ITR filing : గడువు దాటితే చెల్లింపుదార్లు చేయాల్సిందిదే..

ABN , First Publish Date - 2022-08-01T01:37:39+05:30 IST

ఆర్థిక సంవత్సరం 2021-22కి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ITR) దాఖలు గడువు జులై 31, 2022తో(నేడు) ముగిసింది. సాంకేతిక సమస్యల దృష్ట్యా గడువుని మరింత పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారులు విజ్ఞప్తులు అందాయి.

ITR filing : గడువు దాటితే చెల్లింపుదార్లు చేయాల్సిందిదే..

న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2021-22కి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్(ITR) దాఖలు గడువు జులై 31, 2022తో(నేడు) ముగిసింది. సాంకేతిక సమస్యల దృష్ట్యా గడువుని మరింత పొడిగించాలంటూ పన్నుచెల్లింపుదారులు విజ్ఞప్తులు చేశారు. అయినా పొడిగించే ప్రసక్తేలేదని కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకుంటే చెల్లింపుదారుల పరిస్థితి ఏంటి?.. ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి? అనే సందేహాలపై ఓ లుక్కేద్దాం..


డిసెంబర్ 31 వరకు ఛాన్స్

గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయని చెల్లింపుదారులు డిసెంబర్ 31, 2022 వరకూ అవకాశం ఉంటుంది. అయితే ఇందుకుగానూ ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234ఏ కింద పన్ను బకాయిలపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉంటే జరిమానా రూ.1000గా ఉంది. ఇక వార్షికాదాయం రూ.5 లక్షలకుపైబడి ఉంటే  జరిమానా రూ.5000గా ఉంది. అయితే స్థూల ఆదాయం ‘ప్రాథమిక మినహాయింపు పరిమితి’కి కంటే తక్కువగా ఉంటే జరిమానా చెల్లించక్కర్లేదు. అయితే మినహాయింపు పరిమితి అనేది ఎంచుకున్న ఆదాయ పన్ను విధానాన్ని బట్టి ఉంటుంది. కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకారం.. ఆదాయ పన్ను పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది.  ఈ పరిమితి ఆదాయం ఉన్నవారు జరిమానా లేకుండానే ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. 


గడువు దాటితే వడ్డీ ఇలా..

జులై 31 లోపు పన్ను చెల్లించకపోతే ఆ స్థూల సొమ్ముపై 1 శాతం వడ్డీ చెల్లించాలి. కాబట్టి జులై 31 తర్వాత పన్ను చెల్లించేవారు వడ్డీ సహా పన్ను మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే.. నెలలో 5వ తేదీ తర్వాత పూర్తి ట్యాక్స్ చెల్లిస్తే.. ఆ నెలకు సంబంధించి పూర్తి స్థాయి వడ్డీ కట్టాలి. 


లాస్ క్యారీఫార్వర్డ్‌కు అవకాశం ఉండదు..

2021-22కి సంబంధించిన ఐటీఆర్‌ను జులై 31 లోగా దాఖలు చేయకపోతే ‘లాసెస్ క్యారీఫార్వర్డ్‌’కు (carry forward of losses) అవకాశం ఉండదు. అంటే ప్రస్తుతం ఏడాది ‘నికర కార్యనిర్వహణ నష్టాన్ని’(ఎన్‌వోఎల్) రాబోవు సంవత్సరాల నికర ఆదాయానికి జత చేయడానికి వీలుండదు. ఈ ప్రక్రియ ద్వారా ఆదాయ పన్నులను తగ్గించునే వీలుంటుంది. అయితే జులై 31లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే అందుకు అవకాశం ఉండదు. కాబట్టి వ్యాపార ఆదాయం లేదా క్యాపిటల్ గెయిన్స్ లేదా ఇంటి ఆస్తిపై యజమానికి రూ.2లక్షల లోపు నష్టాన్ని క్యారీఫార్వర్డ్ చేసే అవకాశం ఉండదు.


చివరి తేదీ కూడా తప్పితే?

డిసెంబర్ 31 తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే రిఫండ్, నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి క్షమాపణ కోరుతూ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్‌కి అప్పీల్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ అప్‌డేట్ కోసం కొత్త ఫారం ‘ఐటీఆర్ యూ’ సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఆలస్యానికి కారణం ఏంటో చెప్పాలి. కాగా ఆదాయ పన్ను విభాగం ప్రకారం.. జులై 25, 2022 నాటికి ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై 3 కోట్లకుపైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.

Updated Date - 2022-08-01T01:37:39+05:30 IST