అంశాలపై నాకు కొంత పరిజ్ఞానం ఉంది. హదీస్, సున్నత్‌లో ఆవుమాంసం తినాలని ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా మన దేశ ఆవులు వేరు; అరేబియా ఆవులు వేరు. మన ఆవులకు మూపురం ఉంటుంది. అక్కడి ఆవులకు మూపురం ఉండదు. అక్కడి ఆవులు తెల్ల గేదెల్లా ఉంటాయి. అవి గేదెలతో సమానం. అలాగే- ఖురాన్ కథనం ప్రకారం ఆ రోజు హజ్రత్ ఇబ్రాహీంగారు బలి ఇచ్చింది ‘దుంబా’ని. అది మన గొర్రెల జాతికి చెందిందేగానీ, గొర్రె కాదు. ఖుర్బానీ వేస్తే దుంబాని వేయాలి; లేకుంటే గొర్రెను వేయాలి. మధ్యలో ఈ ఆవు ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది బీజేపీ, ఆరెస్సెస్, భజరంగ్‌దళ్ వాళ్లకు వ్యతిరేకంగా ఆవు మాంసాన్ని తెరపైకి తెస్తున్నారు. బీజేపీ ధార్మిక అంశాల్ని రాజకీయం చేస్తుంటే, వీళ్ళు  రాజకీయ అంశాన్ని ధార్మికంగా మారుస్తున్నారు. బీజేపీ, ఆరెస్సెస్, భజరంగ్ దళ్‍లను నిలవరించటానికి ఇది మార్గం కాదు. 


ఆహార సేకరణ కాలంలో ఆవులు గేదెలు మేకలు గొర్రెల్ని ఆహారం కోసమే పెంచేవారు. వ్యవసాయం అభివృద్ధి చెందాక దృక్పథం మారిందని చరిత్రకారులు చెపుతారు. శంకరాచార్యుడు వచ్చే వరకు బ్రాహ్మణులు మాంసాహారులేనని కూడా చరిత్ర చెపుతోంది. వాళ్ళు గోమాంసం కూడ తినేవారని వేదాల్లో ఉందని కొందరు అంబేడ్కరిస్టులు అంటుంటారు. తాబేలు, చేప, సింహం, వరాహం కూడ విష్ణుమూర్తి అవతారాల్లో ఉన్నాయి. విఘ్నేశ్వరుడ్ని పూజించకుండా హిందూ సమాజం ఏ పనీ మొదలు పెట్టదు. ఆ జీవులన్నింటి మీద లేని వివాదం ఒక్క గోవు మీదనే ఎందుకని కొందరి సందేహం. ఎవరి ఆహార అలవాట్లు వారివి. ఒకరి ఆహారపు అలవాట్లలో మరొకరి జోక్యం అనవసరం అనే వాదనలూ ఉన్నాయి.


వాళ్ళు ఎలాగూ దాడులు చేయదలచుకున్నారు కనుక ఒకవేళ ముస్లింలు బీఫ్‌ను వదిలేసినా వాళ్ళ మీద దాడులు కొనసాగుతాయనే మాట కూడ ఉంది. బీఫ్ సమస్యను పరిష్కరిస్తే ఇంకో సమస్యను ముందుకు తెస్తారు అనేవాళ్ళూ ఉన్నారు. అవన్నీ నిజమేగానీ, వర్తమాన సమాజంలో సాధారణ హిందూ సామాజికవర్గాలు ఆవును గోమాతగా భావిస్తున్నాయి కనుక వాళ్ళ మనోభావాలను గౌరవించడమే మంచి సంప్రదాయం. అదొక గుడ్ గెశ్చర్. పేదరికం వల్ల ప్రొటీన్ డైట్‌గా బీఫ్ తినే సమూహాలకు ప్రత్యామ్నాయంగా బఫెలో మీట్ ఎలాగూ ఉంది. ఇకముందు బీఫ్ అనవద్దు బఫెలో మీట్ అనండి సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది.  దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు బక్రీద్ సందర్భంగా ఎట్టి పరిస్థితిలోనూ గోవుల్ని బలి ఇవ్వవద్దని ముస్లిం సమాజాన్ని కోరుకుంటున్నాను. కొన్నేళ్ళుగా అనేక ముస్లిం ధార్మిక సంస్థ (జమాత్)లు కూడా గోవధ వద్దంటున్నాయి. ఆ మేరకు ఫత్వాలున్నాయి. వాటిని గౌరవిద్దాం. 

డానీ

Updated Date - 2021-07-20T08:33:49+05:30 IST