ఏ మౌలిక సదుపాయాలు ముఖ్యం?

ABN , First Publish Date - 2022-02-15T06:36:55+05:30 IST

ప్రాథమిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ మదుపులకు 2022–23 కేంద్ర బడ్జెట్ గణనీయమైన ప్రాధాన్యమిచ్చింది. పెద్ద, చిన్న మౌలిక సదుపాయాల మధ్య లేదా బడా వ్యాపార సంస్థల ఉత్పత్తి పెరుగుదల, పేద ప్రజల...

ఏ మౌలిక సదుపాయాలు ముఖ్యం?

ప్రాథమిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ మదుపులకు 2022–23 కేంద్ర బడ్జెట్ గణనీయమైన ప్రాధాన్యమిచ్చింది. పెద్ద, చిన్న మౌలిక సదుపాయాల మధ్య లేదా బడా వ్యాపార సంస్థల ఉత్పత్తి పెరుగుదల, పేద ప్రజల నుంచి డిమాండ్‌ను పెంపొందించడం మధ్య ఒక సమతౌల్యతను సృష్టించాల్సిన అవసరముంది. ఉదాహరణకు మురికివాడలలో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వసతులు, గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలో ఉచిత వై-ఫై, మరిన్ని బస్ సర్వీస్‌లు ఇత్యాది సదుపాయాలు పేద ప్రజల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. కాగితపు సంచులు, అగర్‌బత్తీలు మొదలైన వాటిని తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసి బడా వ్యాపార సంస్థలతో పోటీపడగల శక్తిని వారికి ఆ సదుపాయాలు సమకూరుస్తాయి. 


బస్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటే చిన్నతరహా తయారీదారులు తమ ఉత్పత్తులను శీఘ్రగతిన మార్కెట్‌కు తీసుకువెళ్లగలుగుతారు. తద్వారా బడా వ్యాపారస్తుల యంత్రోత్పత్తులతో వారు పోటీపడగలుగుతారు. అదేవిధంగా చిన్న పట్టణాలలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని సమకూరిస్తే అక్కడి నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఆన్‌లైన్ ట్యూషన్లతో ఉపాధి పొందగలుగుతారు. ప్రస్తుతం నెలసరి ఆదాయం కేవలం రూ.20 వేలు మాత్రమే ఉన్న డాక్టర్లు టెలిమెడిసిన్ సేవల ద్వారా మరింత అధికంగా ఆర్జించవచ్చు. అటువంటి మౌలిక సదుపాయాలు పేదల నుంచి డిమాండ్‌ను ఉత్పన్నం చేస్తాయి. బడా వ్యాపార సంస్థల అధికోత్పత్తులను సైతం లాభదాయకమయ్యేలా చేస్తాయి.


ఈ నేపథ్యంలో, పెట్టుబడులను పెంపొందించడానికి చేపడుతున్న చర్యలు ఎందుకు సత్ఫలితాల నివ్వడంలేదో మనం అర్థం చేసుకోవాలి. ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థ పురోగతిని వేగవంతం చేస్తాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఉత్పత్తితో ముడివడివున్న ప్రోత్సాహకాలను తయారీ రంగానికి అందించడం గురించి ఆమె నొక్కి చెప్పారు. ఆ చర్య వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడం సాధ్యమవుతుందని ఆమె అన్నారు. అయితే, గత ఏడు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వస్తూత్పత్తిరంగంలో ఉద్యోగాలు అంతకంతకూ క్షీణించిపోతున్నాయి. ఇది మనం విస్మరించలేని వాస్తవం ఉత్పత్తి కార్యకలాపాలలో రోబోల, స్వయం చాలకయంత్రాల పాత్ర పెరిగిపోవడమే అందుకు ప్రధానకారణం. 


