ఇవేం ‘చావు’ లెక్కలో..

ABN , First Publish Date - 2021-05-09T07:34:26+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ మరణాలు కలవరం పుట్టిస్తున్నాయి.

ఇవేం ‘చావు’ లెక్కలో..
కాకినాడ శివారు తూరంగి శ్మశాన వాటికలో శనివారం కాలుతున్న కొవిడ్‌ మృతుల చితులు

జిల్లాలో కొవిడ్‌తో వందల్లో కన్నుమూస్తున్న బాధితులు

ఒక్కో ఆసుపత్రిలో ప్రతి రోజూ పదుల సంఖ్యలో మరణాలు

జీజీహెచ్‌, డీహెచ్‌, జీఎస్‌ఎల్‌, కిమ్స్‌లలో వారం వ్యవధిలో 470 మందికిపైగా మృతి

ఇందులో ఒక్క జీజీహెచ్‌లోనే ఏడు రోజుల్లో 250 మందికిపైగా మృత్యువాత

ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య అంతా గోప్యమే

ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లు దొరక్క కొందరు, చికిత్స ఆలస్యంతో మరికొందరు కన్నుమూత

అయితే డిశ్చార్జి, లేదా మరణం సంభవిస్తేనే ఖాళీ అవుతున్న పడకలు

అయినా ఇవేవీ పట్టని ప్రభుత్వం.. ఈ వారంలో 56 మందే చనిపోయినట్టు నిర్ధారణ

మిగిలిన మరణాలేవీ సర్కారు లెక్కల్లోకి ఎక్కని వైనం

జిల్లాలో కొవిడ్‌ కరాళ నృత్యానికి నిలువెత్తు మనుషులు నిలువునా కూలిపోతున్నారు. వైరస్‌ దాడితో గంటల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నారు. ఓ డాక్టరు.. పోలీసు... లాయర్‌.. టీచర్‌... నర్సు.. ఓ తండ్రి.. తనయుడు.. భార్యాభర్తలు...    కొడుకులు.. కూతుర్లు... ఇలా ఒకటేంటి అన్ని రంగాల వ్యక్తులు.. అల్లుకుపోయిన బంఽధాలు మహమ్మారి బారినపడి బద్ధలవుతున్నాయి. వందలాది పచ్చని కుటుంబాలు కకావికలమైపోతున్నాయి. కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరింది మొదలు కేవలం మూడు లేదా నాలుగు రోజుల్లో వందలాది మంది పరిస్థితి విషమించి చనిపోతున్నారు. సకాలంలో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు అందక కొందరు, తీరా అందినా అప్పటికే ఆలస్యం కావడంతో మరికొందరు వరుసగా ప్రాణాలొదిలేస్తున్నారు. దీనికి సాక్ష్యమే అనేక శ్మశాన వాటికల్లో మండుతున్న చితుల లెక్కలు.  జీజీహెచ్‌ మొదలు రాజమహేంద్రవరం డీహెచ్‌, జీఎస్‌ఎల్‌, కిమ్స్‌, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో నిత్యం వందల్లో మరణమృదంగా జరుగుతోంది. గడచిన వారం వ్యవధిలో కేవలం ఈ నాలుగు ఆసుపత్రుల్లో 470 మందికిపైగా చనిపోయారు.. వీరిలో 250 మంది ఒక్క జీజీహెచ్‌లోనే ఉన్నారు. కానీ సర్కారు లెక్కలు మాత్రం 56 మాత్రమే చూపిస్తుండడం విషాదకరం.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ మరణాలు కలవరం పుట్టిస్తున్నాయి. వందలాది కుటుంబాలకు పెద్దదిక్కు లేకుండా చేస్తున్నాయి. ప్రతిరోజు జిల్లాలో భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలకు అంతే లేకుండా ఉంది. ఇవేవీ సర్కారు లెక్కలకు ఎక్కడం లేదు. దీంతో బాధిత కుటుంబీకులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. సగానికిపైగా హోంఐసోలేషన్‌లో ఉంటుండగా, మిగిలిన వారిలో పదుల సంఖ్యలో బాధితులు తీవ్ర జ్వరం, శ్వాస సమస్యలతో అల్లాడుతూ ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్‌కు బాధితులు వందల్లో వస్తున్నారు. కానీ ఇప్పటికే ఆసుపత్రిలో ఐసీయూ, ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ బెడ్లన్నీ నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరికి కూడా చికిత్స అందిస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చే బాధితులకు బెడ్‌ దొరకడం లేదు. ఒకవేళ పరిస్థితి విషమించి పడక కావాలని అడిగితే అప్పటికే బెడ్‌పై ఉన్న బాధితుల్లో ఎవరొకరు డిశ్చార్జి అవడమో లేదా చనిపోవడమో జరిగితే బెడ్‌ ఇస్తా మంటూ అధికారులు తెగేసి చెబుతున్నారు. ఇదే పరిస్థితి