ఆప్టిమిజం కంటే బాప్టిజం ఏముంట‌ది?...

ABN , First Publish Date - 2021-07-07T06:04:18+05:30 IST

నీ కంటే ధ‌న్యుడెవ‌రు తండ్రీ! ప‌రువ‌మంతా పోరుజ‌నంతో ప‌రుగెత్తి పండై రాలేట‌ప్పుడు రాచ‌పుండు రాజ్యం తీరు...

ఆప్టిమిజం కంటే బాప్టిజం ఏముంట‌ది?...

నీ కంటే ధ‌న్యుడెవ‌రు తండ్రీ!

ప‌రువ‌మంతా పోరుజ‌నంతో ప‌రుగెత్తి

పండై రాలేట‌ప్పుడు రాచ‌పుండు రాజ్యం తీరు

మేడిపండు పురుగుల లుక‌లుక‌లు విప్పి చెప్పిన నీ కంటే ధ‌న్యుడెవ‌రు!

చావుదేముంది? దిక్కుమాలింది... ఏ దిక్కునుండైనా త‌రుముకొస్తుంది

ఎవ‌డూ ఆయుష్షు గురిగిలో దాచి దొర‌క‌కుండా బ‌త‌క‌లేడు

ఎక్క‌డి తిరుచ‌రాపల్లి! ఎక్క‌డి జార్కండ్!

ఎక్క‌డి శిలువ మోసే కాథలిక్ పూజారి!

ఎక్క‌డి శిలువ వేయ‌బ‌డ్డ అడ‌విబిడ్డ‌ల హ‌క్కుల కోసం

న‌డిరోడ్డుపై బైటాయించే ముళ్ళ కిరీటదారి!

తండ్రీ! జీవించే దానిదేముంది!

గ‌డియారం ముళ్ళును జ‌ర‌ప‌డం త‌ప్ప

ఒక్క ముళ్ళకంప‌ని పెరికి ప‌రికిపండ్ల‌ని, పూల‌గుత్తులను విస‌ర‌ని నిష్ఫలాలెన్నో?

నువ్వున్నావు! స్వ‌కార్యం, దైవ‌కార్యం 

పోగేసుకునే అనంత ధ‌నరాశుల్ని వ‌దిలి...

జీవన చ‌ర‌మాంకంలో రాశులు రాశులుగా చావును ధిక్క‌రించ‌డాన్ని 

మా ముందు పోసి పోరు ద్రవ్య‌రాశిగా మిగిలావు

సైతాన్ శిథిలాల‌యంలో ఉండ‌దు... శిథిల‌మైన రాజ్య‌వ్యవ‌స్థ‌లో ఉంట‌ది

శిలువేయ‌డానికి, చిదిమేయడానికి పెద్ద పెద్ద కుట్ర‌లేమి అవ‌స‌రం లేదు

వాళ్ళు హ‌క్కుల పున్న‌మిని మింగేయాల‌నుకున్నారు, 

          మిన్నాగులై బుస‌కొట్టిండ్రు

ఎక్క‌డి భీమ్ కోరేగామ్‌!?...

ఎక్క‌డి ఆదివాసి కొండదాపు గ్రామ‌మ్‌!?

వృద్ధశిఖరంపై రాజ్యం మీద యుద్ధం చేసిండ‌ని కేసు పెట్టిండ్రు...

మ‌నుషుల హక్కులపై ప్రేమ ఉంటే.... ఎంత ప‌గ ఉంట‌దో....

గ‌రిమ‌తో నిటారుగా నిల‌బ‌డితే ఎంత ప‌గ‌బ‌డుత‌దో 

        స్టాన్లీ చెర‌తో తేలిపోయింది

స్టాండ్‌అప్‌.. టు సాల్యూట్ స్టాన్లీ స్వామి

స్టోన్‌ హార్డ్ కైండ్ ‌హార్ట్ జ‌నస్వామి.

డా. చెరుకు సుధాక‌ర్‌

Updated Date - 2021-07-07T06:04:18+05:30 IST