బీఏఎస్‌ ఎందుకు ఎత్తేశారు

ABN , First Publish Date - 2022-05-29T06:58:52+05:30 IST

వైసీపీ మూడేళ్ల పాలనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు, ఆ పార్టీకి ఓటేసిన ఆ సామాజికవర్గ ప్రజలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

బీఏఎస్‌ ఎందుకు ఎత్తేశారు

మూడేళ్లలో ఏం చేశారప్పా!

విదేశీ విద్యకు సాయం తీసేశారు

ఆదరణ లేదు.. కార్పొరేషన్ల రుణమూ లేదు

ఒక్క పరిశ్రమా రాలేదు.. వచ్చినవి పోయాయి

అన్న క్యాంటినలు మూసేసి నోటికాడ ముద్ద తీయలేదా...?

నేడు అనంతలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర

మంత్రులను నిలదీస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు


(ఆంధ్రజ్యోతి, అనంతపురం)

వైసీపీ మూడేళ్ల పాలనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు, ఆ పార్టీకి ఓటేసిన ఆ సామాజికవర్గ ప్రజలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక ఏం ఒరగబెట్టారని ప్రశ్నిస్తున్నారు. నవరత్నాల పేరుతో నగదు పంపణీ తప్ప, తమ జీవన ప్రమాణాల పెంపునకు ఏమైనా చేశారా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టితో సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతకు అండగా నిలిచారా..? పెట్టుబడి సాయం పేరిట కొంత డబ్బు ఖాతాలో వేయడం తప్ప..? డ్రిప్పు సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు కదా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను నిధులివ్వకుండా నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా..? బీఏఎస్‌ పథకాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యకు దూరం చేయలేదా..? విదేశీ విద్య పథకాన్ని రద్దు చేసి, విదేశాల్లో చదువుకునే ఆశలను చిదిమేసింది మీరు కాదా...? అన్న క్యాంటినలు రద్దు చేసి పేదోడి నోటికాడి ముద్ద తీయలేదా..? బలహీన వర్గాలకు ఆసరాగా ఉండే ఆదరణ పథకాన్ని ఎత్తేసింది నిజం కాదా..? పండుగ పూట పస్తులుండకూడదని అమలు చేసిన రంజాన తోఫా, సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలను రద్దు చేశారు కదా..? దుల్హాన పథకాన్ని రద్దు చేశారు. కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు ఏమయ్యాయి..? ఉన్న పరిశ్రమలను సాగనంపారేగాని, ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా..? యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారా...? ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నె న్నో వైఫల్యాలు. ఇవన్నీ కొన్ని వర్గాల ప్రజల ప్రశ్నలు కాదు. అన్ని వర్గాలూ ప్రభుత్వంపై సంధిస్తున్న బాణాలు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు అనంతపురంలో ఆదివారం సభ నిర్వహిస్తున్నారు. ఇదే వేదిక నుంచి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మంత్రులను జనం కోరుతున్నారు. 


విదేశీ విద్యకు మంగళం

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని ప్రవేశపెట్టింది. విదేశాల్లో ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీ తదితర ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 40 మందికిపైగా ఎస్సీ విద్యార్థులు, 15 మంది ఎస్టీ విద్యార్థులు టీడీపీ హయాంలో లబ్ధి పొందారు. విమాన టికెట్లు, బోర్డింగ్‌ పాసుల ఖర్చులనూ గత ప్రభుత్వం భరించింది. 2018లో ఈ మొత్తాన్ని రూ.15 లక్షలకు పెంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఈ పథకానికి మంగళం పాడింది. 


బీఏఎస్‌ రద్దు

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం కింద గత ప్రభుత్వం 6 వేల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యనందించింది. ఒక్కో విద్యార్థికి రూ. 30 వేలు ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువుకోవాలన్న  ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఆశలను చిదిమేసింది. 


కార్పొరేషన్లు నిర్వీర్యం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం గత ప్రభుత్వం రూ.వేల కోట్ల సబ్సిడీ రుణాలు ఇచ్చింది. 50 శాతం సబ్సిడీతో 20 వేల మంది ఎస్సీలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు రుణం ఇచ్చింది. ఎస్టీల్లో 7 వేల మందికి, మైనార్టీల్లో 5 వేల మందికి, బీసీల్లో 40 వేల మందికి లబ్ధి చేకూర్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమయ్యాయి. మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా ఎవరికీ రుణం మంజూరు చేయలేదు.


సైకిల్‌ ఏదీ..?

