అన్ని రకాల కణితులుబ్రెస్ట్‌ కేన్సర్‌ కాదు

Oct 27 2020 @ 12:20PM

ఆంధ్రజ్యోతి(27-10-2020)

కణాల ఎదుగుదలను నియంత్రించే, ఆరోగ్యంగా ఉండేట్లు చేసే జన్యువులలో అసాధారణ మార్పులు జరగడం వల్ల కేన్సర్‌ వస్తుంది. దేహంలో పెరిగే అన్నిరకాల కణితులు లేదా ట్యూమర్లు ప్రమాదకరం కాదు. కేన్సర్‌ కారకమైన ట్యూమర్లు స్థనాలలో వేగంగా విస్తరిస్తూ, ఇతర కణాలను కూడా వ్యాధికి గురిచేస్తాయి. స్థనాలలో పెరిగే ఈ ప్రమాదకర ట్యూమర్‌లను ‘బ్రెస్ట్‌ కేన్సర్‌’ అంటారు.


సాధారణంగా బ్రెస్ట్‌ కేన్సర్‌ అనేది పాలను ఉత్పత్తి చేసే గ్రంథులలోని కణజాలంలోనూ లేదా గ్రంథుల నుంచి చనుమొనలకు పాలను సరఫరా చేసే నాళాలలోనూ వస్తుంది. అతి కొద్దిమందిలో స్థన కండరాలకు కూడా వచ్చే అవకాశం ఉంది. 99శాతం వరకు కేన్సర్‌ అనేది వయసు ప్రభావం వల్ల, జన్యువులలో కలిగే అసాధారణ మార్పుల వల్ల వస్తుంది. కేవలం పది శాతం మందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశముంది. 


చాలా వరకు కేన్సర్‌ కారకాలు మన నియంత్రణలో ఉండవు. ఉదాహరణకు వయసు, కుటుంబ నేపథ్యం, ఆరోగ్య నేపథ్యం మొదలైనవి కానీ, అధిక బరువు వ్యాయామం, మద్యపానం వంటి కారకాలను మనం నియంత్రించవచ్చు. 


నియంత్రించగలిగే కారకాలు

బరువు: అధిక బరువు కలిగిన మహిళలకు మరీ ముఖ్యంగా మెనోపాజ్‌ దశ దాటిన వారికి కేన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 


ఆహారం: వైజ్ఞానికంగా నిరూపించాల్సి ఉన్నప్పటికీ, ఆహారపుటలవాట్ల వల్ల కూడా కేన్సర్‌ వస్తుందనేది నిపుణుల భావన. కాబట్టి మాంసాహారం, జంతు సంబంధిత కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించడం మంచిది. ఎందుకంటే వీటిలో వివిధ రకాల హార్మోనులు, యాంటీ బయోటిక్స్‌, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తక్కువ శాతం కొవ్వు గల తాజా కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. 


వ్యాయామం: వ్యాయామం వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజు కనీసం 45 నుంచి 60 నిమిషాలు వ్యాయామం చేయడం ఉత్తమం.


మద్యపానం: మద్యపానం వల్ల రక్తంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. దాని వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండడం మంచిది. 


ధూమపానం: ధూమపానం వల్ల కూడా కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 


ఈస్ట్రోజన్‌: ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థనాల పెరుగుదలకు తోడ్పడుతుంది. దీర్ఘకాలం పాటు బయటి నుంచి ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తీసుకోవడం వల్ల బ్రెస్ట్‌ కేన్సర్‌ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఎక్కువ కాలం కంబైన్డ్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ (ఉట్టటౌజ్ఛుఽ + ్కటౌజ్ఛట్ట్ఛటౌుఽ్ఛ; ఏఖఖీ)ని తీసుకోవడం వల్ల లేదా కేవలం ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ను 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఎటువంటి విరామం లేకుండా తీసుకోవడం వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. 


స్ట్రెస్‌, యంగ్జైటీ: స్ట్రెస్‌, యాంగ్జైటీ అనేవి కేన్సర్‌ కారకాలుగా వైజ్ఞానికంగా నిరూపించబడనప్పటికీ మానసిక ఒత్తిడి, ఆందోళనలను సాధ్యమైనంతగా తగ్గించుకోవడం వల్ల సుఖమయ జీవితాన్ని గడపవచ్చు.

డాక్టర్‌ సిహెచ్‌. మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్. ఫోన్‌: 98480 11421

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.