‘రద్దీ’ లేదని రద్దు.. నిర్లక్ష్యపు పట్టాలపై MMTS..!

ABN , First Publish Date - 2022-05-22T20:34:16+05:30 IST

జంట నగరవాసులకు అతి తక్కువ ధరతో, తక్కువ సమయంలో సురక్షితమైన

‘రద్దీ’ లేదని రద్దు.. నిర్లక్ష్యపు పట్టాలపై MMTS..!

  • నెలలో రెండు, మూడు సార్లు నిలిపివేత
  • వీకెండ్‌లో జంట నగరవాసుల ఇబ్బందులు
  • మరో వైపు ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ‘మెట్రో’
  • శని, ఆదివారాల్లో రూ.59తో రోజంతా ప్రయాణ సౌకర్యం
  • రాత్రివేళలో ఆదుకుంటున్న ఆర్టీసీ నైట్‌ రైడర్స్‌

హైదరాబాద్‌ సిటీ : జంట నగరవాసులకు అతి తక్కువ ధరతో, తక్కువ సమయంలో సురక్షితమైన ప్రయాణాన్ని అందించే మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (MMTS) రైళ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. గతంలో రోజులో దాదాపు 16 గంటలపాటు నిర్విరామంగా తిరిగిన రైళ్లు ఇటీవల నడవాలా.. వద్దా అన్నట్లుగా సాగుతున్నాయి. అయితే, ప్రయాణికుల (Passangers) రద్దీ తగ్గడమే ఇందుకు కారణమని అధికారవర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. జంటనగరాలు, శివారు ప్రాంత ప్రజలకు లోకల్‌ రైలు సౌకర్యాన్ని కల్పించేందుకు 2003లో నగరంలో ఎంఎంటీఎస్‌ రైళ్లను (MMTS Trains) అందుబాటులోకి తెచ్చారు. 2020 ఫిబ్రవరి వరకు సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, ఫలక్‌నుమా మార్గాల్లో రోజుకు 128 సర్వీసులను నడిపించేవారు. ఆయా రూట్లలో సగటున 1.68లక్షల మంది ప్రయాణించారు. కొవిడ్‌ (Corona) తర్వాత తర్వాత జంట నగరాల పరిధిలో రోజుకు 86 సర్వీసులను నడిపిస్తుండగా.. గరిష్ఠంగా 45వేల నుంచి 50వేల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.


ఆకట్టుకుంటున్న మెట్రో.. ఆర్టీసీ

జంటనగరవాసులకు మెట్రో రైలు, ఆర్టీసీ సంస్థలు ఇటీవల మెరుగైన సేవలందిస్తూ ముందుకుసాగుతున్నాయి. చార్జీల విషయంలో ఎంఎంటీఎస్‌తో పోల్చితే కొద్దిగా ఎక్కువైనప్పటికీ 16 గంటలపాటు మెట్రో, పలు మార్గాల్లో 24 గంటలపాటు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. వీకెండ్‌ రోజుల్లో నగరవాసులతోపాటు పర్యాటకులను ఆకట్టుకునేందుకు మెట్రో రైల్‌ ఇటీవల రూ.59 ప్రత్యేక టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండవ, నాలుగవ శనివారాలు, ప్రతి ఆదివారం, ప్రభుత్వ పండగ సెలవుల్లో అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌ టికెట్‌ కొనుగోలు చేసిన వారు రోజంతా ప్రయాణం చేసే సౌకర్యాన్ని మెట్రో కల్పిస్తోంది. అలాగే, రాత్రివేళలో సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలు దిగిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులను సైతం ఆర్టీసీ అక్కున చేర్చుకుని రవాణా అందిస్తోంది.   నైౖట్‌ రైడర్స్‌ పేరిట ఇటీవల సికింద్రాబాద్‌- పటాన్‌చెరు, సికింద్రాబాద్‌- చార్మినార్‌, సికింద్రాబాద్‌- సీబీఎస్‌ రూట్లలో రాత్రి 12.12 నుంచి ఉదయం తెల్లవారుజామున 4 గంటల వరకు సర్వీసులు నడిపిస్తోంది. త్వరలో కొండాపూర్‌, మణికొండ, బోరబండ రూట్లలో కూడా నడిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. 


నెలలో రెండుసార్లు రద్దు..

ఎంఎంటీఎస్‌ రైలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. ఇందులో టికెట్‌ ధర రూ.5తో మొదలుకుని రూ.50 వరకు ఉంటుంది. అయితే, గతంలో రోజుకు రూ.3లక్షల నుంచి 4 లక్షల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రూ. లక్ష కూడా రావడంలేదని అధికారులు చెబుతున్నారు. కళాశాలలకు వేసవి సెలవులు ఉండడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిందని, ఎండతీవ్రత కారణంగా సాధారణ ప్రయాణికులు రావడంలేదని ఇటీవల ఎంఎంటీఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌ చార్జీల్లో 50శాతం రేట్లు తగ్గించారు. రేట్లు తగ్గించినా ఆక్యుపెన్సీ పెరగకపోవడంతో మెయింటెనెన్స్‌ పనులను సాకుగా చూపిస్తూ నెలలో రెండు, మూడుసార్లు వివిధ మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నారని ప్రయాణికులు అంటున్నారు. ప్రధానంగా నగరంలో రాకపోకలు అధికంగా ఉండే శని, ఆదివారాల్లో ఎంఎంటీఎ్‌సను రద్దు చేస్తుండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు నగరానికి వచ్చేందుకు అధిక చార్జీలు చెల్లించి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలకు సౌకర్యవంతమైన ఎంఎంటీఎస్‌ రైళ్లను తరచూ రద్దు చేస్తూ దాని ఉనికిని దెబ్బతీయొద్దని సబర్బన్‌ రైల్వే ప్రయాణికుల సంఘం నాయకులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-22T20:34:16+05:30 IST