బడికొస్తా పథకం ద్వారా బడికి వెళ్లే 8, 9వ తరగతి విద్యార్థినులకు గత ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు అందజేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలో 21 వేల మంది విద్యార్థినులు సైకిళ్లు అందుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆ పథకాన్ని రద్దు చేశారు. 


ప్రోత్సాహం కరువు

టీడీపీ హయాంలో వ్యాపారం, పాడి పరిశ్రమల ఏర్పాటు కోసం వెయ్యి మందికి పైగా ఎస్సీ, ఎస్టీ యువతకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేశారు. గొర్రెల పెంపకం, పాడిపరిశ్రమ, గార్మెంట్స్‌, కిరాణం, జనరల్‌ స్టోర్స్‌ తదితరాలతో యువత సొంతకాళ్లపై నిలబడింది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ రుణాలు అందాయి. వైసీపీ అధికారంలోకి రాగానే నిలిపేశారు. 


నిరాదరణ

వృత్తులపై ఆధారపడి జీవించేవారికి టీడీపీ ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేసింది. బీసీ కార్పొరేషన ద్వారా ఈ పథకాన్ని అమలు చేశారు.  ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్‌మిషన్లు, తోపుడు బండ్లు, సెలూన సామగ్రి, కుట్టు మిషన్లు, సైకిళ్లు, మగ్గాలు, డ్రిల్టింగ్‌ మిషన ఇచ్చింది. కొన్నింటి కొనుగోలుకు రూ.30 వేలు చొప్పున రుణం ఇచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే, ఆ పథకం పత్తా లేకుండాపోయింది. 


ప్రోత్సాహకం నిలుపుదల

కులాంతర వివాహం చేసుకున్న బీసీ, ఓసీ సామాజికవర్గాల వారికి రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు రూ.50 వేలు టీడీపీ హయాంలో నగదు ప్రోత్సాహకం అందింది. ముస్లిం మైనార్టీలకు దుల్హాన పథకం ద్వారా రూ.50 వేలు అందింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక  వీటన్నింటికీ తిలోదకాలిచ్చింది. 


ఇళ్లు కట్టించరా..?

ఉమ్మడి జిల్లాలో టీడీపీ ప్రభుత్వ హయాంలో  41 వేల మందికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర పేద వర్గాలకు ఇళ్లు మంజూరు అయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి 32,371 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. వైసీపీ మూడేళ్ల పాలనలో గృహ నిర్మాణాల పట్ల ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. 80 వేలకుపైగా ఇళ్లను మంజూరు చేశారుగాని, ఇప్పటి వరకూ 6,276 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన వాటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 


డ్రిప్పు పథకానికి తుప్పు

ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 7,575 మంది ఎస్సీ రైతులకు 7,680.74 హెక్టార్లకు, 5,118 మంది ఎస్టీ రైతులకు 5,424.75 హెక్టార్లకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్‌ మంజూరు చేశారు. ఆ వర్గాలు వ్యవసాయంపై మక్కువ పెంచుకునేలా ప్రోత్సహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అటకెక్కించారు. మూడేళ్ల తరువాత కొత్త నిబంధనలతో  తెరమీదకు తెచ్చారు. 


ఉచిత విద్యుతకు మంగళం

జిల్లాలో 1.58 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత వినియోగదారులు ఉన్నారు. వీరికి అందే ఉచిత విద్యుతకు మంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. పట్టణాలు, నగరాల్లో ఉండే దళితులకు సబ్సిడీ వర్తించదట. దళితవాడల్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారట. విద్యుతశాఖ అధికారులు సర్వే చేసి, కోతలకు సిద్ధమౌతున్నారు. 


సాగనంపడమే..

టీడీపీ హయాంలో జిల్లాలో ప్రతిష్టాత్మక కియ పరిశ్రమ ఏర్పాటైంది. వైసీపీ  అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పైగా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల  కారణంగా జాకీ పరిశ్రమ జిల్లా నుంచి తరలిపోయింది.


అంతా సంక్షోభమే..

ఉమ్మడి జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. మూడేళ్ల పాలనలో మరింత సంక్షోభం తప్ప.. అభివృద్ధి శూన్యం. హంద్రీనీవా ద్వారా సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సింది. కానీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. హంద్రీనీవాకు సమాంతర కాలువ తవ్వుతామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. నవరత్నాల పేరుతో ఏడాదికోసారి ఆయా వర్గాల ప్రజల ఖాతాలలో రూ.10 వేలు, రూ.15 వేలు జమ చేయడం తప్ప, సుస్థిర అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. అందుకే.. ఆ వర్గాల ప్రజలు ‘వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందప్పా..? నవరత్నాలు తప్పా..? అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-29T06:58:52+05:30 IST