ఉత్తరాంధ్రను ఏం ఉద్ధరించారు?

ABN , First Publish Date - 2022-09-15T10:31:11+05:30 IST

అమరావతి రాజధాని రైతులు తమ సమస్యలు ప్రజల దృష్టికి తెచ్చేందుకు, ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు కోరేందుకు అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్ర చేపడితే...

ఉత్తరాంధ్రను ఏం ఉద్ధరించారు?

అమరావతి రాజధాని రైతులు తమ సమస్యలు ప్రజల దృష్టికి తెచ్చేందుకు, ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు కోరేందుకు అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్ర చేపడితే దానిపై వైసీపీ మంత్రులు, నాయకులు ఇష్టానుసారం నోరు పారేసుకొంటున్నారు. ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటూ ప్రాంతాల మధ్య విద్వేషం రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకొంటున్నారని మంత్రులు అమరావతిపై విషం కక్కుతున్నారు. రైతుల పాదయాత్రను దండయాత్రగా, ఉన్మాదియాత్రగా పోల్చడం గర్హనీయం. జగన్ రెడ్డి పాదయాత్రలు చేస్తే ప్రజల కోసం చేసినట్టా, భూములు కోల్పోయిన రైతులు పాదయాత్ర చేస్తే ఉన్మాదియాత్ర, దండయాత్ర అవుతుందా? అమరావతి దెయ్యాల రాజధాని అని మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకప్పటి దేవతల రాజధాని అమరావతిని దెయ్యాల రాజధాని అనడం వారి అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం.


వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ మంత్రులు, నాయకులు తమ మూడున్నరేళ్ల పరిపాలనలో ఉత్తరాంధ్రను ఉద్ధరించింది ఏమిటి? అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటే ఉత్తరాంధ్రలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తి చేసి అదనంగా ఒక్క ఎకరానికి అయినా సాగునీరు ఇచ్చారా? కొత్తగా ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క రోడ్డు అయినా నిర్మించారా? ఉత్తరాంధ్రకి కేంద్రం ద్రోహం చేస్తున్నా జగన్ ప్రభుత్వానిది ప్రేక్షక పాత్రే. పెట్రో యూనివర్సిటీ వంటి సంస్థల నిర్మాణం పూర్తి కాలేదు. విశాఖ మెట్రో రైలు అటకెక్కింది. గిరిజన యూనివర్సిటీ అతీగతీ లేదు. రైల్వే జోన్ అడ్రస్ లేదు. ఇక ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఒక ప్రహసనంగా మిగిలింది. ఉత్తరాంధ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును పూర్తిగా అమ్మేస్తూ ఉత్తరాంధ్రకి కేంద్రం ద్రోహం చేస్తున్నా జగన్ నోరు మెదపడం లేదు. ఉత్తరాంధ్రకు జీవనాడిగా నిలిచే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రకటనలకే పరిమితమైంది తప్ప అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద నదిగా ఉన్న వంశధారపై రెండవ దశ నిర్మాణం, మహేంద్ర తనయపై ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు ప్రభుత్వ ప్రాధాన్యతల లిస్టులో ఉన్నా, ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. వంశధారపై ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్, ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవడం మినహా పనిలో పురోగతేమీ లేదు. వాస్తవంగా ఈ రెండవ దశ నిర్మాణానికి కేంద్ర ట్రిబ్యునల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. విజయనగరం జిల్లాలో అనేక సంవత్సరాలుగా పెండింగులో ఉన్న జంఝావతి, తారకరామ తీర్థ సాగర్‌ ప్రాజెక్టులు పడకేశాయి. జిల్లాలోని తోటపల్లి కాలువల నిర్మాణం కూడా చివరి వరకు పూర్తి కాలేదు. ఇలా సాగునీటి ప్రాజెక్టులలో ఈ మూడున్నరేళ్ల కాలంలో పురోగతేమీ లేదు.


ఉత్తరాంధ్రలో ఉపాధి కల్పించే పారిశ్రామికీకరణ కూడా పడకేసింది, పాదయాత్రలో మూతబడ్డ జూట్ పరిశ్రమను తెరిపిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జూట్‌, చక్కెర పరిశ్రమలను తెరిపించకపోగా విశాఖ జిల్లాలోని చిట్టివలస జూట్‌ మిల్లును పూర్తిగా మూసేసేలా సెటిల్మెంటు చేశారు. నెల్లిమర్ల జూట్‌ మిల్లు యాజమాన్యం ఆ మధ్య లాకౌట్‌ విధించింది. ఉత్తరాంధ్రలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన రంగమయిన జూట్‌ పరిశ్రమ నేడు పూర్తిగా చతికిలబడి ఉపాధి కల్పన ఉత్తుత్తిగానే మిగిలిపోయింది. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఫార్మా, రసాయన పరిశ్రమల నుంచి రక్షణకు చర్యలేమీ లేవు. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుందని మభ్యపెట్టి పెద్దఎత్తున విశాఖలో విలువైన భూములు కబ్జాలు చేశారు. విశాఖ నగరంలోని తహశీల్దార్‌ కార్యాలయం, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌ వంటివన్నీ ఖాళీ చేయించి మరీ 15 ఎకరాల భూమిని వేలానికి పెట్టాలని నిర్ణయించారు. గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికున్న 10.39 శాతం వాటాను అదాని సంస్థకు అమ్మేశారు. విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను జగన్ ప్రభుత్వం సుతిమెత్తగా వ్యతిరేకించడం తప్ప, తీవ్రంగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ వ్యాధి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి స్వయంగా ముఖ్యమంత్రే 2019లో శంకుస్థాపన చేసినా నేటికీ పునాది దశ దాటి ముందుకు వెళ్లలేదు. ప్రతిష్టాత్మక విజయనగరం ఎంఆర్‌ కాలేజి మూసివేతకు యాజమాన్యానికి ప్రభుత్వం సహకరిస్తోంది. గిరిజన ప్రాంతంలో కలుషిత నీటితో ప్రజల మరణిస్తున్నారు. రహదార్లు లేకపోవడంతో నాటు పడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు లోనవుతున్నారు, డోలి మోతలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా పాడేరు, అనకాపల్లి, విజయనగరాలలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు మంచిదే కానీ, వీటికి సరిపడా నిధులు సమకూర్చలేదు.


రాష్ట్ర ప్రజల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు, అభివృద్ధి నిధులు వంటివి సాధించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేకుండా తన కేసుల కోసం కేంద్రానికి సాగిలపడి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ, మూడు రాజధానులు వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ ముఖ్యమంత్రి జగన్నాటకాలు ఆడుతున్నారు. మూడు రాజధానులపై చట్టం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, మూడు రాజధానులే తమ విధానమని మంత్రులు మాట్లాడుతూ కోర్టు తీర్పును ఉద్దేశపూర్వకంగానే ధిక్కరిస్తున్నారు. అమరావతిపై ఎన్ని పిచ్చికూతలు కూసినా, ఎంత అక్కసు వెళ్లగక్కినా రాజధాని మార్చడం సాధ్యం కాదని గుర్తించాలి. రైతులు చేస్తున్నది దండయాత్ర కాదు, ధర్మ యాత్ర అని తెలుసుకోవాలి.

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2022-09-15T10:31:11+05:30 IST