హార్ట్ ఎటాక్ రోగుల్లో గోల్డెన్ అవర్ అంటే ఏమిటి?

ABN , First Publish Date - 2022-07-12T01:32:45+05:30 IST

హార్ట్ ఎటాక్ మరణాలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. గుండెపోటుకు గురైన వారికి తక్షణమే వైద్య సాయం అందించాల్సి

హార్ట్ ఎటాక్ రోగుల్లో గోల్డెన్ అవర్ అంటే ఏమిటి?

హార్ట్ ఎటాక్ మరణాలు ఇటీవల సర్వసాధారణమైపోయాయి. గుండెపోటుకు గురైన వారికి తక్షణమే వైద్య సాయం అందించాల్సి ఉంటుంది. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో అవాంతరాలు ఏర్పడినప్పుడు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. నిజానికి అన్ని కార్డియాక్ అరెస్టుల్లో తక్షణ వైద్య సదుపాయం అవసరం ఉండకపోవచ్చు. ఓ రోగిలో హార్ట్ ఎటాక్ లక్షణాలు కనిపించిన తర్వాత మొదటి గంట ఎంతో కీలకం.  వీరికి హాస్పిటల్‌లో తక్షణమే చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనినే గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్‌లో రోగి జీవితాన్ని కాపాడేందుకు సీపీఆర్ అత్యవసరం. కార్డియాక్‌ అరెస్ట్‌ అయిన రోగులకు అతి తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. దాదాపు ఐదు నిమిషాలలో సీపీఆర్‌ (కార్డియోపల్మనరీ రిస్సిటేషన్‌)తో కోలుకోవచ్చు.  


హార్ట్ ఎటాక్‌లో గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ కంటే తక్కువగా ఉంటుంది. అదే కార్డియాక్ అరెస్ట్‌లో గుండె అకస్మాత్తుగా ఆగిపోతుంది. కాబట్టి కార్డియాక్ అరెస్ట్ తర్వాత ప్రతి నిమిషమూ కీలకమేనని అంటారు విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ మెడిసన్, యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ బి. శ్రీనివాసన్. కార్డియాక్‌ అరెస్ట్‌ తరువాత  ఐదు నిమిషాలలో స్పృహలోకి వస్తే ఆ రోగి కోలుకునేందుకు 60–70 శాతం అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఆ తరువాత జరిగే  ప్రతి నిమిషం ఆలస్యంతో రోగి జీవించే అవకాశాలు 10 శాతం చొప్పున తగ్గిపోతుంటాయని అన్నారు. 


హార్ట్‌ఎటాక్ రోగులు సాధారణంగా  ఛాతీలో నొప్పి అని ఫిర్యాదు చేస్తుంటారని, ఇలాంటి  సమయంలో పక్కన ఉన్న వారు రోగిని తగినంత గాలి ఉన్న ప్రాంతంలో కూర్చోపెట్టి దగ్గర్లోని కార్డియాక్‌ సెంటర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించాలని డాక్టర్ శ్రీనివాసన్ తెలిపారు. కార్డియాక్‌ అరెస్ట్‌ అయిన రోగులు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతోపాటు శ్వాస కూడా తీసుకోలేరని, అలాంటప్పుడు పక్కన ఉన్నవారు వారికి సీపీఆర్‌ చేయాల్సి ఉంటుందని అన్నారు. రోగి తనంతట తానుగా శ్వాసించడం మొదలుపెట్టిన వెంటనే వైద్య సహాయం అందేవరకూ రోగి ఎడమ వైపు పడుకుని ఉండేలా చూడాలని సూచించారు. హార్ట్‌ఎటాక్‌/కార్డియాక్‌ అరెస్ట్‌ అయినప్పుడు ప్రతి నిమిషమూ కీలకమేనని, కాబట్టి గోల్డెన్‌ అవర్‌ విలువ తెలుసుకోవడంతో పాటు సీపీఆర్‌ ప్రక్రియ పట్ల కూడా అవగాహన మెరుగుపరుచుకోవాలని సూచించారు.


మణిపాల్ ఆసుపత్రికి ప్రతి రోజూ దాదాపు 30 మంది వరకు వస్తుంటారని ఇలాంటి రోగులు వస్తుంటారని డాక్టర్ శ్రీనివాసన్ తెలిపారు. అయితే, వీరందరికీ తక్షణమే వైద్య సహాయం అవసరం ఉండకపోవచ్చని అన్నారు. వీరిలో చాలామంది సాధారణ ఛాతీలో నొప్పితోనే వస్తుంటారని, వీరిని పరిశీలించిన తరువాత ఇంటి వద్దనే చికిత్స తీసుకునేలా ట్రీట్‌మెంట్‌ ప్లాన్స్‌ను సూచిస్తుంటామన్నారు. అయితే, నెలలో కనీసం ఓ పదిమంది రోగులు అయినా తీవ్రస్థాయి హార్ట్‌ ఎటాక్‌, లేదంటే కార్డియాక్‌ అరెస్ట్‌ సమస్యలతో బాధపడుతుండడం తాము చూస్తుంటామని డాక్టర్ శ్రీనివాసన్ వివరించారు.


Updated Date - 2022-07-12T01:32:45+05:30 IST