ఫిత్రా ఎందుకంటే...

May 7 2021 @ 00:00AM

పండగలైనా, ఉత్సవాలైనా వివిధ జాతులు, తెగల సంస్కృతులనూ, ఆచారాలనూ, జీవన విధానాన్నీ ప్రతిబింబిస్తాయి. ఇస్లాంలోని పండగల ఆంతర్యం రెండు విషయాల మీద ఆధారపడి ఉంది. మొదటిది... దైవం ప్రసాదించిన ఎన్నో అంశాల మీద మనం జీవిస్తున్నాం, కాబట్టి ఆయన అందించిన ఎనలేని వరాలకు కృతజ్ఞతలు అర్పించడం, దైవం ఔన్నత్యాన్ని కొనియాడడం. రెండోది... సమాజంలో ఉన్న నిరుపేదలు, అవసరంలో ఉన్నవారు, అనాథలు, వితంతువులను పండుగ సందర్భంగా చేసుకొనే సంబరాల్లో భాగంగా చేర్చుకోవడం. ఇలా ఒకవైపు ఏ పండగ సందర్భంలోనైనా దైవానికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, దేవుని దాసుల పట్ల సానుభూతి చూపించాలని ఇస్లాం ఆదేశిస్తుంది. బక్రీద్‌ రోజున ఖుర్బానీ ద్వారా, ఈద్‌ ఉల్‌ ఫితర్‌ (రంజాన్‌) నాడు ఫిత్రా దానం ద్వారా పేదలకు సహాయం అందుతుంది. 


‘ఫిత్రా’ అంటే ఉపవాస విరమణ లేదా పరిపూర్తి అని అర్థం. ‘సదఖాయె ఫిత్ర్‌’ అంటే రంజాన్‌ నెలలో చివరి ఉపవాసాలు (రోజాలు) పూర్తయిన తరువాత పేదలకు విధిగా ఇచ్చే దానం. రంజాన్‌ ఉపవాసాలను ముస్లింలకు విధిగా నిర్దేశించిన సంవత్సరమే ఫిత్రా దానాన్ని ఇవ్వాలని కూడా దైవ ప్రవక్త మహమ్మద్‌ ఆదేశించారు. సదఖాయే ఫిత్ర్‌ ముఖ్యమైన ఉద్దేశ్యాలు రెండు. ఉపవాస సమయంలో మనిషి ఎంత జాగ్రత్తగా మసలుకున్నా తెలిసో, తెలియకో పొరపాట్లు జరుగుతాయి. అతను తన సంపద నుంచి దైవమార్గంలో సంతోషంగా ఖర్చుపెడితే... అతని వల్ల జరిగిన పొరపాట్ల క్షమాపణకు అది దోహదపడుతుంది. అలాగే, అందరూ రంజాన్‌ పండుగ సంబరాల్లో మునిగి ఉన్న తరుణంలో... సమాజంలో కనీసం కడుపు నిండా తిండీ, ఒంటి నిండా దుస్తులూ లేని నిరుపేదలు, అనాథలు, ఆర్తులూ కూడా పండుగ సంతోషాలలో పాల్గొనాలనేది ఫిత్రా లక్ష్యం.


‘‘ఫిత్రాను ముస్లిం సమాజానికి విధిగా (వాజిబ్‌) నిర్ణయించడం జరిగింది. అది ఉపవాస కాలంలో మనిషి చేసిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. తద్వారా బీదలకూ, అనాథలకూ భోజన సదుపాయం కలుగుతుంది. ఎవరైతే పండుగ నమాజ్‌కు ముందు ఫిత్రా చెల్లిస్తారో... దాన్ని గొప్ప ఫిత్రా దానంగా అల్లాహ్‌ స్వీకరిస్తాడు. నమాజ్‌ తరువాత చెల్లించే ఫిత్రాను మామూలు దానంగా స్వీకరిస్తాడు’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ స్పష్టం చేశారు. 


ఫిత్రా ఎవరు చెల్లించాలి?

ఆర్థిక స్థోమత ఉన్న పురుషులు తమ తరఫున, యుక్త వయసుకు రాని తమ సంతానం తరపున ఫిత్రా చెల్లించాలి. యుక్త వయసుకు వచ్చిన సంతానానికి ఆర్థిక స్థోమత ఉంటే వారే స్వయంగా చెల్లించాలి. లేనట్టయితే వారి తరఫున వారి తండ్రి చెల్లించాల్సి ఉంటుంది. తండ్రి మరణిస్తే, అతని సంతానం తరఫున ఫిత్రా నెరవేర్చాల్సిన బాధ్యత వారి తాతపై ఉంటుంది. ఇక, తినే వస్తువుల నుంచి ఒక ‘సా’ పరిమాణం (‘సా’ అంటే రెండున్నర కిలోలు) మేరకు ఫిత్రా దానంగా ఇవ్వాలి. అవసరంలో ఉన్నవారు, నిరుపేదలు, జకాత్‌ వసూలు కోసం నియమితులైనవారికీ ఫిత్రా ఇవ్వాలి. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడానికీ, బానిసలను విముక్తి చేయడానికీ, ఋణగ్రస్తులను ఋణ విముక్తుల్ని చెయ్యడానికీ, దైవమార్గంలో ఖర్చు పెట్టడానికీ, బాటసారులకూ కూడా ఫిత్రాను వినియోగించవచ్చు. ఒక వ్యక్తి ఒకరు లేదా అంతకన్నా ఎక్కువమంది పేదలకు ఫిత్రా ఇవ్వవచ్చు. కొందరు వ్యక్తులు తమ ఫిత్రాలను కలిపి ఒకరికి లేదా ఎక్కువమందికీ ఇవ్వవచ్చు. ఈద్‌ నమాజ్‌కు ముందే పేదలకు ఫిత్రా దానం ఇవ్వాలి. ఈద్‌కు రెండు, మూడు రోజుల ముందు అందజేస్తే వారి అవసరాలకు పనికొస్తాయి. 

రంజాన్‌ మాసంలో రోజాలు పాటించని వారు కూడా ఫిత్రా దానం చెయ్యాలన్నది నియమం. ఈ దానం చెల్లించనంతవరకూ రంజాన్‌ ఉపవాసాలు భూమికీ, ఆకాశానికీ మధ్య వేలాడుతూ ఉంటాయనీ, దైవ సన్నిధికి చేరవనీ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఉపవాసాలు దేవుని స్వీకారానికి నోచుకోవాలంటే ఫిత్రా దానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.