రాజమహేంద్రవరం డీహెచ్‌, జీఎస్‌ఎల్‌, అమలాపురం కిమ్స్‌లో నెలకొంది. జీజీహెచ్‌లో 62 ఐసీయూ,794 ఆక్సిజన్‌ పడకలున్నాయి. డీహెచ్‌లో 53 ఐసీయూ, 367 ఆక్సిజన్‌ బెడ్లు, జీఎస్‌ఎల్‌లో 20 ఐసీయూ, 280 ఆక్సిజన్‌, కిమ్స్‌లో 50 ఐసీయూ, 200 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయి. ఇవి కాక మిగిలిన ప్రైవేటు ఆసుపత్రుల్లో 505 వరకు ఐసీయూ పడకలున్నాయి. అయితే పోటెత్తుతున్న బాధితులతో ఇవన్నీ నిండిపోయాయి. దీంతో రోజూ వస్తున్న కొత్త బాధితులకు ఇవి దొరకడం లేదు. ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా బెడ్‌ లేదనే సమాధానమే వస్తోంది. దీంతో శ్వాస సమస్య తీవ్రంగా ఉన్న వారి పరిస్థితి విషమిస్తోంది. బెడ్‌ ఎప్పుడు దొరుకుతుందో తెలియక, ఒకవేళ దొరికినా అప్పటికే పరిస్థితి విషమించి అనేకమంది చనిపోతున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఐసీయూ పడకలు దొరక్క రోజుకు ఎంతమంది ప్రాణాలు వదులుతున్నారో లెక్క లేదు. అటు చివరి నిమిషంలో పడక దొరికాక చనిపోతున్న వారి సంఖ్య సైతం గోప్యంగానే ఉంటోంది. కోనసీమకు చెందిన ఓ 56 ఏళ్ల వ్యక్తి ఆక్సిజన్‌ పల్స్‌ పడిపోయి గురువారం రాత్రి జీజీహెచ్‌లో చేరారు. శుక్రవారం సాయంత్రం ఐసీయూకి తరలించాల్సిన పరిస్థి తి. తీరా శనివారం తెల్లవారుజామువరకు పడక దొరకలేదు. దీంతో తెల్లవారు మూడున్నరకు కన్నుమూశారు. ఇలా ఎందరో జీజీహెచ్‌,డీహెచ్‌, కిమ్స్‌, జీఎస్‌ఎల్‌, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు దొరక్క కన్నుమూస్తున్నారు. కొందరికి ఆలస్యంగా బెడ్‌ దొరికినా అప్పటికే పరిస్థితి విషమించి చనిపోతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌తో కన్నుమూస్తున్న వారిలో వైరస్‌ ధాటికి ఊపిరితిత్తులు పనిచెయ్యకపోవడం, మరికొందరికి గుండెపోటు సంభవిస్తోంది. ఇలా మే1 నుంచి 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నాలుగు ఆసుపత్రుల్లో 470 మంది కన్నుమూశారంటే వైరస్‌ ఏ స్థాయిలో ప్రాణాలు హరించేస్తుందో తల్చుకుంటేనే భయమేస్తోంది. ఒక్క జీజీహెచ్‌లో 250 మం ది వారం వ్యవధిలో చనిపోయారు. ఒకరకంగా రోజుకు 35 నుంచి 40 మంది వరకు ఇక్కడ చనిపోతున్నారు. అధికారిక లెక్కలు మాత్రం మే 1న ఆరుగురు, 2న 8, 3న 6, 4న 6, 5న 6, 6న 5, 7న 5 మంది చొప్పున చనిపోయినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. కాకినాడ రూరల్‌లోని తూరంగా శ్మశానవాటికలోనే రోజుకు 30 వరకు కొవిడ్‌ మృతుల చితికి నిప్పంటిస్తున్నారు. రాజమహేంద్రవరం డీహెచ్‌లో రోజూ 20 మంది వరకు కన్నుమూస్తున్నారు. కానీ రోజుకు ముగ్గురు లేదా నలుగురినే లెక్కల్లో చూపిస్తున్నారు. అటు జీఎస్‌ఎల్‌లో సంఖ్య చెప్పక్కర్లేదు. వారం వ్యవధిలో ఇక్కడ వందల్లో కన్నుమూశారు. దీంతో వీరందరికి రాజమహేంద్రవరం కైలాసభూమిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిత్యం చితులు కాలుతూనేఉన్నాయి. అమలాపురం కిమ్స్‌, మరో ప్రైవేటు ఆసుపత్రిలో కలిపి వారంలో 53 మంది కొవిడ్‌తోను, అనంతర చికిత్స మధ్యలోను చనిపోయారు. కానీ లెక్క పది కూడా చూపడం లేదు. ఇలా అన్ని ఆసుపత్రుల్లోను అదే తీరు. కొవిడ్‌ మరణాలను ఎక్కడికక్కడ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోప్యంగా ఉంచుతున్నా రు. వాస్తవ మరణాల సంఖ్యలో పాతిక శాతం కూడా బయటకు చూపడం లేదు. వారం వ్యవధిలో ఇంతమంది చనిపోతే ప్రభుత్వం మాత్రం కొవిడ్‌ బులిటెన్‌లో కేవలం జిల్లాలో 56 మంది చనిపోయినట్టు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో శ్మశానవాటికల్లో మండుతున్న చితులు మాత్రం అసలు లెక్కలను బయటపెడుతున్నాయి.




Updated Date - 2021-05-09T07:34:26+05:30 IST