ఏమైంది వీళ్లకి..!

ABN , First Publish Date - 2022-09-18T05:24:35+05:30 IST

గుత్తిలో తాగునీటి సరఫరాను అడ్డుకున్నారు. గన్నెవారిపల్లెలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తుంటే అడ్డుకున్నారు.

ఏమైంది వీళ్లకి..!
తహసీల్దార్‌ వద్ద టీడీపీ నాయకులను బైండోవర్‌ చేయిస్తున్న పోలీసులు

ఏమైంది వీళ్లకి..!

గుత్తిలో తాగునీటి సరఫరా అడ్డగింత

గన్నెవారిపల్లెలో అభివృద్ధి పనులు వద్దంట

ప్రజాసమస్యలను పరిష్కరిస్తే బెదిరింపులు

అధికారులు, పోలీసుల ద్వారా హెచ్చరికలు

వైసీపీ నాయకుల తీరుపై ప్రజల ఆగ్రహం


గుత్తిలో తాగునీటి సరఫరాను అడ్డుకున్నారు. గన్నెవారిపల్లెలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తుంటే అడ్డుకున్నారు. ప్రజల గొంతు తడపడం నేరమా..? పారిశుధ్య కల్పన పాపమా..? రాజకీయ నాయకులది మూర్ఖత్వం అనుకోవచ్చు. మరి పోలీసులు.. అధికారులకు ఏమైనట్లు..? స్టేషనకు పిలిపించి వార్నింగ్‌ ఇస్తారా..? తహసీల్దారు వద్ద బైండోవర్‌ చేయిస్తారా..? మంచిని అడ్డుకోవడమే అధికార పార్టీవారు పనిగా పెట్టుకున్నట్లున్నారు. అధికార పార్టీవారు ఏం చెబితే అది చేయడమే అధికారులు విధిగా పెట్టుకున్నారు. అసలేమైంది వీరందరికీ..! ఇలా చేస్తే ఓట్లు పడవు కదా..! ఆ కారణంగానైనా వైసీపీవారు పద్ధతిగా ఉండాలి కదా..? ఏం చేసినా గెలిపిస్తారులే అనుకుంటున్నారా..? అధికారం జీవిత పర్యంతం అని భ్రమలో ఉన్నారా..? ఇది జిల్లా ప్రజల్లో జరుగుతున్న చర్చ.

 - తాడిపత్రి


ఇదీ సమస్య

తాడిపత్రి సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీ సాయిలక్ష్మి అపార్ట్‌మెంట్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపునీరు నిలిచింది. దీనికితోడు ఇళ్ల నుంచి మురుగునీరు చేరి.. దుర్వాసన వస్తోంది. దోమలు ప్రబలాయి. పందులకు ఆవాసమైంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణం. ఈ సమస్యను పరిష్కరించాలని టీడీపీ సర్పంచ ఉమామహేశ్వర్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణను స్థానికులు కోరారు. పంచాయతీలో నిధులు లేవని, గతంలో చేసిన పనులకూ నిధులు ఇవ్వలేదని సర్పంచ వారికి వివరించారు. దీంతో తాము చందావేసుకుని డబ్బులు ఇస్తామని, డ్రైనేజీ నీరు వెళ్లేలా పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు సర్పంచను కోరారు. ఖర్చులో కొంత తానూ భరిస్తానని చింబిలి వెంకటరమణ ముందుకొచ్చారు. అందరూ కలిసి చందాలు వేసుకుని.. రూ.లక్ష విలువైన పైపులు, సామగ్రిని కొనుగోలు చేశారు. డ్రైనేజీ పైప్‌లైన నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. 


అడ్డుకున్న వైసీపీ నాయకులు

కాలనీలో సమస్యను టీడీపీవారు పరిష్కరిస్తే తన ఆధిపత్యానికి గండిపడుతుందని భావించిన వైసీపీ నాయకుడు, ఎంపీటీసీ రవి, తన అనుచరులతో కలిసి కాలనీకి వెళ్లారు. ‘అభివృద్ధి చేస్తే మేమే చేయాలి. మీరెవరు చేయడానికి..? వెంటనే ఆపండి..’ అని హుకుం జారీ చేశారు. ఆ పనులకు రూ.2 లక్షలు మంజూరయ్యాయని, అధికారులు చేయాల్సిన పనులను మీరెలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలూ అక్కడ గుమిగూడారు. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్య, ఎస్‌ఐ గౌస్‌ మహమ్మద్‌ అక్కడికి చేరుకున్నారు. గుంపును చెదరగొట్టి, సర్పంచ ఉమామహేశ్వర్‌ను పోలీస్‌స్టేషనకు తరలించారు. తన ఇంటి వద్ద ఉన్న టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణకు ఫోనచేసి వెంటనే పోలీ్‌సస్టేషనకు రావాలని సూచించారు. పోలీ్‌సస్టేషనకు వచ్చిన వెంకటరమణను, సర్పంచ ఉమామహేశ్వర్‌ను జీపులో డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడ ఇద్దరినీ డీఎస్పీ హెచ్చరించారు. తహసీల్దారు ఎదుట బైండోవర్‌ చేయాలని పోలీసులను ఆదేశించారు. ప్రజల సమస్యను పరిష్కరిస్తుంటే ఎందుకు బైండోవర్‌ చేస్తారని వారు డీఎస్పీని ప్రశ్నించినా పట్టించుకోలేదు. బలవంతంగా తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. బైండోవర్‌ చేసి, పూచీకత్తుపై విడుదల చేశారు. 


మేమే చేయాలనుకున్నాం..

పంచాయతీకి పైసా ఖర్చు లేకుండా, ప్రజల చందాలతో సమస్యను పరిష్కరిస్తుంటే అభ్యంతరం ఏమిటని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులును విలేకరులు ప్రశ్నించారు. వైసీపీ నాయకులతో కలిసి ఆయన కాలనీకి వచ్చారు. ఆ పనులకు రూ.2 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపడతామని అన్నారు. తాము పనులను చేయాలని అనుకున్నామని, ఇంతలోగా వారు చేస్తున్నారని అన్నారు. పంచాయతీలో నిధులు లేవని, అభివృద్ధి నిలిచిపోయిందని సర్పంచ వాపోతుంటే.. అడ్డుకోవడం భావ్యమా..? అని అడిగితే నీళ్లు నమిలారు. 


ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే: చింబిలి

గన్నెవారిపల్లి కాలనీ ప్రజలను ఇబ్బందిపెట్టేందుకే వైసీపీవారు పనులను అడ్డుకున్నారు. సొంత డబ్బుతో డ్రైనేజీ నీరు పోయేలా ఏర్పాట్లు చేస్తుంటే అడ్డుకోవడం శోచనీయం. వారు చేయరు.. మమ్మల్ని చేయనివ్వరు. కాలనీలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాకుండా అధికారులద్వారా అడ్డుకుంటున్నారు. కాలనీ ప్రజలు టీడీపీకి మద్దతుగా ఉన్నందుకు కక్ష సాధిస్తున్నారు. 

Updated Date - 2022-09-18T05:24:35+05:30 IST