బీజేపీని ఇందిరాయే ఏం చేయలేకపోయారు.. కేసీఆర్‌ ఎంత?

ABN , First Publish Date - 2022-07-01T05:38:22+05:30 IST

భారతీయ జనతాపార్టీని ఇందిరాగాంధీయే ఏం చేయలేకపోయారని, తమకు కేసీఆర్‌ ఎంత అని జార్ఖండ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు దీపక్‌ ప్రకాశ్‌ అన్నారు. గురువారం ఆయన గజ్వేల్‌, తూప్రాన్‌ పట్టణాల్లో నిర్వహించిన బీజేపీ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

బీజేపీని ఇందిరాయే ఏం చేయలేకపోయారు.. కేసీఆర్‌ ఎంత?
కొండపాక మండలం సిరసనగండ్లలో కార్యకర్తలతో భోజనం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు దీపక్‌ ప్రకాష్‌

2023లో యుద్ధం గెలవాలంటే బూత్‌ కమిటీలే కీలకం

జార్ఖండ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు తోడు దొంగలు

బీజేపీ జార్ఖండ్‌ రాష్ట్ర  అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు దీపక్‌ ప్రకాశ్‌


జిల్లాలో కాషాయ సందడి నెలకొన్నది. హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు సన్నాహకంగా, జూలై 3న పరేడ్‌ గ్రౌండ్‌లో  నిర్వహించనున్న విజయ సంకల్ప సభ విజయవంతం కోసం నియోజకవర్గాల్లో సంపర్క్‌ అభియాన్‌  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమించిన బీజేపీ అగ్రనేతలు ఈ సమావేశాల్లో పాల్గొని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. సిద్దిపేట నియోజకవర్గంలో భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత సారంగి, గజ్వేల్‌ అసెంబ్లీ సెగ్మంట్‌లో జార్ఖండ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దీపక్‌ ప్రకాశ్‌, దుబ్బాకలో మిజోరాం మాజీ గవర్నర్‌ కె.రాజశేఖరన్‌, హుస్నాబాద్‌ పరిధిలో కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ఎంపీ దేబాశ్రీచౌదరి పర్యటించారు.


గజ్వేల్‌/తూప్రాన్‌/కొండపాక, జూన్‌ 30: భారతీయ జనతాపార్టీని ఇందిరాగాంధీయే ఏం చేయలేకపోయారని, తమకు కేసీఆర్‌ ఎంత అని జార్ఖండ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు దీపక్‌ ప్రకాశ్‌ అన్నారు. గురువారం ఆయన గజ్వేల్‌, తూప్రాన్‌ పట్టణాల్లో నిర్వహించిన బీజేపీ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో జరుగనున్న యుద్ధంలో గెలవాలంటే తెగించి కొట్లాడాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని, ఇందుకు బూత్‌ కమిటీలు కీలకంగా పనిచేయాలని కోరారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని, టీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పార్టీ అని విమర్శించారు. ఫాంహౌజ్‌ నుంచే తెలంగాణ సీఎం పాలన చేస్తున్నారని, ఆయన కుటుంబం కోసమే ఆరాటపడుతున్నారని దీపక్‌ ప్రకాశ్‌ విమర్శించారు. బీజేపీ ఆదివాసీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే కేసీఆర్‌ యశ్వంత్‌సిన్హాకు మద్దతు పలుకుతున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలకు, ఆదివాసీలకు వ్యతిరేకమన్నారు. తెలంగాణలో నడుస్తున్నది సర్కారు కాదని సర్కస్‌ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాటకారి ప్రభుత్వం పాలన సాగుతుందని, ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. తెలంగాణ సీఎం, జార్ఖండ్‌ సీఎం దోస్తులుగా మారారని, వారిద్దరూ తోడు దొంగలని ఆరోపించారు. గురువారం రాత్రి దీపక్‌ ప్రకాశ్‌ కొండపాక మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ నందాల శ్రీనివాస్‌ ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు.


ప్రాజెక్టుల పేరిట ప్రజాధనం దుర్వినియోగం

సిద్దిపేట/నంగునూరు : ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత సారంగి అన్నారు. గురువారం ఆమె సిద్దిపేట పట్టణం, నంగునూరు మండలం సిద్దన్నపేటలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయడం లేదని దుయబట్టారు.  కుటుంబ పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని ఆరోపించారు.  రాష్ట్రంలో బీజేపీ గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, నంగునూరు మండల శాఖ అధ్యక్షుడు బెదురు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


కార్యకర్తలు అధికారమే లక్ష్యంగా పనిచేయాలి 

దుబ్బాక : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని మిజోరం మాజీ గవర్నర్‌ కె.రాజశేఖరన్‌ పిలుపునిచ్చారు. గురువారం దుబ్బాకకు విచ్చేసిన ఆయనకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజశేఖరన్‌ మాట్లాడుతూ రెండురోజులపాటు దుబ్బాక నియోజకవర్గంలోనే ఉంటానని, బూత్‌స్థాయి సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. దుబ్బాకలోని దళితమోర్చ మున్సిపాలిటీ అధ్యక్షుడు మోత్కుపల్లి భద్రయ్య(బద్రి) ఇంట్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ఆయన భోజనం చేశారు. 


విజయ సంకల్ప సభకు భారీగా తరలిరావాలి

హుస్నాబాద్‌/కోహెడ : ఈ నెల 3వ తేదీన సికిద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే విజయ సంకల్ప సభకు హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన రాయ్‌గంజ్‌ ఎంపీ దేబాశ్రీచౌదరి పిలుపునిచ్చారు. గురువారం హుస్నాబాద్‌, కోహెడలో నిర్వహించిన సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆమె వెంట దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుపాశ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.




Updated Date - 2022-07-01T05:38:22+05:30 IST