ఉత్పత్తి కార్యకలాపాలలో నిపుణ కార్మికులను కాకుండా రోబోలను‍ ఉపయోగించుకోవడమే లాభదాయకమని పారిశ్రామికవేత్తలు విశ్వసిస్తున్నారు. ఈ పరిస్థితిలో పరిశ్రమలకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సహకాలు, పరిశ్రమలు మరింత అధికంగా సరుకులను ఉత్పత్తి చేసినా ఉద్యోగాల సృష్టి జరగడమనేది కల్ల. డిమాండ్ పెరగదు. ఉత్పత్తి చేసిన సరుకులు కంపెనీల గోదాంలలోనే ఉండిపోవడం అనివార్యమవుతుంది.


‘ట్రి కిల్ డౌన్ థియరీ’ (ఉన్నతవర్గాల వారికి, వాణిజ్య, పారిశ్రామికవర్గాల వారికి ఇచ్చే రాయితీలు మొత్తం మీద ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తికి ప్రోత్సాహకరంగా ఉంటాయని, ఇది ఆర్థికాభివృద్ధికి, సంపద సృష్టికి దారితీస్తుందని, దీని ఫలాలు సాధారణ ప్రజలు అందరికీ అందుతాయని చెప్పే సిద్ధాంతం) మీద ఆధారపడడం చాలా ప్రమాదకరమని దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తరచు అనేవారు. ప్రాథమిక సదుపాయాల రంగంలో మదుపులు ఇతోధికం చేయడం, బడా వ్యాపార సంస్థలకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించడం మాత్రమే సరిపోదు. సంపన్నుల సానుకూల, పేదల అనుకూల ప్రాథమిక సదుపాయాల మధ్య ఒక సమతౌల్యతను సృష్టించవలసిన అవసరం ఎంతైనా ఉంది.


వై-ఫై, బస్సులు మొదలైన పేదల అనుకూల మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా మరింతగా మదుపులు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే భవిష్యత్తులో డిమాండ్ ప్రధానంగా సేవల రంగం నుంచి మాత్రమే వస్తుంది. డిమాండ్ పెరుగుదలకు తయారీ రంగం పెద్దగా ఆస్కారం కాబోదు. ఒక కుబేరుడు, ఒక నిరుపేద మాదిరిగానే రోటీలను మాత్రమే భుజిస్తాడు. కాకపోతే పేదవాడు, సంపన్నుడి కంటే తక్కువ రోటీలను మాత్రమే తింటాడు. ప్రజల ఆదాయాలు పెరిగినప్పటికీ సరుకులకు డిమాండ్ పెరిగే అవకాశం లేదు. సేవల విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. సంపన్నులకు టెలి మెడిసిన్, ఆన్‌లైన్ ట్యూషన్స్, సినిమాలు, అనువాదాలు మొదలైన సేవలు చాలా అవసరం. ఆన్‌లైన్ ట్యూషన్లు, టెలి మెడిసిన్ మొదలైన సేవలను అటోమేషన్ చేయడం అసాధ్యం. కృత్రిమ మేధ ద్వారా కూడా చేయలేం. ఆంగ్ల భాషలో ఉత్కృష్ట కౌశలాలు ఉన్న యువజనులు మన దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు. వీరు ఆయా సేవలను ప్రపంచ స్థాయిలో అందించగలరు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి వ్యూహంలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంపన్నుల అనుకూల మౌలిక సదుపాయాలలో కంటే పేదల అనుకూల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం మరింతగా పెట్టుబడులు పెట్టాలి. మరీ ముఖ్యంగా పేదలు తమ సేవలను ఇంటర్నెట్ ద్వారా ఎగుమతి చేయడానికి వీలు కల్పించే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అగ్రప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల బడా వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేసే సరుకులకు సైతం మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ఉత్పత్తితో ముడివడి ఉన్న ప్రోత్సాహకాలతో నిమిత్తం లేకుండానే ఆయా సరుకులను ఉత్పత్తి చేసేందుకు సంపన్నులు మరింతగా మదుపు చేస్తారు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2022-02-15T06:36:55+05:30 IST