ఐదేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్న డాక్టర్.. అతనికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-02T19:42:50+05:30 IST

తరచుగా స్నానం చేయకపోతే ఏం జరుగుతుంది? మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.

ఐదేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్న డాక్టర్.. అతనికి ఏం జరిగిందంటే..

తరచుగా స్నానం చేయకపోతే ఏం జరుగుతుంది? మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. మన చర్మం రకరకాల సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుంది. ఈ విషయంలో నిజాలను నిర్ధారించేందుకు న్యూయార్క్‌కు చెందిన హాంబ్లిన్ అనే వైద్యుడు వినూత్న ప్రయోగం చేశాడు. ఐదేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నాడు. ఈ ప్రయోగం వల్ల డబ్బు, సమయం ఆదా అవుతుండడం గమనించాడు. రోజుకు అరగంట పాటు స్నానం చేసినా మొత్తం జీవిత కాలంలో రెండేళ్లు వృథా అవుతుందని తన పుస్తకంలో రాసుకున్నాడు.


`స్నానం చేయకపోవడం వల్ల నా జీవితంలో చాలా సమయం, డబ్బు ఆదా అయింది. అలాగే చర్మంపై ఉండే సూక్ష్మజీవుల గురించి చాలా తెలుసుకున్నా. మన శరీరం లోపల, చర్మం పైన వందల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అందులో మనకు మంచి చేసే బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉంటుంది. మనం తరచుగా స్నానం చేయడం వల్ల, శరీరాన్ని శుభ్రపరచుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంద`ని హాంబ్లిన్ చెప్పాడు. `నా చర్మం చాలా జిడ్డుగా ఉండేది. నేను స్నానం చేయడం మానేసిన తర్వాత నా చర్మం జిడ్డుగా మారడం తగ్గింది. తామర కూడా తగ్గింది. అలాగే దుర్వాసన కూడా వచ్చేది కాద`ని తెలిపాడు. 


హాంబ్లిన్ కంటే ముందు డేవిడ్ విట్‌లాక్ అనే కెమికల్ ఇంజినీర్ కూడా ఈ తరహా ప్రయోగం చేశాడు. అతను స్నానానికి బదులుగా, బతికి ఉన్న బ్యాక్టీరియాను తన శరీరంపై స్ప్రే చేసుకునేవాడు. అలా చేయడం వల్ల తామర, దురదలు వంటి చర్మ సమస్యలు దూరమైనట్టు గమనించాడు. తరచుగా స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే మంచి బ్యాక్టీరియా దూరమవుతుందని, ఎక్కువగా స్నానం చేసేవారు తమ చర్మానికి అపార నష్టం కలుగ చేస్తున్నారని నమ్మే పరిశోధకులు చాలా మంది ఉన్నారు. స్నానం చేయడం వల్ల నష్టాలు ఉన్నప్పటికీ, చేయకుండా ఉండడం చాలా దుర్భరంగా ఉంటుందని హాంబ్లిన్ పేర్కొన్నాడు. 

Updated Date - 2022-05-02T19:42:50+05:30 IST