పోలీసు భారతం ఏం మారిందని?

ABN , First Publish Date - 2021-08-11T06:46:00+05:30 IST

ఈ ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఆసేతు హిమాచలం ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆ వేడుకలలో పాల్గొనాలని...

పోలీసు భారతం ఏం మారిందని?

ఈ ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం 75వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఆసేతు హిమాచలం ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆ వేడుకలలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘ఆజాద్ కీ అమృత మహోత్సవ్’ పేరిట ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రధానమంత్రి సారథ్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా కూడా ఇదే హంగామా ప్రదర్శించారు. 1997 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. పార్లమెంటరీ సమావేశాల పవిత్రతను, ప్రమాణాలను కాపాడాలని, ప్రశ్నోత్తరాల సమయాన్ని భగ్నం చేయకూడదని, వెల్ లోకి దూసుకురాకూడదని, రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుతగలకూడదని తీర్మానాలు కూడా చేశారు. నేర పూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని, మరింత పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానాలను ఆమోదించిన పార్టీలే, ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ లే మన పార్లమెంటరీ ప్రమాణాలు దిగజారిపోవడానికి దోహదం చేశాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. ప్రస్తుత లోక్‌సభలో 43 శాతం సభ్యులు నేర చరితులు అని అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిపార్మ్స్ (ఏడీఆర్) సంస్థ చెప్పగా, దేశంలో ప్రజా ప్రతినిధులపై 4859 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా మంగళవారం నివేదిక సమర్పించారు.


పేదరికం, ఆకలి, పోషకాహారం, మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, పోషకాహారం, కాలుష్యరహిత ఇంధనం, ఉపాధి కల్పన, ఆర్థిక ప్రగతి మొదలైన వాటి విషయంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన అభివృద్ధి లక్ష్యాల సాధన విషయంలో మనం ప్రపంచంలో 117వ స్థానంలో ఉన్నాం. పేదరికం, ఆహార భద్రత విషయంలో ఇంకా సవాళ్లు ఎదుర్కొంటున్నాం. వినియోగదారుల ఖర్చు ఆధారంగా పేదరికాన్ని లెక్కించే సర్వేను జాతీయ గణాంక శాఖ విడుదల చేసి చాలాకాలమైంది. 1947లో భారత్ జీడీపీలో వ్యవసాయం వాటా 54శాతం కాగా ఇప్పటికీ 52శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏం మారిందని?


స్వాతంత్ర్యం తర్వాత మనం రూపొందించుకున్న భారత రాజ్యాంగం కూడా ఇప్పుడు ఆచరణలో ప్రాధాన్యత లేని ఒక పుస్తకంలా మిగిలిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానులేనని రాజ్యాంగంలోని 14వ అధికరణ; మత,జాతి, కులం, లింగ, జన్మస్థలం ఆధారంగా వివక్షను పాటించకూడదని 15వ అధికరణ; భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం కల్పించిన 19వ అధికరణ; జీవించే హక్కు కల్పించిన 21వ అధికరణ; అందరికీ సమాన న్యాయం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టే అధికారం కల్పించిన 32వ అధికరణ; అందరికీ సమాన న్యాయం లభించాలనే ఉద్దేశంతో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కల్పించిన 39- ఏ అధికరణ ఆచరణలో నిరర్థకంగా మారాయని ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో జరిగిన అనేక సంఘటనలు రుజువు చేస్తాయి. సిక్కుల, మైనారిటీల ఊచకోత, మత కల్లోలాలు, ఎమర్జెన్సీ, దళితులు, స్త్రీలపై అత్యాచారాలు వంటి అనేక ఘటనలు రాజ్యాంగంలోని డొల్లతనాన్ని నిరూపించాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై, మీడియాపై రాజద్రోహ నేరాలతో పాటు, జాతీయ భద్రతా చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టాలను మోపడం, ఆదివాసీలు, రచయితలు, మానవహక్కుల కార్యకర్తలను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైళ్లలో బంధించడం, పోలీసు వ్యవస్థ అత్యధికంగా అధికారంలో ఉన్నవారికి, సంపన్నులకు దాసోహం కావడం, సిబిఐ, ఎన్ ఐఏ వంటి సంస్థల్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ నేరాల రికార్డు బ్యూరో ప్రకారం ప్రతి ఏటా దేశంలో 35 వేలమంది స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు పతకాలు సాధిస్తే ప్రధానమంత్రి నుంచి ఇతర పెద్దల వరకు పుంఖానుపుంఖాలుగా ప్రకటనలు, ఉపన్యాసాలు గుప్పిస్తారు. కానీ భారత్‌కు పతకం సాధించి పెట్టిన ఒక క్రీడాకారిణి ఇంటి ముందు అగ్రకులాలకు చెందిన వారు గుమిగూడి కులపరంగా దూషిస్తే వారెవరూ బాహటంగా బయటకు వచ్చి ఖండించడానికి ధైర్యం చూపరు. దేశ రాజధానిలో శ్మశానంలో ఎయిర్ కూలర్ నుంచి నీరు తాగేందుకు వెళ్లిన ఒక దళిత బాలికపై అదే శ్మశానంలో అత్యాచారంచేసి దౌర్జన్యంగా కాల్చి బూడిద చేస్తే అధికారంలో ఉన్నవారు స్పందించరు. గత సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో 19ఏళ్ల ఒక దళిత స్త్రీ గడ్డి కోయడానికి వెళ్లినప్పుడు అగ్రవర్ణాలకు చెందిన వారు అత్యాచారం చేసి చంపేస్తే తల్లిదండ్రులు, బంధువులను కూడా రానివ్వకుండా పోలీసులే అర్థరాత్రిపూట ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు! ఎస్‌సిలపై అత్యధిక సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అని గత మార్చిలో అప్పటి హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా లోక్‌సభలో వివరించారు.


