HYD : మొరాయిస్తున్న Metro.. ఎక్కడి వరకు నడుస్తుందో.. ఎక్కడ ఆగిపోతుందో..!

ABN , First Publish Date - 2022-05-29T17:44:39+05:30 IST

ఆధునిక సాంకేతిక వ్యవస్థతో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లు ఇటీవలి కాలంలో మొరాయిస్తున్నాయి. బయలుదేరిన

HYD : మొరాయిస్తున్న Metro.. ఎక్కడి వరకు నడుస్తుందో.. ఎక్కడ ఆగిపోతుందో..!

  • వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు
  • ఇటీవల తరచుగా.. 
  • ఆందోళనలో ప్రయాణికులు

హైదరాబాద్‌ సిటీ : ఆధునిక సాంకేతిక వ్యవస్థతో అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లు ఇటీవలి కాలంలో మొరాయిస్తున్నాయి. బయలుదేరిన రైలు ఎక్కడి వరకు బాగా నడుస్తుందో.. ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వేగంతోపాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందవచ్చని భావిస్తూ రైళ్లు ఎక్కుతున్న ప్యాసింజర్లు మార్గమధ్యలో అకస్మాత్తుగా ఆగిపోతున్న ట్రైన్లతో ఆందోళనకు గురవుతున్నారు. అత్యవసర పనులకు వెళ్తున్న సందర్భాల్లో రైళ్లు నిలిచిపోతుండడంతో ఇబ్బందులకు లోనవుతున్నారు. గతంలో ఎప్పుడో ఓసారి సాంకేతిక లోపాలు తలెత్తగా ప్రస్తుతం వారంలో రెండు, మూడుసార్లు ఎదుర వుతుండడంతో నగరవాసులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.


నిర్వహణలోపమా..

అధునాతన టెక్నాలజీతో తయారైన రైళ్లలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలపై స్పష్టత కరువైంది. కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌ (సీబీటీసీ) సిస్టమ్‌తో నడుస్తున్న రైళ్లపై పర్యావరణం ప్రభావం చూపుతోందని, గాలిలోని దుమ్ము, ధూళి విద్యుత్‌ తీగలపై చేరి సరఫరాలో అవాంతరాలు ఎదురవుతూ రైళ్లు అప్పుడప్పుడూ ఆగుతున్నాయని అధికారులు చెబుతుండగా.. రైళ్ల తనిఖీని విస్మరిస్తుండడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. సమస్య తలెత్తినప్పుడు హడావిడి చేస్తున్న అధికారులు.. వాటి నిర్వహణను సరిగ్గా పట్టించుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు.


తగ్గుతున్న రెవెన్యూ..

సాంకేతిక సమస్యలతో ఆకస్మాత్తుగా రైళ్లు నిలిచిపోతుండడంతో హైదరాబాద్‌ మెట్రో రైలుకు రెవెన్యూ తగ్గుతోంది. ఉదాహరణకు సాయంత్రం వేళలో ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, నాగోలు-రాయదుర్గం మార్గాల్లో ప్రతి గంటకు దాదాపు 25-30వేల మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు ఈ కారిడార్లలోని అన్ని స్టేషన్లలో ప్యాసింజర్ల సందడి ఉంటుంది. ఆదాయం కూడా ఇదే సమయంలో ఎక్కువ వస్తోంది. అయితే అత్యంత రద్దీ కలిగిన కారిడార్లలో నడిచే రైళ్లలో సాంకేతిక సమస్యలు నెలకొంటుండడంతో ఆదాయం కూడా పడిపోతోంది. ఆగిపోతున్న రైళ్లను చూసి ప్రత్యామ్నాయ రవాణాను ఎంచుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.


సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు..

నగరంలోని మూసారాంబాగ్‌, లక్డీకపూల్‌ స్టేషన్లలో ఇటీవల ఆగిపోయిన రైళ్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్‌ అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తనిఖీలు ముమ్మరం చేయాలని,  రైళ్లలో ఎలాంటి సమస్య ఉత్పన్నమైన వెంటనే పరిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను అత్యంత భద్రంగా ఉంచాలని, ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ విభాగాలను ఎప్పటికప్పుడు అనుసంధానం చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. విద్యుత్‌ సరఫరాలో అవాంతరాలు ఏర్పడినప్పుడు, ఆటోమేటిక్‌ సూపర్‌విజన్‌ (ఏటీఎస్‌) పనిచేయనప్పుడు, బ్రేక్‌ సిస్టమ్‌ లాక్‌ అయినప్పుడు.. ఇలా ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే మెయింటెనెన్స్‌ విభాగానికి సమాచారం అందించి రైలును ముందుకు కదిలించే విధంగా పైలెట్లకు మరోసారి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

Updated Date - 2022-05-29T17:44:39+05:30 IST