అసలు Golden Visa అంటే ఏంటి..? UAE ఇచ్చే ఈ వీసాతో కలిగే లాభాలేంటి..?

Oct 9 2021 @ 10:14AM

అబుధాబి: వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది.    


గోల్డెన్ వీసా ఎవరికిస్తారంటే..

2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు. 


10 ఏళ్ల వీసాకు అర్హులు వీరే..

పదేళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్ల పెట్టుబడి), ప్రత్యేక ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పెట్టుబడిదారులు: 

పబ్లిక్ పెట్టుబడులలో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడి అనేక రూపాల్లో ఉండవచ్చు.

* దేశంలోని ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్(రూ.20.50కోట్లు) డిపాజిట్ చేయడం

* యూఏఈలో రూ.20.50కోట్లకు తక్కువ కాకుండా మూలధనంతో కంపెనీని స్థాపించడం

* రూ. 20.50కోట్లకు తగ్గకుండా షేర్ విలువ కలిగిన ప్రస్తుత, కొత్త కంపెనీలో భాగస్వామిగా చేరడం

షరతులు:

* పెట్టుబడి పెట్టిన ధనం లోన్ రూపంలో తీసుకోని ఉండకూడదు.

* పెట్టుబడులను కనీసం మూడేళ్లపాటు ఉంచాలి.

* రూ.20.50కోట్ల వరకు ఫైనాన్షియల్ సాల్వెన్సీ ఉండాలి.


వ్యాపార భాగస్వాములకు కూడా ఈ వీసాను అనువర్తింప చేయవచ్చు. అయితే, ప్రతి భాగస్వామి రూ.20.50కోట్లకు తగ్గకుండా పెట్టుబడి పెట్టాలనే షరతు అనురించాల్సి ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక వీసాలో జీవిత భాగస్వామి, పిల్లలు, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఒక సలహాదారు ఉండవచ్చు. ఇక విదేశాల నుండి పెట్టుబడిదారులు ఆరు నెలల కాలానికి మల్టీపుల్ ఎంట్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రత్యేక ప్రతిభావంతులు: 

సైన్స్ అండ్ నాలెడ్జ్ రంగంలోని అధ్యయనం చేసేవారు అంటే వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, సంస్కృతి మరియు కళ రంగంలో సృజనాత్మక వ్యక్తులు. వీసా ప్రయోజనం జీవిత భాగస్వామి, పిల్లలకు వర్తిస్తుంది. అలాగే ఈ అన్ని కేటగిరీలు యూఏఈలో ప్రాధాన్యత కలిగిన ప్రత్యేక రంగంలో చెల్లుబాటు అయ్యే ఉపాధి ఒప్పందాన్ని కలిగి ఉండాలి.

షరతులు: 

ప్రత్యేక ప్రతిభావంతులకు ఈ కింది షరతులకు లోబడి ఈ దీర్ఘకాలిక వీసా మంజూరు చేయబడుతుంది. 

* సైంటిఫిక్ ఎక్సలెన్స్ కోసం శాస్త్రవేత్తలకు ఎమిరేట్స్ సైంటిస్ట్స్ కౌన్సిల్ లేదా మహ్మద్ బిన్ రషీద్ మెడల్ హోల్డర్లుగా తప్పనిసరిగా గుర్తింపు పొందాలి.

* సంస్కృతి మరియు కళలో సృజనాత్మక వ్యక్తులు తప్పనిసరిగా సాంస్కృతిక మరియు యువత మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందాల్సి ఉంటుంది.

* ఆవిష్కర్తలు తప్పనిసరిగా తమ ఆవిష్కరణకు పేటెంట్‌ విలువను పొంది ఉండాలి. ఇది యూఏఈ ఆర్థిక వ్యవస్థకు యాడ్ అవుతుంది. అలాగే ఈ పేటెంట్‌లను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించాలి.

* ఎగ్జిక్యూటివ్‌లు తప్పనిసరిగా ప్రముఖ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కంపెనీ యజమానులై ఉండాలి. 

* ఇక వైద్యులు, స్పెషలిస్టులు ఈ క్రింది షరతులలో కనీసం రెండింటినీ కలిగి ఉండడం తప్పనిసరి.

** ప్రపంచంలోని టాప్ 500 విశ్వవిద్యాలయాలలో ఒకదాని నుండి Ph.D. డిగ్రీ కలిగి ఉండాలి.

** దరఖాస్తుదారు తన పని రంగంలో పొందిన అవార్డు లేదా ప్రశంసా పత్రాలు కలిగి ఉండటం తప్పనిసరి.

** తమ ఫీల్డ్‌కు సంబంధించిన సంస్థలో సభ్యత్వం

** ఒక పీహెచ్‌డీ డిగ్రీతో పాటు తాము పనిచేసే రంగంలో 10 ఏళ్ల ప్రొఫెషనల్ అనుభవం తప్పనిసరి

5 ఏళ్ల గోల్డెన్ వీసాకు అర్హులు వీరే..

ఐదేళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

1. పెట్టుబడిదారులు:

* పెట్టుబడిదారుడు 5 మిలియన్ల దిర్హమ్స్‌కు(రూ.10.25కోట్లు) తగ్గకుండా స్థూల విలువ కలిగిన ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి.

* రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టిన మొత్తం రుణం తీసుకున్నదై ఉండకూడదు.

* ఆస్తిని కనీసం మూడేళ్లపాటు నిలుపుకోవాలి.

2. పారిశ్రామికవేత్తలు:

* 5లక్షల మిలియన్ దిర్హమ్స్ కనీస మూలధనంతో ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్ ఉన్నవారు లేదా దేశంలో గుర్తింపు పొందిన బిజినెస్ ఇంక్యుబేటర్ ఆమోదం పొందిన పారిశ్రామికవేత్తలు

* వ్యవస్థాపకుడికి ఆరు నెలల పాటు మల్టీ-ఎంట్రీ వీసా అనుమతించబడుతుంది. మరో ఆరు నెలలకు పునరుద్ధరించబడుతుంది. దీర్ఘకాలిక వీసాలో జీవిత భాగస్వామి, పిల్లలు, భాగస్వామి, ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఉంటారు.

3. ప్రతిభావంతులైన విద్యార్థులు:

* ప్రభుత్వ, ప్రైవేట్ మాధ్యమిక పాఠశాలల్లో కనీసం 95 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అత్యుత్తమ విద్యార్థులు.

* విశ్వవిద్యాలయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 3.75 డిస్టింక్షన్ జీపీఏ కలిగి ఉన్నవారు.

* దీర్ఘకాలిక వీసాలో అత్యుత్తమ విద్యార్థుల కుటుంబాలు ఉంటాయి.


ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వీరిలో బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ ఉంది. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా గోల్డెన్ వీసా అందుకున్నారు. 

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.