ఇక మన దేశంలో పోలీసు కస్టడీలో మరణాల గురించి, అమలు అవుతున్న హింసాకాండ గురించి చెప్పనక్కర్లేదు. పోలీసు కస్టడీల్లో హింసాకాండ, ఠాణాల్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి సాక్షాత్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ రమణ తరచు చేస్తోన్న వ్యాఖ్యలతో, గతంలో మానవహక్కులపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై సంచలనాత్మక తీర్పులు, వ్యాఖ్యలు వెలువరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ భగవతి, జస్టిస్ వెంకటాచలయ్య, న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ వంటి ప్రముఖుల స్థాయికి చేరుకున్నారని చెప్పక తప్పదు.


పోలీసు కస్టడీలో హింస గురించి ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక కీలక తీర్పులను వెలువరించింది. 1986లో రిటైర్డ్ న్యాయమూర్తి డికె బసు రాసిన లేఖను పిటిషన్‌గా స్వీకరించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భగవతి పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టుచేసినప్పుడు అనుసరించాల్సిన నిబంధనలను ఉల్లేఖించారు. ఎవరు అరెస్టు చేశారో రికార్డు చేయాలని, అరెస్టు చేసినప్పుడు సాక్షులు ఉండాలని, లాకప్‌లో ఉంచినప్పుడు తన బంధువులను, స్నేహితులను, న్యాయవాదిని కలుసుకునే అవకాశం కల్పించాలని, ప్రతి 48 గంటలకోసారి వైద్యపరీక్షలు చేయించాలని, అరెస్టు చేసిన వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని, నోటీస్ బోర్డుపై ఆ విషయం వెల్లడించాలని ఆయన చెప్పారు. ఇదే జస్టిస్ భగవతి 1983లో షీలా బర్సే అన్న జర్నలిస్టు దాఖలు చేసిన కేసులో బొంబాయి సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న మహిళా ఖైదీలకు న్యాయసహాయం అందించమని ఆదేశించారు.పేదలకు, అణగారిన వారికి రాజ్యాంగంలోని 39-ఏ క్రింద మాత్రమే కాక 14, 21 అధికరణల క్రింద కూడా న్యాయసహాయం అందించడం రాజ్యాంగం విధించిన కర్తవ్యంగా ఆయన స్పష్టం చేశారు. 1996లో జోగిందర్ కుమార్ అనే న్యాయవాదిని పోలీసులు అక్రమంగా నిర్బంధించిన కేసులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య కూడా అరెస్టు విషయంలో పోలీసులు అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు. అరెస్టు చేసే అధికారం పోలీసులు పాల్పడే అవినీతిలో ప్రధాన భాగమైందన్నారు. పోలీసులు చేసే చట్టాల ఉల్లంఘన పట్ల సుప్రీంకోర్టు ఎంత మాత్రం మౌన ప్రేక్షక పాత్ర వహించబోదని స్పష్టం చేసిందని అప్పటి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేకే వేణుగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఆయనే ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో భారత అటార్నీ జనరల్!


ఇలాంటి ఎన్నో తీర్పులు వచ్చినా పోలీసుల వైఖరిలోనూ, కస్టడీలో హింసాకాండ విషయంలోనూ పెద్దగా మార్పులు లేనందువల్లే జస్టిస్ రమణ తాజాగా మళ్లీ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్ పేరుతో అభాగ్యులను పోలీసులు కొట్టి చంపిన కేసులు అనేక రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చాయి. జస్టిస్ రమణ అన్నట్లు న్యాయసహాయం పొందేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, కోర్టులు ఇచ్చిన తీర్పుల గురించి ప్రజలకు, పోలీసులకు తెలియాల్సి ఉన్నది. కేవలం విచారణ సందర్భంగానే కాక పోలీసు స్టేషన్ల లోనూ, జైళ్లలోనూ నిందితులకు న్యాయసేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం కలుగుతుంది. న్యాయసేవల అథారిటీల తోడ్పాటుతో పోలీసు స్టేషన్లలో న్యాయసహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి రూపొందించిన మార్గదర్శకసూత్రాలను భారత ప్రభుత్వం ఆమోదించేలా చేయడం తక్షణ కర్తవ్యం. లేకపోతే స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా అరాచక, అమానుష దుష్కృత్యాలు కొనసాగుతూనే ఉంటాయి.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-08-11T06:46:00+05:30 IST